పత్రికలే పట్టుగొమ్మలు

పత్రికలే పట్టుగొమ్మలు - Sakshi


విజయనగరం మున్సిపాలిటీ: ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికలు పట్టుగొమ్మలు వంటివని, వాటిలో పని చేసే వారంతా జిల్లాను మంచి మార్గంలో నడిపించాలని  విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాసరావు  సూచించారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం  నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గురజాడ వంటి ఎందరో మహనీయులు నడయాడిన విజయనగరాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచాలని కోరారు. ప్రెస్ ఫొటోగ్రాఫర్లు తీసిన ఫొటోలు పోలీసులకు కీలకంగా ఉపయోగపడతాయన్నారు.

 

మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ మాట్లాడుతూ ప్రజల నాడి తెలుసుకునే వైద్యులు జర్నలిస్టులు, ఫొటోగ్రాఫర్లని వాఖ్యానించారు. ప్రజల అవసరాలను వెలుగులోకి తీసుకురావడం ద్వారా అధికారులమైన తాము వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సాహితీరాజధానిగా వెలుగొందుతున్న విజయనగర కీర్తిని కొనసాగించే బాధ్యత పత్రికలపై ఉందన్నారు.



అనంతరం జిల్లాలో ఫొటోగ్రఫీ సేవలందిస్తున్న కాండ్రేగుల రామారావు, జీవీఎస్‌ఆర్ మూర్తి, ఎం.సీతారామ్, పి.రాజేశ్వరరావు, డి.సత్యనారాయణమూర్తి, కాళ్ల శ్రీనివాసరావు, జంపు నాయుడు, గిడిజాల శ్రీను, ఎ.కిశోర్, ఆర్ దాలిరాజులను ఘనంగా సత్కరించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు జరజాపు శేషగిరిరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో  ఏపీడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్‌ఎస్‌వీ ప్రసాదరావు, మహాపాత్రో, ప్రెస్‌క్లబ్ ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top