తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు

పులివెందుల రూరల్ : 

 పులివెందుల నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నియోజకవర్గంలో తాగునీరు, వ్యవసాయంపైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గంలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన నాలుగు స్కీంలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ఏ స్కీంకు ఏమి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించి నీరు సక్రమంగా విడుదల చేయాలన్నారు. పులివెందుల మున్సిపాలిటీకి రూ.37కోట్లతో పార్నపల్లె సీబీఆర్ నుంచి ప్రత్యేక పైపులైన్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరు చేయిస్తామని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోని తొండూరు, వేముల, వేంపల్లె మండలాల్లో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. ఈనెల చివరిలోపు వర్షం కురిసినా దిగుబడి వచ్చే అవకాశంలేదన్నారు. సాగు చేసిన రైతులకు ఇన్‌ఫుట్ సబ్సిడీ వచ్చేం దుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి అర్హులైన రైతులను గుర్తించి నివేదికలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ జీవీ రమణ మాట్లాడుతూ జిల్లాలో 49మండలాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. అందులో ఓబులవారిపల్లెలో ఎక్కువగానూ, పుల్లంపేటలో సాధారణ వర్షపాతం నమోదైందన్నారు. ఈనెలాఖరు వరకు సాగు చేసిన రైతులు పొలాన్ని దున్నేయడం లాంటివి చేయవద్దన్నారు. పంట పరిశీలన కు వచ్చిన అధికారుల బృందానికి పంట ఖచ్చితంగా ఉండాలన్నారు. రైతులు పంట రుణాలను ఈనెల 15వ తేదీలోపల రెన్యువల్స్ చేసుకోవాలన్నారు.  రుణ మాఫీ కొంతమేర ఆలస్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ జ్ఞానశేఖర్, ఇన్‌ఛార్జి ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ మల్లికార్జునరావు, మున్సిపల్ కమిషనర్ రంగారావు, ఆత్మ పీడీ చంద్రనాయక్, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ మోహన్, తహశీల్దార్ శ్రీనివాసులు, నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top