తెలంగాణలో లాభాలు.. ఏపీలో నష్టాలు

తెలంగాణలో లాభాలు.. ఏపీలో నష్టాలు - Sakshi


గత జూన్ నెల లెక్కలను విడివిడిగా వెల్లడించిన ఆర్టీసీ 

 తెలంగాణలో రూ. 7.87 కోట్ల మిగులు


 

 ఆంధ్రప్రదేశ్‌లో   రూ. 20.18 కోట్ల నష్టం

 ఇరు రాష్ట్రాల లెక్కలను తేల్చిన అధికారులు

తెలంగాణలోని మూడు జోన్లలో లాభాల పంట

ఏపీలోని అన్ని జోన్లూ నష్టాల బాటలోనే..


 

హైదరాబాద్: కొన్నేళ్లుగా తీవ్ర నష్టాల్లో ఉన్నామని చెబుతోన్న ఆర్టీసీ... తొలిసారిగా తెలంగాణ ప్రాంతంలో లాభాలు ఆర్జిస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భారీ నష్టాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. గత జూన్‌లో తెలంగాణ ఆర్టీసీ రూ. 7.87 కోట్ల లాభాలు ఆర్జించగా... ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ రూ. 20.18 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నట్లు తెలిపింది. అధికారికంగా రాష్ట్ర విభజన జరిగిన జూన్ నెలలో ఇది చోటు చేసుకోవటం గమనార్హం.



రాష్ట్రం విడిపోయినా ఆర్టీసీ ఉమ్మడిగా ఉండటంతో అన్ని లెక్కలనూ ఉమ్మడిగానే చూపుతూ వచ్చిన ఆర్టీసీ.. తొలిసారిగా గత జూన్ నెల లెక్కలను విడివిడిగా వెల్లడించింది. జూన్ నెల ఆదాయ/అప్పుల వివరాలతో కూడిన జాబితాను అధికారులు శుక్రవారం అధికారికంగా తేల్చారు. గత మే నెల వరకు రెండు ప్రాంతాల్లో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు చూపించగా... ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో లాభాలు వస్తున్నట్లు చూపారు. అయితే కొన్నేళ్లుగా లాభాల ఊసే లేని ఆర్టీసీలో ఒకే నెలలో ఏకంగా రూ. 7.87 కోట్ల లాభాలు చూపడంపై చర్చకు తెరలేచింది. గత ఆరు నెలల కాలానికి దేశవ్యాప్తంగా రవాణా సంస్థల లాభనష్టాల వివరాలను కేంద్ర రోడ్డు రవాణా ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలోని ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్’ తాజా సంచికలో వెల్లడించింది. దాని ప్రకారం దేశవ్యాప్తంగా కర్ణాటకలోని ఈశాన్య కర్ణాటక ఆర్టీసీ మాత్రమే లాభాల్లో ఉండగా... మిగతా 59 కార్పొరేషన్లు నష్టాల్లో ఉన్నాయి. అందులోనూ ఈశాన్య కర్ణాటక ఆర్టీసీ కూడా ఆరు నెలల కాలానికి  కేవలం రూ. 2.70 కోట్ల లాభాలే ఆర్జించింది. అలాంటిది తెలంగాణ ఆర్టీసీ ఏకంగా ఒక్క జూన్ నెలలోనే రూ. 7.87 కోట్ల లాభాలు పొందడాన్ని అధికారులు విశేషంగా పరిగణిస్తున్నారు. అయితే తర్వాతి నెలల్లో ఈ లాభాలు ఉంటాయోలేదో చెప్పలేమని.. ఇంతకుముందటిలా నష్టాలు ఉండకపోవచ్చని మాత్రం చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు జూలై వివరాలను క్రోడీకరిస్తున్నారు.

 

ఇటు లాభం.. అటు నష్టం




గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలోని మూడు జోన్లకుగాను సిటీ జోన్ రెండు నెలల పాటు స్వల్ప లాభాలనార్జించగా హైదరాబాద్ జోన్, కరీంనగర్ జోన్ మాత్రం నష్టాలనే మూట గట్టుకున్నాయి. అదే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ నెలలో ఈ మూడు జోన్లు కూడా లాభాల బాటపట్టడం విశేషం. హైదరాబాద్ జోన్ రూ. 35 లక్షల స్వల్ప లాభాన్నే పొందినప్పటికీ... హైదరాబాద్ సిటీ, కరీంనగర్ జోన్‌లు ఏకంగా రూ. 3 కోట్లను మించి లాభాలు పొందాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, వైఎస్సార్ కడప, విజయవాడ, విజయనగరం జోన్లన్నీ నష్టాలు చవిచూశాయి. ఆర్టీసీలో అతిపెద్ద వ్యయం పద్దు డీజిల్‌దే. ఆ నెలలో తెలంగాణలో డీజిల్‌కు ఖర్చు రూ. 109 కోట్లు కాగా, ఏపీలో రూ. 140 కోట్లుగా నమోదైంది.

 

ముందు నుంచీ లాభాలు..




చాలాకాలంగా తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీకి లాభాలు వస్తున్నప్పటికీ.. ఉమ్మడిగా ఉంటుండటంతో అది కనిపించడం లేదని ఆర్టీసీ తెలంగాణ అధికారులు చెబుతున్నారు.  ఆర్టీసీ విభజన వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్న షీలాభిడే కమిటీ నియమించిన ప్రైవేటు కన్సల్టెన్సీ రూపొందించిన నివేదిక తప్పుల తడక అని దీనితో తేలిపోయిందని అంటున్నారు. తెలంగాణ ఆర్టీసీ వార్షిక నష్టాలు రూ. 900 కోట్లుగా ఉన్నట్లు ఆర్టీసీ రికార్డులు సూచిస్తున్నా.. అవి రూ. 1,350 కోట్ల వరకు ఉన్నట్లు ప్రైవేటు కన్సల్టెన్సీ తేల్చిందని, అంత నష్టాలు ఉండవనేది తాజా లెక్కలతో తేలిపోయినందున ఆ నివేదికను పరిగణించొద్దని వారు పేర్కొంటున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top