‘మా’ ఇంట ఎన్నికల మంట!


  • రాజేంద్రప్రసాద్, జయసుధ ప్యానెళ్ల మధ్య ఢీ అంటే ఢీ



  • సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా నటీనటులకు ప్రాతినిధ్యం వహించే ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’లో వివాదం చెలరేగింది. దీంతో ఈ నెలాఖరున జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికలు రసకందాయంగా మారింది. ఈ పదవి కోసం బరిలోకి దిగిన సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, ఆయన కన్నా సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ పరస్పరం ఢీ అంటే ఢీ అంటున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందునుంచీ రాజేంద్రప్రసాద్ వెంట ఉంటూ వచ్చి, ఆయన ప్యానెల్ తరఫున పోటీకి దిగిన నటులు శివాజీరాజా, ఉత్తేజ్.. తాము పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. ఇక రాజేంద్రప్రసాద్‌కే మద్దతిస్తానని, ఆయనపై పోటీ చేసేది లేదని హీరో మంచు విష్ణు గతంలో ట్విట్టర్‌లో ప్రకటించగా, మరోపక్క ఆయన తండ్రి, సీనియర్ నటుడు మోహన్‌బాబు మాత్రం జయసుధకు మద్దతుగా బుధవారం ప్రకటన చేశారు. దీంతో రెండేళ్లకోసారి జరిగే ‘మా’ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠగా మారింది. చిత్ర పరిశ్రమలో ఎవరిని కదిలించినా ఇదే అంశంపై చర్చ జరుగుతోంది.

     

    హఠాత్తుగా నామినేషన్ల ఉపసంహరణ



    ప్రస్తుతం ‘మా’ కోశాధికారిగా ఉన్న శివాజీరాజా ఈసారి ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేస్తే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నటుడు ఉత్తేజ్ ఇప్పుడు జాయింట్ సెక్రటరీ పదవి కోసం బరిలోకి దిగారు. తీరా ఇప్పుడు విచిత్రంగా ‘వ్యక్తిగత కారణాల రీత్యా’ అంటూ ఉత్తేజ్ పక్కకు తప్పుకొన్నారు. కాగా, ఏకాభిప్రాయంతో ఎవరో ఒక్కరే పోటీలో ఉంటారంటేనే నామినేషన్ వేశానని, ఇప్పుడు మాట మార్చి, అవతలి వైపు నుంచి నటుడు అలీని ప్రత్యర్థిగా నిలబెట్టారని శివాజీరాజా పేర్కొన్నారు. ఈ రాజకీయం నచ్చకనే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజేంద్రప్రసాద్ వర్గం బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాజేంద్రప్రసాద్‌తో పాటు ఆయన ప్యానెల్‌లోని నటులు కాదంబరి కిరణ్, వింజమూరి మధు, వారికి మద్దతు ప్రకటించిన నాగబాబు తదితరులు ఇందులో పాల్గొని మాట్లాడారు.

     

    చెప్పిందొకటి.. జరిగిందొకటా?




    నిజానికి ఆరేడేళ్ల క్రితమే రాజేంద్రప్రసాద్ ‘మా’ అధ్యక్ష పదవికి మురళీమోహన్‌పైనే పోటీకి దిగి, కొద్ది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి మురళీమోహన్ సహా పలువురు సినీ పెద్దలు ముందుగా మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవమవుతుందని ఆయన భావించారు. అయితే, ఆఖరు క్షణంలో పోటీ అనివార్యమైంది. ఈ పరిణామానికి విస్తుపోయిన రాజేంద్రప్రసాద్ తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. ‘నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ జయసుధకు రాజకీయ నేతలతో చెప్పించామని, బెదిరించామని చేస్తున్న ఆరోపణ పచ్చి అబద్ధం. ఆమె, ఆమె వెనుక ఉన్న వ్యక్తి రాజకీయాల నుంచి వచ్చారు. కానీ నేను రాజకీయాల్లో నుంచి రాలేదు’ అని ఆయన అన్నారు. ‘మేం చేస్తున్నది ధర్మయుద్ధం. అవతల మాకు ప్రత్యర్థులుగా నిలిచిందీ మా వాళ్ళే! అయితే, ముందుగా నన్ను నిలబడమని చెప్పి, అన్నిటికీ ఒప్పుకొన్న మహా పెద్దలే ఆఖరు క్షణంలో ఎందుకు మాట మార్చి, వేరొకరిని పోటీకి పెట్టారో తెలియదు. నన్ను ఎన్నుకుంటే రూ. 5 కోట్లు సేకరించి నిధి ఏర్పాటు చేస్తా. పేద కళాకారులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్, అర్హులందరికీ పెన్షన్ అందేలా చూస్తా. దేశంలో మరే అసోసియేషన్‌కూ లేనంత అందమైన భవనం కట్టిస్తా’’ అని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఓటర్లకు సెల్‌ఫోన్లు పంచుతున్నామంటూ స్థాయి మరిచి, అసత్య ఆరోపణలు చేయడం బాధించినట్లు చెప్పారు. కాగా, ఈ ఎన్నికల్లో ఎన్నికల ఆఫీసర్‌గా చేస్తున్నది మురళీమోహన్ వ్యక్తిగత లాయరేననీ, అలాగే అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా వారికే సన్నిహితుడైన ‘మా’ సభ్యుడని రాజేంద్రప్రసాద్ వర్గం పేర్కొంది. మరోైవె పు గతంలో ‘మా’లో ఏం జరిగిందన్నది తనకు తెలియదని, ఈసారి తమ ప్యానల్‌ను ఎన్నుకుంటే కళాకారులందరికీ మంచి చేస్తామని జయసుధ పేర్కొన్నారు. కాగా, ఇంత జరుగుతున్నా సినీ పరిశ్రమలో విభేదాలనే మాటను మురళీమోహన్ అంగీకరించడంలేదు. ‘పరిశ్రమలో వర్గ విభేదాలు, ప్రాంతీయ విభేదాలు ఎప్పుడూ లేవు. ఏదైనా విషయంలో ఎదురెదురు నిలబడినా, అది అయిపోయాక అందరం కలిసిపోతాం’ అని ఆయన అన్నారు.

     

    ఆరోపణలు, ప్రత్యారోపణలు..  



    ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు మురళీమోహన్ అండతో బరిలోకి దిగిన జయసుధ వర్గం మంగళవారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలపై రాజేంద్రప్రసాద్ వర్గం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికి ఆరు పర్యాయాలు అంటే 12 ఏళ్ల పాటు ‘మా’ అధ్యక్ష పదవిని మురళీమోహన్ నిర్వహించారనీ, ఆయన పోటీ చేయబోనని చెప్పడంతోనే  కొందరు మిత్రుల కోరిక మేరకు రాజేంద్రప్రసాద్ ముందుకొచ్చారని, పెద్దలందరినీ కలసి మద్దతు తీసుకున్నారని నాగబాబు వివరించారు. నామినేషన్లు ముగిసేరోజున.. జయసుధ తదితరుల నామినేషన్లు వచ్చినట్లు ఆరోపించారు. పోటీ చేయబోనని చెప్పిన మురళీమోహన్... రాజేంద్రప్రసాద్ పోటీకి దిగిన తర్వాత ‘ఆ పదవికి తగ్గ స్థాయి రాజేంద్రప్రసాద్‌కు లేద’ని తనతో వ్యాఖ్యానించినట్లు నాగబాబు చెప్పారు. అలాగే, గతంలో ఉన్న ‘అసోసియేట్ మెంబర్‌షిప్’ను తొలగించి వర్ధమాన కళాకారులకు అసోసియేషన్‌ను దూరం చేశారని మురళీమోహన్‌పై మండిపడ్డారు. ‘నాగబాబు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 38 మంది పేద కళాకారులకు నెలకు రూ.1,000 ఇచ్చేవాళ్లం. ఇప్పుడవన్నీ తీసేసి, ఒక్కరికే ఇస్తున్నారు. కోట్ల నిధి ఉన్న ‘మా’కు ఇదేం కర్మ? అదేమంటే, అవన్నీ తీసేశామని మా లాంటి చిన్నవాళ్ల మీద కన్నెర్ర చేస్తున్నారు’ అని కాదంబరి కిరణ్ వాపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top