ఘోషాకు టెండర్!


సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఘోషా ఆస్పత్రిలో  పారి శుద్ధ్య, సెక్యూరిటీ నిర్వహణ కాంట్రాక్టర్ టెండర్ల ఖరారులో నిబంధనలకు తిలోదకాలిచ్చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు. టీడీపీ ఎమ్మెల్యే సిఫార్సుకే పెద్దపీట వేశారు. ఆస్పత్రిపై అదనపు భారాన్ని మోపారు. టెండర్లలో తక్కువ కోట్ చేసిన వారికి నిబంధనల మేరకు కాంట్రాక్ట్ ఖరారు చేయాలి. కానీ ఘోషా ఆస్పత్రిలో అందుకు భిన్నంగా వ్యవహరించారు. తక్కువ కోట్ చేసిని వారిని వదిలేసి ఎక్కువ కోట్ చేసిన వారికి కాంట్రాక్ట్‌ను కట్టబెట్టారు. పోనీ  సంస్థకు అన్ని అర్హతలున్నాయా అంటే అవీ లేవు. కనీస అనుభవం లేదు. లేబర్ లెసైన్సు కూడా లేదు. ఇంకా దారుణమేంటంటే ఖరారు చేసిన సంస్థకు  ఐకేపీలో ఎన్‌రోల్‌మెంటే లేనట్టు తెలుస్తోంది.

 

  ఘోషా ఆస్పత్రిలో   కాంట్రాక్ట్ కోసం శ్రీ సాయి సేవా సంఘం, శ్రీ హనుమాన్ యువజన సేవా సంఘం, అక్షయ మేన్ పవర్ సర్వీసెస్, శ్రీ లక్ష్మీ జన చైతన్య పొదుపు సంఘం షెడ్యూల్ దాఖలు చేశాయి. ఇందులో శ్రీ సాయి సేవా సంఘం శానిటేషన్ కోసం నెలకి రూ.86,435, సెక్కూరిటీ కోసం రూ.53,600మేర బిడ్ వేయగా, శ్రీ హనుమాన్ యువజన సేవా సంఘం శానిటేషన్ కోసం రూ.80వేలు, సెక్యూరిటీ కోసం రూ.26,800 బిడ్ వేసింది. ఇక, అక్షయ మేన్ పవర్ సర్వీసెస్ శానిటేషన్ కోసం రూ. 2,04,495, సెక్యూరిటీ కోసం రూ.39,400 బిడ్ వేయగా, శ్రీ లక్ష్మీ జన చైతన్య పొదుపు సంఘం శానిటేషన్ కోసం రూ.90,400, సెక్యూరిటీ కోసం రూ.70వేలకు బిడ్ వేసింది. పైన పేర్కొన్న నాలుగింటిలో శ్రీ హనుమాన్ యువజన సేవా సంఘమే తక్కువ కోట్ చేసింది.

 

  నిబంధనల మేరకైతే ఆ సంస్థకే కాంట్రాక్ట్ కట్టబెట్టాలి. కానీ, అందుకు భిన్నంగా ఎక్కువ కోట్ చేసిన శ్రీ లక్ష్మీ జన చైతన్య పొదుపు సంఘానికి టెండర్లు ఖరారు చేశారు. విశేషమిటంటే ఖరారు చేసిన శ్రీ లక్ష్మీ జన చైతన్య పొదుపు సంఘం  అర్బన్ ఐకేపీ ఆన్‌లైన్‌లో ఎక్కడా కన్పించడం లేదు. ఎన్‌రోల్ చేసుకున్న సంఘాలే ఐకేపీ ఆన్‌లైన్‌లో కన్పిస్తాయి. వాటికి మాత్రమే గుర్తింపు ఉంటుంది. మరి, శ్రీ లక్ష్మీ జన చైతన్య పొదుపు సంఘం ఎక్కడ ఎన్‌రోల్ చేసుకుందో వారికే తెలియాలి. కాకపోతే, ఒక విషయం మాత్రం తెలుస్తోంది. ఎన్‌రోల్ చేసుకునేందుకు గాను  ఇటీవల ఎమ్మెల్యే బంధువు అర్బన్ ఐకేపీకెళ్లి దరఖాస్తు తీసుకున్నట్టు సమాచారం. ఈ లెక్కన ఎన్‌రోల్ చేసుకోకుండానే కాంట్రాక్ట్ కోసం దరఖాస్తు చేసి ఉండొచ్చన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

 తొలి నుంచి తేడానే: ఈ కాంట్రాక్ట్ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు తన సోదరికి చెందిన సంస్థకు నేరుగా అప్పగించాలని గతంలో తన లెటర్ ప్యాడ్‌పై సంతకం చేసి అధికారుల్ని కోరారు. కాకపోతే, అప్పట్లో ‘సాక్షి’లో కథనం రావడం, దానిపై ఓ వ్యక్తి కోర్టుకెళ్లడంతో ఆగింది. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యే వ్యూహం మార్చారు. మరోకర్ని రంగంలోకి దించి, పొదుపు సంఘం పేరిట తెరపైకి తీసుకొచ్చారు. వారి చేత బిడ్ వేయించి వ్యూహాత్మకంగా దక్కించుకునే ప్రయత్నం చేశారు. ఇక టెండర్ నోటీసులో పేర్కొన్న అంశాలు కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. సాధారణంగా  టెండరు నోటీసులో   నిర్ధేశించిన వేతన మొత్తాన్ని(పని విలువ)  పొందుపరచాలి.

 

 దాన్ని ఆధారంగా షెడ్యూల్ దాఖలు చేయాలని కోరాలి. అందులో ఎవరు తక్కువ కోట్ చేస్తే వారికి ఖరారు చేస్తామనో, ఆ కాంట్రాక్టర్ ట్రాక్ రికార్డును ఆధారంగా ఖరారు చేస్తానమో పేర్కొనాలి.  కార్మిక చట్టం నిబంధనల మేరకు సర్వీసు ట్యాక్స్, పీఎఫ్, ఈఎస్‌ఐ తదితర చెల్లింపులు చేసే కాంట్రాక్టరే అర్హులని స్పష్టం చేయాలి. ఇవేమీ పాటించకుండా, ఏ విషయాన్ని పొందపరచకుండా టెండరు నోటీసు జారీ చేసారు.  అధికార పార్టీ నేతల సిఫార్సులకు అనుగుణంగా డిజైన్ చేసినట్టు అప్పట్లోనే ఆరోపణలొచ్చాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top