మాచర్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆత్మహత్య

మాచర్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఆత్మహత్య - Sakshi


- పురుగు మందు తాగి బలవన్మరణం

- అధికార పార్టీ నేతల వేధింపుల వల్లేనంటున్న కుటుంబ సభ్యులు

- గడువు కంటే ముందుగానే రాజీనామా చేయించిన టీడీపీ పెద్దలు

- మూడు నెలల క్రితం భర్త గుండెపోటుతో మృతి

 

 మాచర్ల టౌన్: అధికార పార్టీ నేతల వేధింపులు గుంటూరు జిల్లా మాచర్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్‌ను బలితీసుకున్నాయి. వాటిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గోపవరపు శ్రీదేవి(28) గురువారం రాత్రి పురుగు మందు తాగారు. దీన్ని ఇంట్లో ఎవరూ గమనించలేదు.ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు శుక్రవారం ఉదయం గుర్తించిన కుటుంబీకులు మాచర్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ  చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలిస్తుండగా మార్గంమధ్యలో పిడుగురాళ్ల వద్ద శ్రీదేవి మృతి చెందారు.



ఆమె భర్త మల్లికార్జునరావు 3 నెలల క్రితం గుండెపోటుతో మరణించారు. మాచర్ల మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ సీటును ఓసీ సామాజిక వర్గానికి కేటాయించడంతో మూడేళ్ల క్రితం అమెరికాలో ఉన్న మల్లికార్జునరావు కుటుంబాన్ని టీడీపీ నేతలు ఇక్కడికి రప్పించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన శ్రీదేవిని చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రకటించి కౌన్సిలర్‌గా పోటీ చేయించారు. ఎన్నికల్లో టీడీపీ నాయకులు ఆమెతో విపరీతంగా ఖర్చు చేయించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల్లో గెలుపొందిన శ్రీదేవి మాచర్ల చైర్‌పర్సన్ అయ్యారు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం శ్రీదేవి రెండున్నరేళ్లు పదవిలో ఉండాలి. అది పూర్తికాకుండానే రాజీనామా చేయాలంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో శ్రీదేవి చైర్‌పర్సన్ పదవి నుంచి తప్పుకున్నారు.



ఈ క్రమంలో ఆమె భర్త మల్లికార్జునరావు గుండె పోటుతో తుదిశ్వాస విడిచారు. ఎన్నికల్లో చేసిన ఖర్చు వల్ల అప్పులు పెరిగిపోవడంతోపాటు పార్టీ వేధింపులు తట్టుకోలేకే శ్రీదేవి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు పేర్కొన్నారు. శ్రీదేవికి ఎనిమిదేళ్ల కుమారు డు ఉన్నాడు. ఆమె మరణ వార్త మాచర్ల పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆమె భౌతికకాయాన్ని ఇంటికి తీసుకెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శ్రీదేవి అంత్యక్రియలు శనివారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top