ఏంకష్టం వచ్చిందో..!

ఏంకష్టం వచ్చిందో..! - Sakshi


ప్రేమజంట ఆత్మహత్య

కలకాలం కలిసి ఉండాలనుకున్న ప్రేమజంటకు ఏంకష్టం వచ్చిందో తెలియదుగాని ఈ లోకం విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. బలవన్మణానికి తెగించి విషాదాన్ని మిగిల్చారు. ఈ  సంఘటన పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఓ లాడ్జిలో శనివారం వెలుగుచూసింది. చనిపోయినవారు ఒడిశా వాసులుగా పోలీసులు గుర్తించారు. రామచంద్ర బారికో(25) సుకంతి పారిక(17) తనువు చాలించినట్టు పేర్కొన్నారు.



శ్రీకాకుళం జిల్లా : కలసి బతకలేమని భావించారో.. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని అనుకున్నారో.. ఇంకేమి కష్టం వచ్చిందో గానీ.. ఆ బాధను ఎవరికీ పంచుకోలేక, ఇంకెవరికీ భారం కాలేక ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఎలానూ బతకలేమని నిర్ణయించుకుని.. మరణంలోనైనా కలసే ఉందామని భావించి ఒకరికొకరు హత్తుకుని తనువు చాలించారు. తల్లిదండ్రులకు, అయిన వారికి తీరని శోకాన్ని మిగిల్చి.. తిరిగిరాని లోకాలకు వెడలిపోయారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ బాలిక, ఐటీఐ చదివి కాంట్రాక్టు పనులు చేసుకుంటున్న యువకుడు కాశీబుగ్గలోని లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.



ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.     పర్లాఖిమిడి సంతతోటకు చెందిన లక్ష్మీబారికో, హరి బారికో కుమారుడు రామచంద్ర బారికో(25) సెంచూరియన్‌ యూనివర్సిటీలో ఐటీఐ పూర్తి చేశాడు. మహేంద్రగడ పంచాయతీలో కాంట్రాక్టు పనుల్లో చేరాడు. సమీపంలో ఉన్నటువంటి డెరబాకు చెందిన దుకా పైకా, రుషియా పైకాలకు ఆరుగురు కుమార్తెలు. ఇందులో నాలుగో కుమార్తె సుకంతి పైకా(17) 8వ తరగతి చదివి మానేసింది. అప్పటి నుంచి ఖాళీగా ఉంటోంది. చెల్లాగూడలో ఉన్నటువంటి తన అక్క ఇంటికి వెళ్లి వస్తుండేది.



ఈ తరుణంలో రామచంద్ర బారికోతో పరిచయం పెరిగి, స్నేహంగా మారింది. ఆ స్నేహం కాస్త.. ప్రేమగా మారి ఇద్దరు తరచూ రహస్యంగా కలుసుకునేవారు. రామచంద్ర తల్లి లక్ష్మీబారికో పర్లాఖిమిడిలో నివాసం ఉంటోంది. తండ్రి గతంలోనే మరణించాడు. అతని అన్న తారక బారికో టెక్కలి రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్నాడు. కాంట్రాక్టు పనుల్లో ఇబ్బందిగా ఉందని, పూణె వెళ్లి పనులు చూసుకుంటానని తన అన్నకు రూ.20 వేలు అడిగి రామచంద్ర గురువారం ఇంటి నుంచి వచ్చేశాడు. అటు సుకంతి పైకా కూడా గురువారం నుంచి ఇంటి వద్ద కనిపించలేదు. ఆమె కుటుంబ సభ్యులు గ్రామమంతా వెతికారు. తన అక్క వాళ్ల ఇంటికి వెళ్లింటుందని భావించారు.



పలాస లాడ్జిలో దిగి..

ఇదిలా ఉండగా.. ఇంటి నుంచి వచ్చేసిన రామచంద్ర, సుకంతి పైకాలు గురువారం రాత్రి ద్విచక్ర వాహనంపై కాశీబుగ్గ పట్టణంలోని పాత జాతీయ రహదారి పక్కనే ఉన్న శంకర్‌ లాడ్జిలో దిగారు. పూణె వెళ్తున్నట్లు చెప్పి, గదిని అద్దెకు తీసుకున్నారు. రోజంతా అక్కడే ఉన్నారు. శుక్రవారం రాత్రి భోజనం పార్సిల్‌ను లాడ్జి గదిలోకి తీసుకెళ్లారు. శనివారం తెల్లవారుజామున 6 గంటలైనా బయటకు రాకపోవడంతో లాడ్జి సిబ్బంది అనుమానం వచ్చి వారి గది వద్దకు వెళ్లి చాలాసేపు పిలిచారు. ఎంతకూ సమాధానం రాకపోవడంతో బలవంతంగా తలుపులు తొలగించి లోపలికి వెళ్లి చూశారు.



ఇద్దరూ స్లాబ్‌ కొక్కేనికి చీరతో ఉరివేసుకుని కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శుక్రవారం రాత్రే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద, సీఐ కె.అశోక్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పంచనామా అనంతరం రాత్రి 7 గంటల సమయంలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే, ఇద్దరూ మరణించడానికి కారణాలను మాత్రం ఇరువైపుల కుటుంబ సభ్యులూ చెప్పలేకపోతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top