దుకాణంపైకి దూసుకొచ్చిన మృత్యువు

దుకాణంపైకి దూసుకొచ్చిన మృత్యువు


అతి వేగంతో వస్తూ    అదుపుతప్పిన లారీ

జాతీయ రహదారిపై   ఘోర ప్రమాదం

టీ కొట్టు నిర్వహిస్తున్న మహిళ దుర్మరణం

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

 


పార్వతీపురం (ప్రత్తిపాడు)

లారీ రూపంలో మృత్యువు దుకాణంపైకి దూసుకురావడంతో ఓ మహిళ దుర్మరణం పాలైంది. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ విషాద ఘటన ప్రత్తిపాడు మండలం పార్వతీపురంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. పార్వతీపురం గ్రామానికి చెందిన కామినేని అనూరాధ (25), దగ్గు లీలావతి (36)లు 16వ నంబరు జాతీయ రహదారిపై బడ్డీ కొట్లు పెట్టుకుని టీ దుకాణాలు నిర్వహిస్తుంటారు. శుక్రవారం ఉదయం కొట్టు వద్ద వ్యాపారం సాగిస్తున్నారు. 7 గంటల సమయంలో పేపర్‌లోడుతో గుంటూరు నుంచి మద్రాసుకు మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ లారీ అదుపుతప్పి అమాంతం టీ దుకాణంపైకి దూసుకొచ్చింది. దుకాణం చెల్లాచెదురైంది. ఈ ప్రమాదంలో అనూరాధ అక్కడికక్కడే మృతి చెందింది.



ఆమె మృతదేహం రహదారికి ఆనుకుని ఉన్న ఫెన్సింగ్ వైపునున్న సైడుకాలువలో పడిపోయింది. ఆ సమయంలో అనురాధ దుకాణం వద్ద నిలబడిన లీలావతితో పాటు అక్కడ నిలబడి ఉన్న తుమ్మలపాలెం గ్రామానికి చెందిన సత్రపు నాగేశ్వరరావు (37)కు కూడా తీవ్రంగా గాయపడ్డారు. లీలావతిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, నాగేశ్వరరావును దగ్గరలోని కేఎంసీహెచ్‌కు తరలించారు. ప్రత్తిపాడు ఎస్‌ఐ సీహెచ్ ప్రతాప్‌కుమార్ సిబ్బందితో వచ్చి, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు.



అండగా నిలిచి.. అనాథలుగా విడిచి..



అనురాధ భర్త నరసయ్య రెండేళ్లుగా అనారోగ్యంతో మంచం పట్టాడు. వీరికి ఇద్దరు పిల్లలు వెంకటస్వప్న (6), శ్రీనివాస్ (3) ఉన్నారు. వయసు మీదపడిన ఆమె తల్లి నరసమ్మ కూడా వీరితోనే ఉంటోంది. దీంతో కుటుంబ భారమంతా అనూరాధపై పడింది. కుటుంబ పోషణకు జాతీయ రహదారి పక్కనే టీ దుకాణం నిర్వహిస్తోంది. లారీ ఢీకొట్టడంతో ఆమె రహదారి పక్కన ఫెన్సింగ్‌లో ఇరుక్కుపోయింది. మృతదేహాన్ని అతి కష్టంమీద స్థానికులు బయటకు తీశారు.



ముఖం పూర్తిగా చిధ్రమవ్వడంతో గగుర్పాటుకు గురయ్యారు. విగత జీవిగా మారిన తల్లిని చూసి లోకజ్ఞానం తెలియని పసివారు అమాయకం చూస్తుండటం స్థానికులను కలచివేసింది. జాతీయ రహదారిపై వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వాహనాలు రయ్య్ ్రమంటూ దూసుకుపోతుంటాయి. ఏమాత్రం పొరబాటు జరిగినా నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. ఈ విషయం పోలీసులకు, హైవే అథారిటీ అధికారులకు తెలిసి కూడా బడ్డీ కొట్ల ఏర్పాటుకు అనుమతించడం విమర్శలకు దారితీస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top