'రోజంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం'


విజయవాడ: ‘ఉన్నట్టుండి ఒక్కసారిగా కుదుపు.. గోడలు కదులుతున్నాయి.. ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేని పరిస్థితిలో బామ్మను తీసుకుని పై అంతస్తు నుంచి రోడ్డు మీదకు చేరాం. అప్పటికే ఆ ప్రాంతంలోని వారంతా రోడ్డు మీదకు వచ్చేశారు. రోడ్డు కూడా భూకంప ప్రభావానికి గురైంది. 12 గంటల వ్యవధిలో మూడుసార్లు ఇలా భూమి కంపించడంతో ఇంట్లోకి వెళ్లలేక ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపైనే గడిపాం’ అని నేపాల్‌లోని క ఠ్మాండుకు వంద కి.మీ దూరంలో ఉన్న భరత్‌పూర్‌లో మెడిసిన్ చదువుతున్న గొరపర్తి హర్ష చెప్పారు.  ప్రకృతి విలయం నుంచి క్షేమంగా బయట పడిన హర్ష మంగళవారం నగరానికి చేరుకున్నారు. విజయవాడలోని మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలో నివసించే గొరపర్తి శివప్రసాద్ వ్యవసాయ శాఖలో పనిచేస్తుండగా, కుమారుడు హర్ష నేపాల్‌లోని భరత్‌పూర్‌లో మెడిసిన్ చేస్తున్నారు. అతడితో పాటు బామ్మ హేమలత కూడా అక్కడే ఉంటున్నారు. 24న నేపాల్‌లో భూకంపం రావడంతో విజయవాడలోని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


 


అయితే భూకంపం సంభవించిన మరుసటి రోజు ఉదయం కళాశాల యాజమాన్యం నాలుగు బస్సుల్లో భారత విద్యార్థులందరినీ తీసుకువచ్చి ఖరగ్‌పూర్‌లో దించిందని, అక్కడి నుంచి లక్నో చేరుకుని విమానంలో నగరానికి వచ్చామన్నారు. వారిద్దరూ క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఇంకా రెండున్నరేళ్ల కోర్సు మిగిలి ఉందని, ఇలాంటి విపత్కర పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా ఉండాలని ఆ భగవంతుణ్ని కోరుకుంటున్నట్లు హర్ష తండ్రి శివప్రసాద్ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top