నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్లో మాత్రం వాటాలేదు : వైఎస్ జగన్

నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్లో మాత్రం వాటాలేదు : వైఎస్ జగన్ - Sakshi


నగరం: గ్యాస్ ఉత్పత్తిలో, పంపిణీలో ఏదైనా పొరపాటు జరిగితే అన్నిరకాలుగా రాష్ట్రానికి నష్టం వస్తుందని,  గ్యాస్లో వాటా మాత్రం మన రాష్ట్రానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు.  తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన  ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్యాస్‌ ప్రమాదాలన్నీ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు.



అయితే ఈ ప్రాంత మనుషుల జీవితాలకు, పర్యావరణానికి భద్రతలేదన్నారు. ఈ ప్రాంతంలో ఈ రకమైన ప్రమాదం జరగడం ఇదే మొదటి సారి కాదని చెప్పారు. గతంలో ఎన్నో జరిగాయని తెలిపారు. లీకేజీపై ఏడాదిగా ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు చెప్పారన్నారు. గ్యాస్‌ లీకైనప్పడు అప్పటికప్పుడు కాస్త తవ్వి సిమెంట్‌ వేసి వదిలేస్తున్నారని తెలిపారు.   గ్యాస్ లీకవుతుంటే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఈ ప్రమాదం జరిగిందన్నారు.



సింగరేణి కాలరీస్లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం  వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు.  బొగ్గుపై సింగరేణి ఇస్తున్నట్లే, గ్యాస్‌పైనా 50 శాతం రాయల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. పైసా ఆదాయం రాని సంస్థల కోసం ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు. మనుషులు సజీవ దహనమయ్యారు, ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రంను అడిగి గ్యాస్లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని  చంద్రబాబును  జగన్ కోరారు.



ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చనక్కాయలు వేసినట్లుగా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుందన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓఎన్జిసి, గెయిల్, చంద్రబాబు ఆలోచించాలని కోరారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు విదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అవే ప్రామాణాలు ఇక్కడా పాటించాలన్నారు. యాజమాన్యాలకు భయం కలిగేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. గ్యాస్ పంపిణీ స్టేషన్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు. నష్టపోయిన కొబ్బరి రైతాంగానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన చెట్లను కొట్టివేసి కొత్త మొక్కలను నాటడానికి, అవి ఇంత ఎత్తున పెరగడానికి ఎకరానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వివరించారు. అందుకు తగ్గ సహాయం రైతులకు చేయాలని డిమాండ్ చేశారు.  ఈ ఘటనపై గెయిల్‌, ఓన్‌జీసీతోపాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించాలని కోరారు.



అనంతరం జగన్ అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ  క్షతగాత్రులను పరామర్శించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top