ఆదర్శానికి మంగళం

ఆదర్శానికి మంగళం

  • జిల్లాలో 1,911 మంది ఆదర్శ రైతులు  తొలగింపు

  •   ఎంపీఈవోల నియూమకానికి నిర్ణయం

  •   తొలగించినవారికే ప్రాధాన్యమివ్వాలని డిమాండ్

  •   పోరుకు సిద్ధమవుతున్న బాధితులు

  • ఆదర్శరైతుల వ్యవస్థ అనవసరమైందని, దాన్ని తొలగిస్తామని తొలి కేబినెట్ భేటీలో ప్రకటించిన చంద్రబాబు... తాను అన్నట్లుగానే ఆదర్శరైతుల వ్యవస్థను తొలగించారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేటా జీవో ఎంఎస్ 43 జారీ చేశారు. ఈ నిర్ణయంతో జిల్లా వ్యాప్తంగా 1,911 మంది ఆదర్శ రైతులు గౌరవం కోల్పోనున్నారు.

     

    సాక్షి, చిత్తూరు :వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దేందుకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శరైతుల వ్యవస్థను ప్రవేశపెట్టారు.  2007, 2008లో రెండు విడతలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 50వేల మందిని నియమించారు. ఇందులో నవ్యాంధ్రకు సంబంధించి 29,439మంది ఉన్నారు. రాయలసీమలో 7,120 మంది ఆదర్శ రైతులను నియమించారు. ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమితులైన వీరికి ప్రతి నెలా వెయ్యి రూపాయల గౌరవవేతనం ఇచ్చారు.



    ఈ వ్యవస్థ ద్వారా గ్రామస్థాయిలో వ్యవసాయం మరింత బలోపేతమయింది. గ్రామాల్లో విత్తనాలు, ఎరువులు ఎప్పుడు పంపిణీ చేస్తారు? ఏ తెగులుకు ఏ మందు వాడితే బాగుం టుంది ? తదితర సూచలను ఆదర్శరైతులు చేసేవారు. అయితే  ఆదర్శరైతుల వ్యవస్థ కాలక్రమేణా గాడితప్పింది. కొందరు వ్యవసాయరంగంలో రైతులకు సూచనలు ఇవ్వడం కంటే రాజకీయనేతలుగా చెలామణి అయ్యారు. దీంతో వీరికి చెక్‌పెట్టేందుకు 2012 జూన్‌లో వ్యవసాయశాఖ అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను గత ఏడాది ప్రకటిం చారు.



    పరీక్షల్లో ఫెయిల్ అయినవారిని తొలగించి ఆ స్థానంలో కొత్తవారిని నియమించారు. అప్పటి నుంచి ఆదర్శరైతులు సక్రమంగానే పనిచేస్తున్నారు. రైతులకు ఉపయుక్తంగా ఉంది. అయితే ఆదర్శరైతులంతా కాంగ్రెస్‌కు చెందిన కార్యకర్తలనే అపోహతో, టీడీపీ ప్రభుత్వం ఆ వ్యవస్థనే రద్దు చేసింది.  ఈ వ్యవస్థ వల్ల ఉపయోగం లేదని, అందుకే తొలగించామని సెలవిచ్చింది.

     

    ఎంపీఈవో పేరుతో కొత్త వ్యవస్థ :



    ఆదర్శరైతుల వ్యవస్థ స్థానంలో ఎంపీఈవో(మల్టీ పర్పస్ ఎగ్జిక్యూటిక్ ఆఫీసర్) పేరుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తొలగించిన ఆదర్శ రైతులను కాకుండా, కొత్తవారిని ఎంపీఈవోలుగా నియమించనున్నారు. టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారిని ఆ స్థానంలో తీసుకోనున్నారు. దీనిపై ఆదర్శరైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యవస్థలో లోపాలుంటే సరిదిద్దాలని, పూర్తిగా వ్యవస్థనే రద్దు చేయడం సరికాదని చెబుతున్నారు. ఆదర్శరైతుల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టే ఏ వ్యవస్థ అయినా తొలి ప్రాధాన్యం ఉద్యోగాలు కోల్పోయినవారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

     

    ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు

    వెయ్యి రూపాయల జీతానికే ఇన్నేళ్లుగా పనిచేశాం. మమ్మల్ని నియమించింది రాజకీయపార్టీ కాదు...రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వం నియమించిన ఉద్యోగులను ఇలా తొలగిస్తూ పోవడం సరైంది కాదు. టీడీపీ కార్యకర్తలను కొత్తగా నియమించుకోవడం కోసమే ఇలా చేశారు. కొత్తగా ప్రవేశపెట్టే ఏ వ్యవస్థలోనైనా మొదటి ప్రాధాన్యం మాకే ఇవ్వాలి. దీనిపై సోమవారం నుంచి కలెక్టరేట్ వద్ద నిరంతర ఆందోళన చేస్తాం.

     - నలగం శేఖర్, ఆదర్శరైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top