అమెరికా నుంచి వచ్చాడు.. అదృశ్యమయ్యాడు..

అమెరికా నుంచి వచ్చాడు.. అదృశ్యమయ్యాడు.. - Sakshi


భీమవరం : కష్టపడి విద్యాబుద్ధులు నేర్చుకున్న తనయుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడంటే ఆ తల్లిదండ్రులు పొంగిపోయారు. అయితే ఆ ఆనందం వారికి ఎక్కువ కాలం నిలవలేదు. అక్కడి వాతావరణం సరిపడక స్వదేశానికి వస్తున్న క్రమం లో ఆ కొడుకు అదృశ్యమయ్యాడు.

 

 ఏడాదైనా ఆచూకీ లేదు. దీంతో ఆ తల్లిదండ్రుల వేదన వర్ణణాతీతం.  

 భీమవరం పట్టణం నాచువారిసెంటర్‌కు చెందిన సరాబు సత్యనారాయణ, సత్యవతి దంపతులు చిరువ్యాపారంతో పొట్టపోసుకుంటున్నారు. వారికి ఓ కుమారుడు, కుమార్తె. కుమారుడు  నాగవెంకటసత్యచంద్రశేఖర్ పట్టణంలోని కేజీఆర్‌ఎల్ కళాశాలలో బీఎస్సీ డిగ్రీ  ద్వితీయ సంవత్సరం చదువుతుండగానే 2006లో తణుకు పట్టణంలో విప్రో సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపికయ్యాడు.  2007లో బెంగుళూరులో ఉద్యోగంలో చేరాడు.

 

 అప్పట్లో ఆ సంస్థ రూ.7,500 ఇచ్చేది. అతని పనితనం మెచ్చి సంస్థ సొంతఖర్చుతో ఎంఎస్సీ చదివించింది. 2013లో అమెరికా పంపింది.  అక్కడ నెలకు సుమారు రూ.రెండు లక్షల జీతం వచ్చేది. సుమారు రెండేళ్లపాటు కష్టపడి పనిచేశాడు. అక్కడి భోజన వసతి సరిగా లేకపోవడం, సంపాదన ఎక్కువ మొత్తం ఖర్చయిపోతుండడంతో చంద్రశేఖర్ భారత్ వచ్చేస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. దీనికి వారూ సరేనన్నారు.

 

  దీంతో 2015 జూలై 29న  బెంగళూరు ఎయిర్‌పోర్టులో చంద్రశేఖర్ దిగాడు. అంతకుముందే కొరియర్ సర్వీస్ ద్వారా తనకు సంబంధించిన దుస్తులు, సామగ్రి పంపేశాడు. బెంగళూరు నుంచి విజయవాడ బస్ ఎక్కిన తర్వాత చంద్రశేఖర్ తండ్రికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత రాత్రి విజయవాడ చేరినట్టు మరోసారి ఫోన్ చేశాడు. దీంతో తెల్లారితే కొడుకు వచ్చేస్తాడని సత్యనారాయణ, సత్యవతి దంపతులు సంబరపడ్డారు.

 

  అయితే అతను రాలేదు. రోజులు గడుస్తున్నా..కొడుకు రాకపోవడంతో వారు స్నేహితులు, బంధువుల ఇళ్ల వద్ద గాలించారు.  ఫలితం లేకపోవడంతో  2015 అక్టోబర్ 1న విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ ఫొటో పట్టుకుని అనేక ప్రాంతాల్లో గాలించారు. చివరకు తమ కొడుకు ఆచూకీ చెబితే రూ. 50 వేలు బహుమతి ఇస్తామంటూ ప్రకటించారు. అయినా ఫలితం లేదు. ఫిర్యాదు చేసి పదినెలలు గడుస్తున్నా.. కొడుకు ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top