తక్కువ ధర: పెట్రోల్‌, డీజిల్‌ కోసం క్యూ!

తక్కువ ధర: పెట్రోల్‌, డీజిల్‌ కోసం క్యూ!

  • కర్ణాటకలో లీటరుపై రూ.6.70 నుంచి రూ.7దాకా తక్కువ ధర

  • ఏపీలో అమరావతి నిర్మాణం పేరిట 4శాతం అదనపు పన్నులు

  • దీంతో సరిహద్దుల్లోని బంకులకు వెళుతున్న జనం

  • పలమనేరు: పలమనేరు ప్రాంతపు వాహనదారులు పెట్రోలు, డీజల్‌ కోసం పొరుగున ఉన్న కర్ణాటకపై ఆధారపడుతున్నారు. వీలున్నప్పుడల్లా కర్ణాటకకు వెళ్లి తమ వాహనాల ట్యాంకుల నిండా పెట్రోల్, డీజిల్‌ పోయించుకుంటున్నారు. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్‌ కంటే.. కర్ణాటకలో డీజల్, పెట్రోలు ధరలు తక్కువగా ఉండటమే.. ఇక్కడి కంటే కర్ణాటకలో లీటరు డీజిల్‌, పెట్రోల్‌ రూ.6.70 నుంచి రూ.7 దాకా తక్కువగా లభిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత  పన్ను నాలుగు శాతానికి అదనంగా 4శాతం (మొత్తం 8శాతం) వసూలు చేస్తుండటంతో ధరల్లో ఈ వ్యత్యాసం ఏర్పడింది. ఫలితంగా సరిహద్దుల్లో కర్ణాటకలో ఉన్న పెట్రోలు బంకుల్లో కళకళలాడుతుండగా స్థానిక బంకులు మాత్రం వెలవెలబోతున్నాయి. పలమనేరులో శుక్రవారం పెట్రోలు లీటరు రూ.70.80 కాగా కర్ణాటకలో రూ.64.10. ఇక ఏపీలో డీజల్‌ లీటరు రూ.62.63 కాగా కర్ణాటకలో రూ. 55.93. మొత్తం మీద రూ. 6.75 వరకు అక్కడ తక్కువకు పెట్రోల్‌, డీజిల్‌ లభిస్తున్నాయి.



    ఏడాదిగా తగ్గిన అమ్మకాలు..

    పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి మండలాలకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఇక్కడ 90 పంచాయితీలుండగా సగం పల్లెలకు నియోజకవర్గ కేంద్రం కంటే కర్ణాటక రాష్ట్ర సరిహద్దే దగ్గరగా ఉంది. వీకోట పట్టణానికి ఆనుకునే కర్ణాటక సరిహద్దు ఉంది. దీంతో స్థానికంగా అధిక ధరతో కొనే బదులు కర్ణాటకలో కొంటే డబ్బు ఆదా అవుతుందని ప్రజలు పొరుగురాష్ట్రం బాటపడుతున్నారు. నియోజకవర్గంలో 15 పెట్రోలు బంకులున్నాయి. గతంలో ధరల వ్యత్యాసం లేనపుడు ఇక్కడ రోజుకు సగటున 80వేల లీటర్ల చమురు విక్రయాలు సాగుతుండేవి. ప్రస్తుతం ధరల వ్యత్యాసంతో రోజుకి 40 వేల లీటర్లకు పడిపోయింది.



    సరిహద్దుల్లో బోర్డులు పెట్టుమరీ అమ్మకాలు

    కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లోని నంగిళి, ముళభాగిలు, తిమ్మరాజుపల్లి, వీకోట సరిహద్దు, రాజుపల్లిలో సరిహద్దుల అటువైపు ఉన్న పెట్రోల్‌ బంకులు బోర్డులు పెట్టి మరీ విక్రయాలు సాగించడం విశేషం. దీంతో వాహనదారులు తమ వాహనాలను అక్కడికి తీసుకెళ్ళి ఫుల్‌ట్యాంకు చేయించుకుంటున్నారు.



    జీఎస్టీ అమలైనా లాభమేమి?

    నిత్యావససరాలైన పెట్రోలు, డీజల్‌పై జీఎస్టీ లేకపోవడంతో రాష్ట్రాలు ఇస్టానుసారంగా పన్నులను పెంచుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం సెంట్రల్‌ టాక్స్‌ 11.80శాతం, ఎక్సైజ్‌ డ్యూటీ 9.75శాతం, వ్యాట్‌ సెస్‌ 4శాతం, స్టేట్‌ టాక్స్‌ 8శాతంగా ఉన్నాయి. దీనికితోడు ఏపీలో అదనపు పన్నుల కారణంగానే ధరల్లో వ్యత్యాసం ఏర్పడింది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ధరలు అదుపులోకి వస్తాయని చెప్పిన కేంద్రం పెట్రోల్, డీజిల్‌ ధరల విషయంలో దీనిని అమలుచేయకపోవడమేమిటని వాహనదారులు నిలదీస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top