ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సార్లు

ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సార్లు - Sakshi


ఒకటికాదు.. రెండు కాదు.. మూడు సార్లు విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే వరించింది.  అధికార పార్టీ ప్రలోభాలు, కుట్రలు, కుతంత్రాలు పటాపంచలయ్యాయి. అధికార జులుం మట్టికరిచింది. లాటరీ ధర్మాన్ని పలికింది. దాంతో రెండో జిల్లా పరిషత్ పీఠాలు వైఎస్ఆర్ సీపీకే దక్కాయి. వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు జిల్లాలో  లాటరీ ద్వారా జెడ్పీ పీఠం వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్ జిల్లాలోని  జిల్లాలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 18 కౌన్సిలర్ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.



టీడీపీకి కేవలం రెండు స్థానాలే దక్కాయి. అనూహ్యంగా 8 మంది  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు టీడీపీ ప్రలోభాలకు లొంగారు. దాంతో ఇరువర్గాల బలం సమానమైంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరావు మనోధైర్యాన్ని నింపారు. తన స్వగ్రామమైన దేవగుడిలో శిబిరం ఏర్పాటు చేయించారు.  అధికారులు లాటరీ వేశారు.  చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలు వైఎస్సార్‌సీపీకే దక్కాయి.



అలాగే జమ్మలమడుగులో 9 స్థానాలను  వైఎస్సార్‌సీపీ, 11స్థానాలను టీడీపీ దక్కించుకుంది.  ఎమ్మెల్యే, కడప ఎంపీ ఓటుతో వైఎస్సార్‌సీపీ బలం  11కు పెరిగింది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ కూడా  లాటరీ అనివార్యమైంది. దాంతో అధికారులు లాటరీ తీయటంతో  చైర్మన్  స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరించింది.



ఇక నెల్లూరు జెడ్పీ వ్యవహారం హైకోర్టు వరకూ వెళ్లింది. జిల్లాలోని 46 జెడ్పీటీసీల్లో వైఎస్సార్‌సీపీ 31, టీడీపీ 15 స్థానాలను దక్కించుకున్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు చేయని ప్రయత్నాలు లేవు. ప్రలోభాలు, బుజ్జగింపులు, బెదిరింపులు, అక్రమ కేసులతో చివరకు 8 మంది వైఎస్సార్‌సీపీ సభ్యులను తమ వైపు తిప్పుకుంది.



పోలీసు అధికారులు సైతం అధికార పార్టీకి కొమ్ముకాశారు. మొదట ఈ నెల 5న జరగాల్సిన ఎన్నిక అధికార పార్టీ సభ్యుల దౌర్జన్యాలు, దాడులతో వాయిదా పడింది. దాంతో ఈనెల 20వ తేదీన ఎన్నిక నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ కూడా లాటరీ అనివార్యమైంది. ఎట్టకేలకు ఆదివారం జరిగిన ఎన్నికలో వైఎస్సార్‌సీపీ లాటరీ ద్వారా ఘన విజయం సాధించింది.

 

మరోవైపు జిల్లా పరిషత్‌లను దక్కించుకొనేందుకు టీడీపీ ఎన్ని అడ్డదారులు తొక్కినా చివరకు భంగపాటు తప్పలేదు. అధికారం తమదేనన్న  గర్వంతో ఉన్న ఆ పార్టీ నేతలు జెడ్పీ చైర్మన్ పదవి కోసం అనేక అడ్డదారులు తొక్కారు. కోట్ల రూపాయలు ఇస్తామంటూ సభ్యులను ప్రలోభపెట్టారు. పోలీసుల సాయంతో బెదిరించారు. తప్పుడు కేసులు పెట్టారు. రెండు మార్లు ఎన్నికను వాయిదా వేయించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. జిల్లా ప్రజల ఛీత్కారం ఎదుర్కొన్నారు. చివరకు వారికి భంగపాటే ఎదురైంది.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top