పారిశ్రామికాభివృద్ధి ప్రశ్నార్థకమే..?

పారిశ్రామికాభివృద్ధి ప్రశ్నార్థకమే..? - Sakshi


- మేక్ ఇన్ ఏపీపై నిపుణుల అంచనా

- కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదా లేకపోవడంతో అభివృద్ధి ఎండమావే

- విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ప్రస్తావనే లేని వైనం

- ‘నిమ్జ్’కు ఒక్క పైసా కేటాయింపులేదు

- పత్యేక హోదా లేకపోవడంతో రాయితీలు దక్కవంటోన్న పారిశ్రామికవేత్తలు


 

సాక్షి, హైదరాబాద్: ‘మేక్ ఇన్ ఇండియా’ మాటేమోగానీ ‘మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్’ నినాదం మాత్రం గోడ మీద రాతలకే పరిమితం కానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడం.. రాయితీల పరిధిని కుదించడం.. నిధుల కేటా‘యింపు’గా లేకపోవడం వెరసి పారిశ్రామికాభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుందని వారు చెబుతున్నారు. తమిళనాడు, కర్ణాటకలతో పోలిస్తే రాయితీలు ప్రతికూలంగా ఉండటంతో బహళజాతి సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పడంపై ఆసక్తి చూపవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఏపీని విభజిస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూలోటు ఖాయమని శ్రీకృష్ణ కమిటీ ఆదిలోనే కేంద్రానికి నివేదించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు జీవం పోసి.. రెవెన్యూ లోటును పూడ్చవచ్చని పేర్కొంది.

 

విభజన తర్వాత ఏపీ రాజధాని ఎంపికకు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ కూడా ఇదే అంశాన్ని పేర్కొంటూ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగినపుడు పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని బీజేపీ డిమాండ్ చేసింది. కానీ.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గతేడాది ఆగస్టులో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో ఆ ప్రస్తావన కన్పించలేదు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను ముంబై-ఢిల్లీ పారిశ్రామిక కారిడార్ తరహాలో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఇదే కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లో నిమ్జ్(నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ మాన్యుఫాక్చరింగ్ జోన్)ను ఏర్పాటుచేస్తామని తొలి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఈ నిమ్జ్‌ను చిత్తూరుజిల్లాలోని శ్రీకాళహస్తి-ఏర్పేడు ప్రాంతంలో ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

 

ఆశలన్నీ అడియాసలేనా..

ప్రత్యేక హోదా దక్కితే భారీ ఎత్తున రాయితీలు వస్తాయని.. ఇది పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేస్తుందని భావించారు. కానీ, అది దక్కకపోవడంతో అటు ప్రభుత్వం.. ఇటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు డీలాపడ్డారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో రూ. 33 వేల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తామని ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) డెరైక్టర్ హన్‌కిన్ అక్టోబర్ 7, 2014న ప్రకటించారు. ఈ పారిశ్రామిక కారిడార్‌ను విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, అనంతపురం, శ్రీకాళహస్తి-ఏర్పేడు జోన్‌లుగా విభజించామని నోడల్ ఏజెన్సీగా కేంద్రం ఎంపిక చేసిన ఏడీబీ పేర్కొంది. ఇదే కారిడార్‌లో రూ. 8 వేల కోట్లతో వాహనాల తయారీ పరిశ్రమ నెలకొల్పడానికి ముందుకొచ్చిన హీరో మోటో కార్ప్ సంస్థకు ఐదు నెలల క్రితం చిత్తూరుజిల్లా సత్యవేడులోని మాదన్నపాళెంలో 610 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కిన తర్వాత పరిశ్రమ ఏర్పాటుచేస్తే రాయితీలు దక్కుతాయని ఆ సంస్థ ఇన్నాళ్లూ భావిస్తూ వస్తోంది. ఇదే తరహాలో పలు బహుళజాతి సంస్థలు ప్రతిపాదనలతో ముందుకొచ్చాయి. కానీ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడం పలు బహుళజాతి సంస్థలు మరో రాష్ట్రం వైపు మళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

 

దక్కని ప్రత్యేక హోదా..

ప్రస్తుత బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని చెప్పిన కేంద్రం.. ప్రత్యేకహోదా ఊసెత్తని విషయం తెలిసిందే. 2014-15 బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన నిమ్జ్‌కు ఈ బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. పారిశ్రామికాభివృద్ధికి ఊతం ఇవ్వాలంటే.. పదేళ్లపాటూ సెన్ వ్యాట్, జీఎస్‌టీని మినహాయించాలని, పదేళ్లపాటూ 25 శాతం సత్వర తరుగుదల రాయితీ, 25 శాతం పెట్టుబడి అలవెన్సు ఇవ్వాలని.. మూలధన పెట్టుబడి, నిర్వహణ పెట్టుబడిపై పదేళ్లపాటూ ఐదు శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది. కానీ.. కేంద్రం మాత్రమే ఇవేవీ పట్టించుకోలేదు. ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చి 31, 2020 వరకూ ఏర్పాటుచేసే పరిశ్రమలకు పది శాతం పెట్టుబడి అలవెన్సు, పది శాతం సత్వర తరుగుదల రాయితీ ఇస్తామని మాత్రమే బడ్జెట్లో కేంద్రం పేర్కొంది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top