మాస్టర్‌ ప్లాన్‌.. ఫ్లాప్‌


మధురవాడ : జీవీఎంసీ, వుడా అధికారుల  మధ్య సమన్వయ లోపం.. అధికార పార్టీ అనుచరగణం బంధు ప్రీతి.. అన్నీ కలపి ప్రజల పాలిటశాపంగా మారాయి. నగర శివారు 4,5 వార్డుల్లోని పలు వుడా మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు, నగరంపాలెం రోడ్డు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్న చందంగా తయారైతే.. రేవళ్లపాలెం రోడ్డు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇక జాతీయ రహదారి–బక్కన్నపాలెం(సాయిప్రియా గార్డెన్‌) మధ్య నిర్మిస్తున్న 100 అడుగుల మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు చిప్పాడ దివీస్‌ లేబొరేటరీ కెమికల్‌ పరిశ్రమ యాజమాన్యం మోకాలడ్డుతోంది.



నగరంపాలెం రోడ్డుకు మోక్షమెప్పుడో..

మధురవాడ జాతీయ రహదారి– నగరంపాలెం 80అడుగుల రోడ్డు అతీ గతీ లేకుండా పోయింది. ఈ పనులకు అధికార పార్టీనేతలు మోకాలడ్డుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.  2014లో అప్పటి మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు పనులు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా ఉన్నాయి. జాతీయ రహదారి నుంచి  నగరంపాలెం మీదుగా భీమిలి బీచ్‌రోడ్డు వరకు 4కిలో మీటర్లు మేర నిర్మాణం సాగే దీనికి రూ.4కోట్లు నిధులు మంజూరైనట్లు వుడా అధికారులే చెపుతున్నా... పనులు మాత్రం ప్రారంభం కాలేదు. జీవీఎంసీ, వుడా అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణంగా తెలుస్తోంది.



సాయిప్రియా గార్డెన్‌ రోడ్డుకు దివీస్‌ మోకాలడ్డు..

జాతీయ రహదారి–బక్కన్నపాలెం(సాయిప్రియా గార్డెన్‌) రోడ్డు నిర్మాణ పనులు రు.2కోట్లతో జరుగుతున్నాయి. రెండేళ్లు నుంచి 90శాతం పనులు పూర్తి చేశారు. కానిlఈ రోడ్డు జాతీయ రహదారిని కలిపే చోట చంద్రంపాలెం వద్ద బాపూజీ కళామందిరం వెనుక  భీమిలి మండలం చిప్పాడలో ఉన్న దివీస్‌ లేబోరేటరీకి చెందిన సుమారు రెండు ఎకరాలు స్థలం ఉంది. ఈ స్థలం మధ్యలోంచి రోడ్డు వెళ్తున్న కారణంగా వారు ప్లాన్‌నే మార్చటానికి ఒత్తిడి చేస్తుండటంతో పనులు ముందుకు సాగడంలేదు.

రేవళ్లపాలెం రోడ్డుది అదే పరిస్థితి..

ఇక రేవళ్లపాలెం మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు అసంపూర్తిగా ఉన్న పనులతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికితోడు ఈ రోడ్డులో రేవళ్లపాలెం వద్ద నిర్వాసితులౌతున్న 33 మంది పునరావాసంపై అధికారలు తేల్చటం లేదు. మొదట్లో వీరికి నవోదయ వద్ద ఉన్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం  కాలనీ సమీపంలో సర్వే నెంబరు 137లో  76సెంట్లులో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. ప్రస్తుతం దాని గురించి మాట్లాడకపోవటంతో సందిగ్దం నెలకొంది. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top