ఆటో, లారీ ఢీకొని ఐదుగురు మృతి

ఆటో, లారీ ఢీకొని ఐదుగురు మృతి


జిల్లాలో ఆదివారం పలుచోట్ల మృత్యువు కరాళనృత్యం చేసింది. వేర్వేరు ఘటనల్లో తొమ్మిది మందిని కబళించింది. ముదినేపల్లి మండలం పెదపాలపర్రులో లారీ ఆటోను ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. అందులో ఇద్దరు తల్లీకొడుకు కాగా, మరో ఇద్దరు దంపతులు. విజయవాడలో పాత భవనం కూలుస్తుండగా ఇద్దరు కూలీలు శ్లాబు కూలి అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. వీరుల పాడు మండలం దొడ్డదేవరపాడులో ట్రాక్టర్ కింద పడి డిగ్రీ విద్యార్థి నరసింహారావు మృతి చెందాడు.

 

లారీ, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం

మృతుల్లో తల్లీ కొడుకు, భార్యాభర్తలు

ఆటో డ్రైవర్ పరిస్థితి విషమం

పెదపాలపర్రులో ఘటన


గుడివాడ/ముదినేపల్లి : గుడివాడలో పనులు ముగించుకుని ఆటోలో ఇళ్లకు బయలుదేరిన వారిని మార్గంలోనే మృత్యువు కబళించింది. చేరుకోవాల్సిన ప్రదేశానికి కొద్ది దూరంలోనే లారీ రూపంలో వచ్చిన మృత్యువు ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు మలుపు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వారిని ప్రమాద స్థలం నుంచి గుడివాడ ఏరియా ఆస్పత్రికి తీసుకురాగా ఇక్కడి వైద్యులు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలించారు.



ఆదివారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటన వివరాలిలా ఉన్నాయి. ముదినేపల్లి, గుడివాడ, కైకలూరు మండలాలకు చెందిన పలువురు ముదినేపల్లి మండలం ములకలపల్లికి చెందిన కమ్మగుంట వెంకటేశ్వరరావు అలియాస్ విజయరాజు ఆటో ఎక్కారు. ఆటోలో డ్రైవర్ సహా ఎనిమిది మంది ఉండగా, అందులో ఇద్దరు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ఆటో పెదపాలపర్రు మలుపు వద్దకు వచ్చాక ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది.



ఆటోలో ఉన్న కైకలూరుకు చెందిన ముంగి కుమారి (30), ఆమె కుమారుడు గణేష్ (12), ముదినేపల్లి మండలం కాకరవాడకు చెందిన పెయింటర్ ముక్కు రామ్మోహనరావు (25) అక్కడికక్కడే మృతిచెందారు. మండవల్లి మండలం చావలిపాడుకు చెందిన దంపతులు బోయిన సాంబశివరావు (50), బోయిన రామలక్ష్మి (45) తీవ్రంగా గాయపడగా, వారిని 108 సహాయంతో గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంలో చనిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముదినేపల్లి మండలం కొత్తపల్లికి చెందిన బొర్రా సురేష్ (25) విజయవాడ ఆస్పత్రిలో ప్రాణాలొదిలాడు.



ఇతను వరుణ్‌మోటార్స్‌లో పనిచేస్తాడని తెలిసింది. ఈ ఘటనలో ఆటోడ్రైవర్ కె.విజయరాజు తీవ్రంగా గాయపడగా అతన్ని సురేష్‌తో పాటు విజయవాడకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న గుడివాడ డీఎస్పీ వై.అంకినీడు ప్రసాద్, గుడివాడ రూరల్ సీఐ శివాజీరావు, ముదినేపల్లి ఎస్సై వి.సురేష్ అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు.

 

గాయంతో బయటపడ్డాను..

ప్రమాదం జరిగిన ఆటోలోనే ఉన్న గుడివాడ రూరల్ మండలం వలివర్తిపాడు డ్రైవర్‌నగర్ కాలనీకి చెందిన కె.రాజేష్ స్వల్ప గాయంతో బయటపడ్డారు. ముదినేపల్లి మండలం చిగురుకోటలోని అత్తగారింటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన అతను ప్రమాదం నుంచి బయటపడటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

 

మృత్యువులోనూ వీడని బంధం

ఈ ప్రమాదంలో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందిన దంపతులు బోయిన సాంబశివరావు, రామలక్ష్మి దంపతుల మృత్యువులోనూ ఒక్కటిగా ప్రాణాలొదిలారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడిన వీరిద్దరూ మార్గంలోనే మరణించారు. ఈ ఘటనతో వారి స్వగ్రామం మండవల్లి మండలం చావలిపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామలక్ష్మికి ఆరోగ్యం సరిగా లేకపోవటంతో విజయవాడ ఆస్పత్రికి భార్యాభర్తలు ఇద్దరూ వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మృత్యువు కబళించిందని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 

లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కొంప ముంచింది

ముదినేపల్లి : మద్యం మత్తులో లారీని వేగంగా నడిపిన డ్రైవర్ నిర్లక్ష్యమే ఆరుగురి మృతికి కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ముదినేపల్లి మండలం పెదపాలపర్రు మలుపు వద్ద ఆదివారం ఆటోను లారీ ఢీకొన్న ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఆటో గుడివాడ నుంచి ఏడుగురు ప్రయాణికులతో ముదినేపల్లి వైపు వస్తోంది.  



పెదపాలపర్రు మలుపు వద్ద ఆటో నిదానంగా వెళుతుండగా ఎదురుగా లారీ మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటో రోడ్డు మార్జిన్లో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని నిలిచిపోయింది. స్తంభానికి లారీకి మధ్య ఆటో ఇరుక్కుపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. స్తంభం అడ్డుపడకుంటే లారీ ఢీకొన్న వేగానికి ఆటో పక్కనే ఉన్న కాల్వలో పడి కొంతమందైనా ప్రాణాలతో బయటపడేవారని ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు పేర్కొంటున్నారు.

 

విశ్రాంతి లేకే...

లారీ డ్రైవర్ బోయిన వెంకయ్య నాలుగు రోజుల క్రితం జగ్గయ్యపేట సమీపంలోని ఫ్యాక్టరీ నుంచి సిమెంటు లోడుతో తూర్పుగోదావరి జిల్లా మండపేట వెళ్లాడు. సిమెంట్ దిగుమతి చేసిన వెంటనే రాజమండ్రి సమీపంలోని క్వారీ నుంచి నాము లోడుతో శనివారం రాత్రి బయలుదేరి జిల్లాలోని మండవల్లి మండలం పెరికేగూడెం సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం దిగుమతి చేశాడు. ఇక్కడ నుంచి జగ్గయ్యపేట వెళుతూ విశ్రాంతి కోసం ముదినేపల్లిలో కొద్దిసేపు లారీని నిలిపి మద్యం సేవించినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగింది. కేవలం విశ్రాంతి లేకే సంఘటన జరిగిందని డ్రైవర్ మాటల్లో వ్యక్తమైంది.

 

ముందుకు రాని చేతులు...


ప్రమాదం చీకటిపడే సమయంలో జరిగినప్పటికీ మృతదేహాలను ఆస్పత్రికి తరలించడంలో జాప్యం జరిగింది. చీకట్లో మృతదేహాలను గుర్తించడం, చిరునామాలు సేకరించడం పోలీసులకు సవాలుగా మారింది. మృతదేహాలను తరలించేందుకు ప్రయత్నించగా ఆటో వాలాలు ముందుకు రాలేదు. ఘటనాస్థలిలో వందలాది మంది ప్రేక్షకుల్లా చూశారే తప్ప సాయం చేసేందుకు అడుగు వేయలేదు. చివరికి ఓ ట్రక్ ఆటోవాలా ముందుకు రాగా, ఎస్సై వి.సతీష్ మృతదేహాలను అందులో చేర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఓ కానిస్టేబుల్ ఆయనకు సహకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top