రాజధాని ఎవరి చేతికి?

రాజధాని ఎవరి చేతికి? - Sakshi


నేటి కేబినెట్ ఎజెండాలో మాస్టర్ డెవలపర్ ఎంపిక



సాక్షి, హైదరాబాద్: నూతన రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ కంపెనీలను ఎంపిక చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఎజెండాలో మాస్టర్ డెవలపర్ ఎంపిక అంశాన్ని చేర్చారు. సింగపూర్ కంపెనీలతో నేరుగా సంప్రదింపులు జరిపి మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసేందుకు తొలుత చంద్రబాబు చేసిన ప్రయత్నాలకు అధికార యంత్రాంగం గండి కొట్టింది.



2001లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబిలింగ్ చట్టం -2001’ ఆధారంగా.. సంప్రదింపుల ద్వారా మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని ప్రభుత్వ పెద్దలు భావించారు. ఆ చట్టంలోని సెక్షన్ 19లో ఉన్న ‘ప్రపంచంలో ఎక్కడా లేని ప్రాపర్టీ, టెక్నాలజీ ఉన్న కంపెనీతో నేరుగా సంప్రదింపులు జరిపి డెవలపర్‌గా ఎంపిక చేయవచ్చు’ అన్న క్లాజ్‌ను ఆధారంగా తీసుకోవాలనుకున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేయడం సాధ్యం కాదంటూ అధికార యంత్రాంగం పలు నిబంధనలను ఉటంకించింది.



అయితే ఎలాగైనా సింగపూర్‌కు కంపెనీలకే మాస్టర్ డెవలపర్ బాధ్యతలను అప్పగించాలనే కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి.. అదే పాత చట్టం, మరో సెక్షన్‌లోని స్విస్ ఛాలెంజ్ విధానంలో ఆయా కంపెనీలకే మాస్టర్ డెవలపర్ బాధ్యతలను అప్పగించేందుకు రంగం సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సింగపూర్ కంపెనీలను సంప్రదించి స్విస్ చాలెంజ్ విధానానికి ఒప్పించారు.



స్విస్ ఛాలెంజ్ విధానంలో

స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ ప్రణాళికను తయారు చేసిన అనుభవం ఉన్న సింగపూర్ కంపెనీయే.. కోర్ రాజధాని నిర్మాణాన్ని ఎంత ధరకు చేపడుతుందో ప్రతిపాదనలను తయా రు చేసి ప్రభుత్వానికి అందిస్తుంది. ఆ నిర్మాణాల ద్వారా ప్రభుత్వానికి ఏడాదికి ఎంత ఆదాయం సమకూర్చగలదనే ప్రతిపాదనలను ఇస్తుంది. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం బహిరంగపరు స్తూ.. ఇంతకన్నా మెరుగ్గా ఎవరైనా చేస్తారా? అంటూ ఇతర కంపెనీలను ఆహ్వానిస్తుంది.



ఒకవేళ సింగపూర్ కంపెనీ ప్రతిపాదించిన దాని కన్నా ఓ రూ.100 కోట్ల తక్కువకు కోర్ రాజ ధాని నిర్మాణం చేపడతామని ఏదైనా సంస్థ ముందుకొచ్చిన పక్షంలో.. ‘మరో సంస్థ ప్రతి పాదనలు తక్కువగా ఉన్నాయి.. ఆ మేరకు మీ రు చేయగలుగుతారా?’ అని మళ్లీ సింగపూర్ కంపెనీనే అడుగుతారు. సింగపూర్ కంపెనీ కనుక మరో సంస్థ చెప్పిన ధరలకు చేస్తానంటే సింగపూర్ కంపెనీకే బాధ్యతలను అప్పగిస్తారు.



స్విస్ చాలెంజ్ విధానంలో భాగంగా.. సొంత డబ్బులతో రాజధానిని నిర్మించే సంస్థ తాను పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడానికి టోల్, ఫీజులు, చార్జీలను వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. దీంతో పాటు సింగపూర్ కంపెనీలకు ప్రభుత్వం నూతన రాజధానిలో కొంత భూమిని కూడా ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే నిబంధనల మేరకు మాస్టర్ ప్రణాళిక రూపొందించిన కంపెనీలను స్విస్ చాలెంజ్ విధానానికి అనుమతించకూడదు. రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంయుక్తంగా మాస్టర్ ప్రణాళికను రూపొందిస్తున్న విషయం విదితమే.



విదేశీ కంపెనీలైతే రెండంకెల వృద్ధి ఎలా సాధ్యం?

ఏటా రాష్ర్టంలో రెండంకెల వృద్ధి సాధించాలని చెబుతున్న చంద్రబాబు.. మరోవైపు నూతన రాజధాని నిర్మాణ బాధ్యతలన్నీ విదేశీ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నించడంపై అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తం చేస్తోంది. ఇక్కడి సంస్థలే నూతన రాజధానికి సంబంధించిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపడితే..  సిమెంట్, స్టీలు, డీజిల్, లేబర్ వినియోగం పెరుగుతుంది.



ఆ డబ్బులన్నీ ఇక్కడే చలామణీ అవుతాయి. మళ్లీ మార్కెట్‌లోకి వస్తాయి. ఆర్థిక పరిమాణం పెరుగుతుంది. అప్పుడే రెండంకెల వృద్ధి సాధ్యమవుతుందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఒక్క శాతం వృద్ధి సాధించాలంటే ఏటా 5 వేల కోట్లు ఆస్తుల కల్పనకు వెచ్చించాల్సి ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఏటా ఇంత మొత్తంలో వ్యయం చేస్తూ పోతే రెండంకెల వృద్ధి ఎలాసాధ్యమవుతుందని పేర్కొంటున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top