ముక్తీశ్వరా...


కాళేశ్వర ముక్తీశ్వర ఎత్తిపోతల పథకం ఐదేళ్ల నుంచి అడుగులో అడుగు వేస్తోంది. పనులు మొదలెట్టి ఐదేళ్లయినా ఇప్పటికీ భూసేకరణే పూర్తి కాలేదు. 2012లోనే పూర్తి కావాల్సిన పనుల గడువును ఇప్పటికే రెండు సార్లు పెంచగా మరో వారంలో తుదిగడువు కూడా పూర్తి కానుంది. అయినా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి.  

 - మంథని

 

 మంథని : మంథని డివిజన్‌లోని మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్, కాటారం మండలాల్లోని 65 గ్రామాలకు మేలు చేకూర్చేలా 45 వేల ఎకరాల బీడు భూములను సాగులోకి తెచ్చేలా కాళేశ్వర, ముక్తీశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. 2008 సెప్టెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మహదేవపూర్ మండలం బీరసాగర్‌లో శంకుస్థాపన చేయగా 2009లో పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు రూ.499 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు.

 

 నీటి తరలింపు ఇలా...

 గోదావరి ఒడ్డు నుంచి మహదేవపూర్ మండ లం కన్నెపల్లిలోని ఇంటేక్‌వెల్‌కు నీటిని తరలిస్తారు. అక్కడినుంచి పైప్‌లైన్ ద్వారా మహదేవపూర్ మండల చెరువు, ఊర చెరువుల్లో నీరు నింపుతారు. ఇది మొదటి దశ(స్టేజ్-1) పను లు. ఇక్కడ నుంచి రోడ్డు మార్గంలో కాటారం మండలం గారెపల్లి కొత్తచెరువులోకి తరలిస్తారు. దీన్ని రిజర్వాయర్‌గా(స్టేజ్-2) మా ర్చుతారు.  ఇక్కడినుంచి రెండువైపులా పైప్‌లైన్ ఉంటుంది. కాటారం, ఆదివారంపేట, కొత్తపల్లి, సుందర్‌రాజ్‌పల్లి నుంచి మల్హర్ మండలం రుద్రారం వరకు పైప్‌లైన్ ద్వారా నీరు తరలిస్తారు. ఇది ఒకవైపు కాగా, రెండోవైపు  గారెపల్లి నుంచి పోలారం, మహాముత్తారం వరకు నీటిని తరలిస్తారు. ఈ చెరువుల ద్వారా రైతుల భూములకు సాగునీరందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

 ఏదీ పురోగతి

 ప్రాజెక్టు నిర్మాణానికి 3625 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో 2981 ఎకరాలు రెవెన్యూ భూమి. మిగతా 644 ఎకరాలు భూమి అటవీభూమి. ఇప్పటివరకు 900 ఎకరాల రెవెన్యూ భూమి మాత్రమే సేకరించారు. కానీ, నిర్వాసితులకు రూపాయి కూడా చెల్లించలేదు. భూసేకరణ, అటవీశాఖ అడ్డంకులు, వర్షాకాల సీజన్ సాకులు చూపుతూ కాంట్రాక్టర్ పనులు జాప్యం చేయగా అధికారులు కూడా పట్టించుకోలేదు. దీంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండిపోయాయి. 2012 సెప్టెంబర్ వరకు పనులు పూర్తి కావాల్సి ఉండగా 2013కు ఓసారి గడువు పొడిగించారు. కాంట్రాక్టర్ విజ్ఞప్తి మేరకు గడువు 2014 డిసెంబర్ వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ గడువు కూడా పూర్తి కానుండగా పనుల్లో మాత్రం పురోగతి లేదు.

 

 ఇప్పటివరకు పూర్తయిన పనులకు రూ.270 కోట్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. 50 శాతానికిపైగా నిధులు కాంట్రాక్టర్‌కు చెల్లించినప్పటికీ పనులు మాత్రం అత్తెసరుగానే జరిగాయి. మిగతా పనులన్నీ పూర్తి కాకుండానే పంపింగ్ కోసం మోటార్లు తీసుకురావడంతో అవన్నీ వృథాగా ఉంటున్నాయి.

 

  చెల్లింపుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారుల విచారణలో తేలడంతో పలువురు అధికారులపై గత ఫిబ్రవరిలో సస్పెన్షన్ వేటు వేశారు. ప్రస్తుతం ఇంటేక్‌వెల్ పనులు కొనసాగుతున్నాయి.  పనుల్లో జాప్యంతో అంచనాలు రూ.637 కోట్లకు చేరినట్లు సమాచారం. 644 ఎకరాల అటవీ భూమిలో పైప్‌లైన్ నిర్మాణానికి కేంద్ర అటవీపర్యావరణ అనుమతి ఇటీవలే వచ్చినట్లు సమాచారం. మిగతా భూములు త్వరగా సేకరించి, పరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఇంటేక్‌వెల్ నిర్మాణం త్వరగా పూర్తి చేసి పైప్‌లైన్ వేసి నీరందించాలని పేర్కొంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top