లాటరీ టోకరా


  • లక్షల డాలర్లు తగిలాయంటూ ప్రచారం

  •  మెసేజ్‌లు పంపుతూ బురిడీ

  •  ఆపై సర్వీసు చార్జీల పేరిట మోసం

  • చిత్తూరు (అర్బన్): ‘హాయ్, నా పేరు మెలీస్సా. భారత్‌లో పేద ప్రజల ఉపయోగార్థం 8.5 మిలియన్ డాలర్ల సొమ్మును మీకు ఇవ్వాలని భావిస్తున్నా. మీ బ్యాంకు ఖాతా నంబరు, చిరునామా, ఫోన్ నంబరు వివరాలు వెంటనే నాకు మెయిల్ చేయండి...’

     

    ఇలా కొందరు విదేశీయులు మధ్య తరగతి ప్రజల్ని లక్ష్యం చేసుకుని మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు తదితర ప్రాంతాల్లోని ప్రజలకు ఇలాంటి మెసేజ్‌లు రోజూ వస్తున్నాయి. వీటిని కొందరు నమ్మకపోగా, చాలామంది ఈ వలలో పడిపోయి చేతిలోని నగదును పోగొట్టుకుంటున్నారు.



    సులభంగా డబ్బు సంపాదించడానికి నైజీరియా, ఇతర దేశాలకు చెందిన కొందరు వ్యక్తులు ఇటీవల  మొబైల్ ఫోన్లకు ఇలాంటి మెసేజ్‌లు పంపిస్తున్నారు. జిల్లాలో చాలామంది మొబైల్ ఫోన్లకు బీఎండబ్ల్యూ, ఆడి, ల్యాండ్ రేంజ్ రోవర్స్, రోగ్స్‌రాయల్ లాంటి లగ్జరీ కార్లు లాటరీలో తగిలాయని, కోట్ల రూపాయల నగదు వచ్చిందని తప్పుడు మెసేజ్‌లు పంపుతూ రూ.లక్షలు రాబట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

     

    ఇలా చేస్తున్నారు...

     

    ఎవరి సెల్‌ఫోన్‌కు మెసేజ్ పంపుతారో వారి ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు, చిరునామా వివరాలను తమకు మెయిల్ చేయమని మోసగాళ్లు చెబుతారు. తరువాత రూ.4.60 కోట్లు లాటరీ వచ్చిందని నిర్ధారణ చేసే సర్టిఫికెట్, యూకే దేశం ఇచ్చిన ఓ సర్టిఫికెట్‌తో పాటు మోసం చేసే వ్యక్తి తనను తాను పరిచయం చేసుకోవడానికి ఓ గుర్తింపుకార్డును తయారు చేసుకుని వివరాలను మన మెయిల్‌కు పంపుతారు.



    అనంతరం ఫోన్‌లైన్‌లో విదేశీయుడి పేరిట మాటలు కలిపి, తాను ప్రస్తుతం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఉన్నానని, తనవద్ద ఉన్న పెద్ద మొత్తం నగదును చిత్తూరుకు తీసుకురావాలంటే ఢిల్లీ కస్టమ్స్ అధికారులకు రూ.1.60 లక్షలు పన్ను చెల్లించాలని చెబుతారు. రూ.1.60 లక్షల నగదు ఇవ్వాల్సిన అవసరం లేదని, నేరుగా కస్టమ్స్ అధికారుల ఖాతాలోకి వేస్తే సరిపోతుందంటారు. అలా బ్యాంకులో సర్వీసు టాక్స్ కట్టిన వెంటనే రూ.4.60 కోట్లు మీ ఖాతాలోకి జమ అయిపోతుందని నమ్మబలుకుతారు.



    ఇక్కడే తెలివిగా ప్రవర్తించాలి. నిజంగానే రూ.4.60 కోట్ల లాటరీ తగిలితే ఆ సర్వీసు చార్జీలు ఏవో మినహాయించుకుని మిలిగి మొత్తాన్ని పంపొచ్చు. కానీ మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు తప్పుడు మాటలు చెప్పి చదువుకున్న యువ తీ, యువకుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. చిత్తూరు నగరంలో బీ.టెక్ చదువుకున్న ఓ యువతి ఈ తరహా మోసాన్ని నమ్మి రూ.60 వేలు బ్యాంకు ద్వారా పంపిం చేసి తీరా తాను మోసపోయానని చెప్పి పోలీసుల్ని ఆశ్రయించినా అప్పటికే జరగాల్సిన మొత్తం జరిగిపోయింది.

     

    మోసపోవద్దు



    ఎవరైనా సరే కష్టపడకుండా డబ్బులు రావనే విషయాన్ని గుర్తించుకోవాలి. సులభంగా డబ్బులొస్తాయనుకుంటే ఉన్న నగదును పోగొట్టుకుని కొత్త సమస్యలు వచ్చిపడతాయి. చదువుకున్న యువతే ఇలాంటి మెసేజ్‌లకు మోసపోయి నగదు పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. లాటరీల పేరిట మెసేజ్‌లు పంపే వ్యక్తులకు ఎవరూ వారి వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు. నగదు పోవడంతో పాటు వ్యక్తుల మెయిల్స్, ఇతర సమాచారాన్ని దొంగిలించే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల లేనిపోని సమస్యలు కూడా వచ్చిపడతాయి.

     - మహేశ్వర్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్, చిత్తూరు

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top