అసెంబ్లీలో ఎలుగెత్తిన ప్రజాగళం

అసెంబ్లీలో ఎలుగెత్తిన ప్రజాగళం - Sakshi


సాక్షి , ఒంగోలు : ‘అధ్యక్షా.. జాతీయ రహదారులపై కనీసం 100 కిలోమీటర్లకైనా విశ్రాంతి ప్లాట్‌ఫాంలు లేవండీ.. కానీ, ప్రతీ కిలోమీటరుకు మద్యం దుకాణాలు (వైన్స్, బార్‌అండ్ రెస్టారెంట్) ఉండటం సిగ్గుచేటుగా భావించాలి అధ్యక్షా.. గుంటూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతోన్న ఐదోనంబర్ జాతీయ రహదారి, అటు అద్దంకి - నార్కెట్‌పల్లి హైవేల పరిస్థితి చూస్తే...రక్తంతో తడవని రోజంటూ ఉండదు.’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ శాసనసభలో గళం విప్పారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ రహదారుల్లో సగటున రోజుకు 41 మంది ప్రమాదాలబారినపడి చనిపోతున్నారని చెప్పారు. తుపాను విపత్తుల నేపథ్యంలో వాటిల్లే ప్రాణనష్టం కన్నా రోడ్డు ప్రమాదాల్లో గాల్లో కలుస్తోన్న ప్రాణాలే అధికమంటూ వివరించారు.

 

దేశవ్యాప్తంగా రోడ్డుప్రమాదాల గణాంకాల్ని తీసుకుంటే మనరాష్ట్రంలో 8.9 శాతం ప్రాణనష్టం జరుగుతుందన్నారు. ఏటా రోడ్డుభద్రతా వారోత్సవాలు జరుపుతున్నా.. ప్రమాదాల నివారణలో ప్రభుత్వం వెనుకంజలో ఉండటానికి గల కారణాలపై సంబంధిత మంత్రి దృష్టిపెట్టాల్సిన అవసరముందన్నారు. వాహనాల డ్రైవర్ల లెసైన్స్‌ల జారీ ప్రక్రియను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు. ఏజెంట్ల వ్యవస్థకు మంగ ళం పాడి.. రోడ్‌ట్రాన్స్‌పోర్టు అధికారులు క్షేత్రస్థాయిలోకెళ్లి విధులు నిర్వర్తిస్తే మంచి ఫలితాలుంటాయని చెప్పారు. రోడ్‌ట్యాక్స్‌ను రోడ్ల మరమ్మతులు, రక్షణ ఏర్పాట్లకే వెచ్చించాలని సూచించారు.

 

‘హైవే’ పక్కనుండే గ్రామాలకు బ్రిడ్జి సౌకర్యమేదీ..?

‘ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని దొడ్డవరప్పాడు గ్రామం ప్రజలు ఐదో నంబర్ జాతీయరహదారిని దాటాలంటే నానా ప్రయాసలు పడుతున్నారు. రోడ్డుకు తూర్పు వైపు నుంచి పడమరకు మహిళలు, చిన్నారులు వెళ్లాలంటే అతివేగంతో వచ్చే వాహనాలతో ప్రమాదాలు జరుగుతాయని భయపడుతున్నారంటూ’ సంతనూతలపాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ అసెంబ్లీ స్పీకర్ దృష్టికి తెచ్చారు. దొడ్డవరప్పాడు వద్ద హైలెవల్ బ్రిడ్జి కానీ అండర్‌బ్రిడ్జినైనా నిర్మించాల్సిన అత్యవసర పరిస్థితి ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రమాదాల్లో ఆంధ్రరాష్ట్రం ఐదోస్థానంలో ఉండగా, మరణాలసంఖ్య ప్రతేటా పెరుగుతూనే ఉందన్నారు.

 

ప్రతిఏడాది నమోదవుతోన్న రోడ్డుప్రమాదాల్లో 29 నుంచి 30 శాతం ఆటోరిక్షా ప్రమాదాలే చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 5,790 గ్రామాల(30శాతం)కు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడం విచారకరమన్నారు. ప్రధానంగా ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అంశాల్లో డ్రైవర్‌ల నిర్లక్ష్యం, వాహనాల కండిషన్, రోడ్డు పరిస్థితులతో పాటు ట్రాఫిక్‌పై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ప్రమాదాలకు కారణమైన డ్రైవర్‌లకు అధిక జరిమానాతో పాటు కఠినచర్యలు చేపట్టడం, ఫాస్ట్‌ట్రాక్, మొబైల్‌కోర్టులు ఏర్పాటుచేయడం, అధునాతన ఫిట్‌నెస్ టెస్ట్ పరికరాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు.

 

కేంద్రం నుంచి విడుదలయ్యే రోడ్‌సేఫ్టీ ఫండ్స్‌ను కూడా సద్వినియోగం చేయాలన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రోడ్డుభద్రత చర్యలకు ఏమేరకు నిధులు కేటాయించారనేది తెలియపరచాలని ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ప్రతిపక్ష సభ్యుల వద్ద రోడ్డుప్రమాదాలపై చాలా సమాచారం ఉన్నట్లుందని.. ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలన్నీ నిజమేనని అంగీకరించారు. రోడ్డుప్రమాదాల నియంత్రణపై దృష్టిపెడతామన్నారు.

 

ఓవర్ లోడింగ్ ఆటోలపై చర్యలేవీ...?

కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ నిబంధనలప్రకారం హైవేలపై రాకూడని ఆటోరిక్షాలు పాఠశాలల పిల్లల్ని ఎక్కించుకుని యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయని చెప్పారు. చిన్నారులు, కూలీలు, కార్మికులతో ఓవర్‌లోడింగ్ ఆటోలు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. దీనిపై రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సమాధానమిస్తూ ఆర్టీసీ ప్రాంగణాల వద్ద ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఇద్దరేసి చొప్పున మోటార్ ట్రాన్స్‌పోర్టు ఇన్‌స్పెక్టర్‌లను నియమిస్తామన్నారు. హైవే ప్రమాదాల నియంత్రణకు సైతం ట్రాన్స్‌పోర్టు కార్యాలయ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని సమాధానమిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top