చదువులో మేటి...వ్యవసాయంలో ఘనాపాటి


బొబ్బిలి రూరల్‌ : అతనో యువకుడు. అందరిలానే బాగా చదువుకున్నాడు. పీజీ వరకు చదివి మంచి మార్కులు సాధించాడు. అయితే అందరూ వద్దనుకుంటున్న వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించి మంచి ఫలసాయం సాధించాలని కంకణం కట్టుకున్నాడు. అన్నదమ్ములంతా బాగా చదువుకుని ఉద్యోగాలలో స్థిరపడ్డారు.కానీ ఆయన మాత్రం కన్నతల్లిదండ్రులను, వ్యవసాయాన్ని విడిచిపెట్టకుండా అట్టిపెట్టుకుని బాధ్యతలు తీసుకుని వ్యవసాయంలో అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఆతనే పట్టణ పరిధిలో గొల్లపల్లి గ్రామంలో ఉన్న సబ్బాన రామారావు. రామారావు ఎంఏ వరకు చదివాడు. తల్లిదండ్రులు ప్రేమగా పెంచుకుంటున్న వ్యవసాయాన్ని మరింత అభివృద్దిచేయాలనుకున్నాడు. ఉన్న పొలంలో వరి పంట వేసాడు.



వ్యవసాయశాఖాధికారులకునిత్యం అందుబాటులో ఉండి వారి సలహాలు తీసుకునే రామారావు ప్రయోగాల రామారావుగా మారిపోయాడు. గతంలో శ్రీవరిసాగుచేసిన ఏకైక రైతు రామారావు కావడం విశేషం. శ్రీవరి తరువాత రైతులు అనుసరించిన జీవనియంత్రణ పద్దతిలో సాగుచేయడానికి డివిజన్‌లో ఆయన పొలాన్నే ఎంచుకున్నారు. ఎలాంటి పురుగుల మందులు వాడకుండా సేంద్రీయ ఎరువుల ద్వారా సాగుచేసే పద్దతే జీవనియంత్రణపద్దతి. ఈ పద్దతిలో పంగల కర్రల ద్వారా పక్షులను ఆకట్టుకుని, ఫెరమోన్‌ ట్రేప్స్‌ ద్వారా పురుగులను వలల్లో బంధించి సాగుచేస్తారు. 3ఎకరాలలలో సాగుచేస్తూ మంచిఫలితాలు రాబట్టి అందరిచే శెహభాష్‌ అనిపించుకుంటున్నాడు రామారావు. సుభాష్‌పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయంఅయితే నేమి, పొలానికి కాకుండా పంటకు నీరందించే స్పింక్లర్లు,డ్రిప్‌ పద్దతిలో కూడా పూర్తిస్థాయిలో వ్యవసాయం చేçస్తున్న రామారావు పాడి దిగుబడికి కృషిచేస్తున్నాడు.



2పశువులను పెంచుతూ వాటిద్వారా వచ్చే పేడద్వారా బయోగ్యాస్‌ తయారుచేసి వంటలకు ఉపయోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్నాడు. పాడి వ్యాపారంలో రామారావు దిట్ట. ఇదిలా ఉండగా వాణిజ్యపంట అయిన మొక్కజొన్న,నువ్వు తదితర పంటలతో పాటు పచ్చిమిర్చి,ఆనప,చిక్కుడు,బీర తదితర కూరగాయల సాగుచేస్తూ అధికదిగుబడి, అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. వ్యవసాయయాంత్రీకరణలో ఆధునిక యంత్రాల సహాయంతో వ్యవసాయం చేస్తున్న రామారావు 2008లో వైఎస్‌ హయాంలో ఆదర్శరైతుగా నియమితులైన రామారావు చిన్న వయసులోనే ఉద్దండులైన రైతులకు ఆధునిక సేద్యం,ప్రయోగాలపై అవగాహన కల్పిస్తుంటారు. దిగుబడి, సేద్యం లేకపోతే దేశం భవిష్యత్తు ఏమైపోతోందో అని ఆలోచిస్తుంటాడు. పనిచేయడానికి కూలీలు దొరకకుండా పోతున్నారని, ఉన్న పంటపొలాలను రియల్‌ ఎస్టేట్లుగా మార్చేసి కన్నవాళ్లను,ఉన్న ఊరిని వదిలి పోతున్నరైతులను చూస్తే బాధేస్తోందని రామారావు ఆవేదన చెందుతున్నాడు.



రామారావు కుమారుడు హర్షవర్దన్‌ సీఏ చదువుతుండగా, కుమార్తె సుకన్య ఇంజినీరింగ్‌ చదువుతోంది. తన తరువాత వ్యవసాయం పరిస్థితేంటని ఆవేదన చెందుతున్న రామారావు వ్యవసాయంలో పలు అవార్డులు అందుకున్నాడు. ప్రోత్సాహకాలు లేని వాటిపై మమకారం లేదని,రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. డివిజన్‌లో ఎలాంటి ప్రయోగాలకైనా అధికారులకు ముందు కనిపించేది రామారావే అనడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయానికి మరింత ఆదరణ, ప్రోత్సాహకం ఉండాలని, ఇప్పుడున్న పరిస్థితిలో వ్యవసాయం చేయడం కష్టంతో కూడుకున్న పని అని రైతులు వాపోతున్నా చేసే పనిలో ఇçష్టం ఉంటే ఎంతపనైనా చేయవచ్చని రామారావు చెబుతున్నాడు.



వ్యవసాయం అభివృద్దిచేయాలి...

దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గిపోతున్నాయి.అలాగే పాడి సంపద వృద్దిలేదు.పాలేకర్‌విధానాలతో ప్రకృతిసేద్యంద్వారా వ్యవసాయాన్ని అభివృద్దిచేయాలి. లేకుంటే దేశాభివృద్ది, ఆర్దికాభివృద్ది తిరోగమనం చెందుతాయి. ఎవరిమీదో అరోపణలు,నిరాశ,నిస్పృహచెందకుండా వ్యవసాయం చేసి దేశాభివృద్దికి యువత నడుంబిగించాలి.

సబ్బానరామారావు, యువరైతు,గొల్లపల్లి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top