పోలీసులు బెదిరించారని...వ్యక్తి ఆత్మహత్య

పోలీసులు బెదిరించారని...వ్యక్తి ఆత్మహత్య - Sakshi


బొబ్బిలి: చోరీ సొత్తు రికవరీలో పోలీసులు బెదిరించారని మనస్తాపం చెంది విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గున్నతోటవలస గ్రామానికి చెందిన సువ్వాడ రామకృష్ణ (42) అనే వ్యక్తి శనివారం రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది బొబ్బిలిలో జరిగిన  రెండు దొంగతనాల్లో నిందితుడుగా బొబ్బిలి పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పిరిడి రాజేష్ అనే వ్యక్తిని  పోలీసులు పట్టుకున్నారు. సుమారు 8 తులాల బంగారం, 5 గ్యాస్ సిలిండర్లను దొంగతనం చేసి సువ్వాడ రామకృష్ణకు విక్రయించినట్లు  రాజేష్ పోలీసులకు చెప్పడంతో శుక్రవారం సాయంత్రం రామకృష్ణను  స్టేషనుకు తీసుకువచ్చారు. ఐడీ పోలీసులు విచారణ చేసిన తరువాత రాత్రి పది గంటల సమయంలో విడిచిపెట్టారు.


తాను ఏ నేరం చేయలేదని చెబుతున్నా బలవంత పెట్టడంతో పాటు బెదిరించారని ఇంటికి వచ్చిన తరువాత రామకృష్ణ గ్రామస్తులు, కుటుంబీకుల వద్ద మొరపెట్టుకున్నాడు. రామకృష్ణ బొబ్బిలి గ్రోత్‌సెంటరులోని వర్క్‌షాపులో నైట్‌వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి నేరానికి సంబంధించిన వస్తువులు తనకు అమ్మారని చెప్పిన వారింటికి వెళ్తానని చెప్పి బయటకు వచ్చేశాడు. భార్య గోపమ్మ వద్దని వారిస్తున్నా వినకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. తెల్లవారుజామున అయిదు గంటల ప్రాంతంలో రామకృష్ణ రైలు పట్టాలపై శవమై ఉన్నాడని సమాచారం రావడంతో  కుటుబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు.


తానేమీ తప్పు చేయలేదని, అయ్యప్ప సాక్షిగా చెబుతున్నానని, బొబ్బిలి ఐడీ పోలీసులు భయ పెట్టారని  లేఖ రాసి రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుని భార్య గోపమ్మ బంధువులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భర్త  ఆత్మహత్యకు  కారణమైన ఐడీ పోలీసులు వెంకటరావు, శ్యాంలపై చర్యలు తీసుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని డీఎస్‌పీ బీవి రమణమూర్తికి వినతిపత్రాన్ని అందజేసింది. దీనిపై డీఎస్‌పీ బీవీ రమణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ   బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top