కట్టుకున్నోడిని కడతేర్చేందుకు..


బద్వేలు అర్బన్: పెళ్లయిన 25 రోజులకే ఓ యువతి కట్టుకున్నోడిని కడ తేర్చేందుకు యత్నించింది. వేదమంత్రాల సాక్షిగా వివాహమాడిన భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి పక్కా ప్రణాళికతో పన్నాగం పన్నింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోమవారం రాత్రి వెలుగు చూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

 

 బద్వేలు పట్టణం కుమ్మరికొట్టాల సమీపంలో నివసిస్తున్న రామిరెడ్డి, రాములమ్మల ఏకైక సంతానమైన సిద్ధారెడ్డికి మైదుకూరు మండలం దువ్వూరు సమీపంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన పంగా సుబ్బారెడ్డి , సావిత్రిల కుమార్తె అరుణతో గత నెల 9,10 తేదీలలో వివాహమైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం బజారుకు వెళ్లి వస్తామని సిద్ధారెడ్డి, అరుణ బద్వేలులోని ఇంటి నుంచి వెళ్లారు.

 

  వెళ్లినవారు సాయంత్రం వరకు ఇంటికి రాకపోగా సిద్ధారెడ్డి ఫోన్ కూడా పనిచేయకపోవడంతో ఇరువురు కలిసి కొత్తపల్లెలోని బంధువుల ఇంటికి వెళ్లి ఉంటారని సిద్ధారెడ్డి తల్లిదండ్రులు భావించారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి అరుణ ఒక్కటే వచ్చింది. తమ కుమారుడు ఎక్కడని తల్లిదండ్రులు ప్రశ్నించగా సిద్దవటం సమీపంలోని కపర్థీశ్వరకోన ఆలయానికి వెళ్లామని అక్కడ ముగ్గురు వ్యక్తులు తమను నిర్బంధించి తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లాక్కుని వెళ్లిపోయారని, తన భర్తను అడవిలోకి తీసుకెళ్లి తనను కడప బస్సు ఎక్కించారని నమ్మబలికింది.

 

 అనుమానం వచ్చిన సిద్ధారెడ్డి తల్లిదండ్రులు రాత్రి 10 గంటల సమయంలో బద్వేలు పోలీసు స్టేషన్‌కు ఆమెను తీసుకెళ్లగా వారికి చెప్పినట్లే పోలీసులకు తెలిపింది. యువకుడి బంధువులు సమీప అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజాము 4గంటల వరకు వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. తిరిగి బద్వేలుకు వచ్చిన వారందరూ అరుణను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. దువ్వూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను తానే పిలిపించానని, వారి సూచనమేరకు సిద్దవటం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తన భర్తను తీసుకెళ్లానని వారు తీవ్రంగా గాయపరిచి బంగారు నగలు తీసుకెళ్లారని పోలీసులకు వివరించింది. వెంటనే అరుణను తీసుకుని సిద్దవటం అటవిప్రాంతంలో గాలించగా తీవ్ర గాయాలతో సృ్పహ కోల్పోయి ఉన్న సిద్ధారెడ్డిని గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేటు వాహనంలో అతన్ని కడప రిమ్స్‌కు తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.  సిద్ధారెడ్డి తండ్రి రామిరెడ్డి సిద్దవటం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top