మన్యం రోడ్లకు మహర్దశ


  • రిజర్వ్ ఫారెస్టుపై కేంద్రం నిబంధనలు సడలింపు

  •  మావోయిస్టు ప్రభావిత జిల్లాలకు  మాత్రమే వర్తింపు

  •  ఏజెన్సీ రోడ్ల నిర్మాణాలకు ఇక త్వరితగతిన అనుమతులు

  •  13 రకాలపై తొలగనున్న అడ్డంకులు

  •  జాప్యాన్ని నివారించేందుకు ఆన్‌లైన్ ప్రక్రియ

  • కొయ్యూరు : ఏజెన్సీ రోడ్లకు మహర్దశ పట్టనుంది. అటవీశాఖ అభ్యంతరాలతో ఆగిపోయిన రోడ్లను,ఇతర నిర్మాణాలకు  కేంద్రం నిబంధనల సడలింపుతో ఇబ్బందులు తొలగనున్నాయి. మన్యంలో దాదాపుగా 70 కిపైగా రోడ్ల నిర్మాణం ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక మీదట వాటిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతిలో పూర్తి చేయవచ్చు. విశాఖ మన్యం మావోయిస్టు ప్రభావిత జిల్లా కావడంతో రిజర్వ్ ఫారెస్టుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సడలించింది. దీని ప్రకారం ఒక గ్రామంలో అంగన్వాడీ భవనం లేదా పాఠశాల భవనం,లేకుంటే సోలార్ కేంద్రం ఎంచక్కా ఏర్పాటు చేసుకోవచ్చు.



    మొబైల్ టవర్లు ఏర్పాటు కానున్నాయి. 13 అంశాలకు సంబంధించి  జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో హెక్టార్ వరకు అటవీ శాఖకు చెందిన స్థలాన్ని తీసుకోవచ్చు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల విషయంలో రిజర్వ్ ఫారెస్టు ఎంత పోయినా నిర్మాణానికి అనుమతి ఇచ్చే అధికారాన్ని కేంద్రం కట్టబెట్టింది. గతంలో ఐదు హెక్టార్లు దాటితే కేంద్రం నుంచి అనుమతి తీసుకోవలసి వచ్చేది. ఇప్పుడు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవచ్చు. దీంతో పాటు వాటిలో జరిగే జాప్యాన్ని నివారించేందుకు వీలుగా ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.



    ఒక రోడ్డు వేసేటప్పుడు ఎంత రిజర్వ్ ఫారెస్టు పోతుందో ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారులు పేర్కొనాలి. దానిని డీఎఫ్‌వో, సీసీఎఫ్‌తో పాటు పీసీసీఎఫ్ చూస్తారు. అనంతరం పీసీసీఎఫ్ నుంచి డీఎఫ్‌వో వరకు పది రోజుల్లో విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దేశించిన సమయానికి విచారణ పూర్తి చేసి ఆన్‌లైన్‌తో నివేదికను డీఎఫ్‌వో అందజేస్తారు. దానిపై పీసీసీఎఫ్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. దానిని పరిశీలించిన ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇస్తుంది. ఇదంతా నెల రోజుల్లో పూర్తి అవుతుంది.



    నిబంధనలను సడలించకుండా ఉంటే అటవీశాఖ నుంచి అనుమతి  రావడానికి ఎక్కువ సమయం పట్టేది. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి జిల్లాలకు  ఈ నిబంధనలు వర్తిస్తాయి.  దీనిపై నర్సీపట్నం డీఎఫ్‌వో లక్ష్మన్ మాట్లాడుతూ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో కేంద్రం నిబంధనలు సడలించిందని చెప్పారు. ఇప్పుడు నేరుగా రాష్ట్రం అనుమతులు ఇవ్వవచ్చని తెలిపారు. అనుమతుల విషయంలోను జాప్య ం ఉండదన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top