ఎంబీబీఎస్ సీట్లు అమ్మబడును!

ఎంబీబీఎస్ సీట్లు అమ్మబడును! - Sakshi


15 శాతం ప్రభుత్వ సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాలో విక్రయం

వచ్చే ఏడాది నుంచి అమలుకు బాబు సర్కారు యోచన

15% ఎంబీబీఎస్ సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాలో విక్రయం

వచ్చే ఏడాది నుంచి అమలుకు బాబు సర్కారు యోచన

ఈ ఏడాది పద్మావతి మహిళా కళాశాలలో, వచ్చే ఏడాది అన్ని ప్రభుత్వ కాలేజీల్లోనూ అమలు

నివేదిక తయారీకి వైద్య ఆరోగ్యశాఖకు ఆదేశాలు

సర్కారీ కళాశాలల్లో ఎన్‌ఐఆర్‌ఐ కోటా అమలైతే  225 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోనున్న ప్రతిభావంతులు

 ఏటా రూ. 27 కోట్ల ఆదాయాన్ని లెక్కేస్తున్న సర్కారు

ఎన్‌ఆర్‌ఐ కోటా కుదరకపోతే రూ. 60 వేలు ఫీజు వసూలు ఆలోచన

 2000-2003 లోనే ప్రభుత్వాస్పత్రుల్లో యూజర్ చార్జీలు,  మెడిసిన్ సీట్లలో 5% ఎన్‌ఆర్‌ఐ కోటా ప్రవేశపెట్టిన చంద్రబాబు

 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చాక అవన్నీ రద్దుచేసిన వైనం


 

 డాక్టర్ కావాలనేది.. వైద్య వృత్తి చేపట్టాలనేది.. చాలా మంది యువత కల. రాష్ట్రంలో ఏటా లక్ష మంది విద్యార్థులు ఎంబీబీఎస్ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష రాస్తుంటారు. కానీ.. ఉన్న సీట్లేమో నాలుగైదు వేలే! అందులోనూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉన్న సీట్లు మరీ స్వల్పం!! ప్రతిభావంతులైన పేద విద్యార్థుల్లో అతి కొద్దిమందైనా తమ డాక్టర్ కలను సాకారం చేసుకునేందుకు ఈ ప్రభుత్వ కాలేజీల్లోని ఎంబీబీఎస్ సీట్లే ఆధారం. కానీ.. చంద్రబాబు సర్కారు ఆ కలకు గండి కొట్టే చర్యలు ప్రారంభించింది. సరిగ్గా పదకొండేళ్ల కిందట చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తలపెట్టిన ‘ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా’ను మళ్లీ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.

 

 నాడు 5 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాలో అమ్మకానికి పెట్టగా.. ఇప్పుడు ఏకంగా 15 శాతం సీట్లను ఈ పేరుతో అమ్మకానికి పెడుతున్నారు. అంటే ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు చెందాల్సిన ఆ 15 శాతం సీట్లు.. దాదాపు 225 సీట్లను.. వారికి చెందకుండా చేసి.. ఎన్‌ఆర్‌ఐ కోటా పేరుతో ప్రతిభతో నిమిత్తం లేకుండా ధనవంతులకు కట్టబెట్టబోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన 5 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాను ఆ మరుసటి ఏడాది వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక రద్దు చేశారు. ఇప్పుడు బాబు సర్కారు అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే సర్కారీ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఆదాయం కోసం అమ్ముకోజూస్తుండటం విద్యార్థులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.  

 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పాత ఆలోచనలకు మళ్లీ పదునుపెట్టారు. 2000-2003 సంవత్సరాల మధ్య ప్రభుత్వ ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేయించారు. అంతేకాదు ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలలో 5 శాతం సీట్లు ప్రవాస భారతీయులకు విక్రయించేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఆ లెక్కను మరింత పెంచి అమలులోకి తేనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం ఎంబీబీఎస్ సీట్లను విక్రయించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే స్విమ్స్ పరిధిలో నడిచే పద్మావతీ ప్రభుత్వ మహిళా వైద్య కళాశాలలో 15 శాతం సీట్లు ప్రవాస భారతీయులకు విక్రయించేందుకు జీవో జారీ చేశారు కూడా.

 

 ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల్లో 85 శాతం స్థానిక కోటా కింద, 15 శాతం అన్‌రిజర్వ్‌డ్ నాన్ లోకల్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. అయితే ఈ స్థానిక కోటా 85 శాతం సీట్లలో 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాలో విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది పద్మావతి మహిళా కళాశాలలో అమలు చేసి వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా కింద అమ్మేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలొచ్చినట్టు ఆ శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. సర్కారు కళాశాలల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా అంటూ సీట్లను విక్రయిస్తే.. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు.

 

 మౌలిక వసతుల పేరుతో దగా...

 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, రోగులకు మెరుగైన వైద్యసేవలు అనే రెండు కారణాలను బూచిగా చూపి ప్రభుత్వ కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో ఎన్‌ఆర్‌ఐ సీటును రూ. 60 లక్షలకు విక్రయించాలని యోచిస్తున్నారు. అంటే ఈ సొమ్మును ఐదేళ్లలో ఏటా రూ. 12 లక్షల చొప్పున (20 వేల డాలర్ల్లు) సీటు పొందిన వ్యక్తి చెల్లించాలి. ఇలా ప్రతి కళాశాలకూ ఏటా కనీసం రూ. 2.5 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ వస్తుందని.. ఈ నిధులతో మౌలిక వసతులు కల్పించవచ్చని సర్కారు వాదనను ముందుకు తెస్తోంది. మొత్తం కళాశాలలు, సీట్ల సంఖ్య, ఎన్‌ఆర్‌ఐ కోటా విక్రయంలోకి ఎన్ని సీట్లు వస్తాయి తదితర వివరాలతో నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలందాయి.

 

 విక్రయానికి 225 ఎంబీబీఎస్ సీట్లు?

 ప్రస్తుత ప్రభుత్వ ఆలోచన ప్రకారం సర్కారీ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐ కోటాకింద విక్రయిస్తే కనీసం 225 సీట్లు ప్రతిభ కలిగిన విద్యార్థులకు దక్కకుండా పోతాయి. రాష్ట్రంలో మొత్తం 12 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. ఇందులో విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల రెండు రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఈ కళాశాలలో ఉన్న 150 సీట్ల విక్రయం కుదరదు. మిగతా 11 కళాశాలల్లో 1,750 సీట్లు ఉన్నాయి. ఇందులో 15 % అన్‌రిజర్వ్‌డ్ మినహాయిస్తే 1,498 సీట్లుం టాయి. ఈ సీట్లలో 15 శాతం అంటే 225 సీట్లు విక్రయిస్తారు. ఈ సీట్ల విక్రయం ద్వారా ఏటా రూ. 27 కోట్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.

 

 ‘ఎన్‌ఆర్‌ఐ’ లేదంటే.. రూ. 60 వేలు ఫీజు!

 ఒకవేళ ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లను విక్రయించలేని పక్షంలో ప్రస్తుతం కన్వీనర్ కోటా సీట్లకు రూ. 60,000 వసూలు చేస్తున్నట్టు ప్రభుత్వ సీట్లకూ అంతే స్థాయిలో తీసుకోవాలనే ఆలోచన కూడా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం సీట్లలో 50 శాతం సీట్లు రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. వీటికి కేంద్ర ప్రభుత్వమే స్కాలర్‌షిప్‌ల కింద చెల్లిస్తుంది. మిగతా 50 శాతం సీట్లకు అంటే సుమారు 900 సీట్లకు ఏటా రూ. 60,000 లెక్కన వసూలు చేస్తారు. దీనివల్ల ఏటా రూ. 5.40 కోట్లు వస్తుంది.

 

 నాడు 5% ఎన్‌ఆర్‌ఐ కోటాపై తీవ్ర వ్యతిరేకత

 2000-2003 సంవత్సరాల మధ్య అప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేశారు. అంతేకాదు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 5 శాతం సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటాకింద ఇచ్చేయాలని తీర్మానించారు. దీంతో జూనియర్ డాక్టర్లు, సైన్స్ విద్యార్థులతో పాటు వివిధ ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జూడాల ఆధ్వర్యంలో ఆస్పత్రుల్లో సమ్మెలు జరిగాయి. ధర్నాలు జరిగాయి. ఆ తర్వాత 2004లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూజర్ చార్జీలు, 5 శాతం ఎన్‌ఆర్‌ఐ కోటాను రద్దు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top