మాజీ మంత్రికే చిత్తూరు షుగర్స్ ?


అమ్మకానికి రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం

 

చిత్తూరు: చారిత్రక చిత్తూరు షుగర్స్‌ను అమ్మకానికి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు * 700 కోట్ల విలువైన ఆస్తులున్న కర్మాగారాన్ని మాజీ మంత్రికి అతి తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి,మాజీ మంత్రి మధ్య ఒప్పందం కుదిరినట్లు అధికారపార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చక్కెర కర్మాగారాన్ని మాజీ మంత్రికి కట్టబెట్టాలనుకోవడంపై అధికార పార్టీలో ఓ వర్గం వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. అరుుతే దీన్ని పరిగణనలోకి తీసుకోకుండా అధినేత అమ్మకానికే మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.  



కిరణకుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చిత్తూరు  చక్కెర కర్మాగారాన్ని  కొనుగోలు చేసేందుకు అప్పట్లో అధికారపార్టీలో ఉన్న  ప్రస్తుత మాజీ మంత్రి తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. అయితే కర్మాగారాన్ని అమ్మే విషయంలో కిరణ్‌కుమార్ వెనక్కు తగ్గడంతో మాజీ మంత్రి ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు అధికార పార్టీలో చేరిన ఆ నేత ఫ్యాక్టరీని తక్కువ ధరకు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ముఖ్యనేతతో లోపాయికారి ఒప్పందానికి సైతం దిగినట్లు  గుసగుసలు వినిపిస్తున్నాయి.



 2002లోనే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు *18 కోట్లకు చక్కెర కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారు. అప్పట్లో రైతులు ,కార్మికులు అడ్డుపడి కోర్టుకు వెళ్లి  ఫ్యాక్టరీని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అవకాశం రాక పదేళ్లు బాబు ఊరుకున్నారు. ఇప్పుడు మళ్లీ అధికారం చేపట్టాక ఫ్యాక్టరీని అమ్మి పంతం నెగ్గించుకునేందుకు సిద్ధమయ్యారనే విమర్శలు ఉన్నాయి. అందులో   భాగంగానే సహకార చక్కెర కర్మాగారాల వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకంటూ ఐదుగురు ప్రైవేటు వ్యక్తులతో బాబు కమిటీ వేశారు. బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో అధికంగా బకాయిలున్న కర్మాగారాలను అమ్మడమే మేలంటూ కమిటీ ద్వారా నివేదికలు సిద్ధం చేయించారు. చిత్తూరు కర్మాగారం పరిధిలో 84.5 ఎకరాల విలువైన స్థలం ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం మొత్తం స్థలాన్ని అమ్మితే * 600 నుంచి 700 కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్టరీ స్క్రాబ్ అమ్మితే రూ.10 కోట్లకు పైగా వస్తుంది.



మరో వైపు చిత్తూరు షుగర్స్ తోపాటు నెల్లూరు జిల్లాలో కోవూరు, గుంటూరు జిల్లా తెనాలి, వైఎస్సార్ జిల్లాలోని చెన్నూరు సహకార చక్కెర కర్మాగారాలను సైతం అమ్మకానికి పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక చిత్తూరు జిల్లాలోని గాజులమండ్యం, విశాఖపట్నం జిల్లాలోని తోడవరం, ఏటికొప్పాక, అనకాపల్లి, తుని విజయనగరం జిల్లాలోని విజయరామగజపతి సహకార చక్కెర కర్మాగారాలను 33 ఏళ్ల లీజుకు ప్రయివేటు పరం చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top