విష్ణు మాయ!

విష్ణు మాయ! - Sakshi


సాక్షి, కర్నూలు : ఇసుక ప్రస్తుతం బంగారాన్ని తలపింపజేస్తోంది. జిల్లాలో అక్రమార్కులు ఇసుక నిల్వలపై కన్నేశారు. అధికార బలంతో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. దాదాపు ఐదు నెలలుగా యథేచ్ఛగా ఈ తంతు కొనసాగింది. ఈ సమయంలో అధికారులు పట్టుకున్నది ఇసుమంత.. కానీ, అక్రమ మార్గంలో తరలిపోయింది మాత్రం కొండంత! ఇదీ జిల్లాలో పరిస్థితి.



అక్రమాలను నియంత్రించాల్సిన ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వల్లే తుంగభద్రలో ఇసుక మాయమై, రాళ్లురప్పలు కన్పిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఆ నదీ సమీప ప్రాంతాల్లో నీటి కష్టాలు తలెత్తుతాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రమేయంతోనే ప్రతి నెలా రూ. కోట్ల విలువైన ఇసుక తరలిపోతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.



 ‘మెట్రో' ముసుగులో..

 గత ఏడాదిగా జిల్లాలో ఎక్కడా ఇసుక తవ్వకాలకు అధికారికంగా అనుమతి లేదు. పర్యావరణ అనుమతి అంతకంటే లేదు. అయితే హైదరాబాద్‌లో జరుగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన ఇసుకను తరలించేందుకు అప్పటి కిరణ్ సర్కారు శ్రీలక్ష్మి, విష్ణు కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ పేరు మీద దేవమాడ, పూడూరు, పడిదెంపాడు గ్రామాల సమీపంలో ఉండే రీచ్‌ల నుంచి తవ్వకాలకు అనుమతులిచ్చింది.



అది కూడా క్యూబిక్ మీటర్‌కు కేవలం రూ. 40 చెల్లించేలా మొత్తం మూడు లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుకోవడానికి ఆదేశాలు ఇచ్చింది. ఇంత తక్కువ ధరకు భారీ స్థాయిలో ఇసుక తవ్వకానికి అనుమతి రావడం.. బహిరంగ మార్కెట్‌లో ఇసుక ధర  అధికంగా ఉండడంతో ఇసుక మాఫియా రంగంలోకి  దిగింది. ఈ అనుమతి ముసుగులో కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవడానికి ఇసుక మాఫియా పావులు కదిపింది. ఆ కంపెనీ ముసుగులో అక్రమ ఇసుక దందాకు తెరతీసింది.



అయితే ఇసుక తవ్వకానికి అప్పటి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అనుమతి ఇవ్వలేదు.  చివరకు తెలుగుదేశం సర్కారు రావడంతో జిల్లాలో కీలక నేతతో తీవ్ర ఒత్తిళ్లు చేయించింది. దీంతో కలెక్టర్ పంచలింగాలలో ప్రభుత్వం సీజ్ చేసిన ఇసుక డంప్ నుంచి హైదరాాబాద్‌లో జరుగుతున్న మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం అవసరమైన ఇసుకను తరలించుకునేందుకు తాత్కాలికంగా అనుమతులు ఇచ్చారు.



దీన్ని సాకుగా చూపి మునుగాలపాడు ప్రాంతంలో ఇసుక తవ్వి అక్రమంగా పంచలింగాలలో డంప్ చేసిన ఇసుకను హైదరాబాద్‌కు తరలించి రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కాగా, శ్రీలక్ష్మి, విష్ణు కన్‌స్ట్రక్షన్స్ కంపెనీకి ఇసుక తవ్వకాలకు సంబంధించి రాయల్టీ ఇచ్చే బాధ్యతను నీటి పారుదల శాఖ అధికారులకు అప్పగించడం అక్రమార్కులకు వరమైంది.



 ఇక్కడే అక్రమాలకు నాంది..!

 వాస్తవానికి ఇసుక రీచ్‌లకు అనుమతులు మైనింగ్‌శాఖ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఈ బాధ్యతను నీటిపారుదల శాఖకు అప్పగించడంతో ఇసుక మాఫియా అక్రమాలకు తెరలేపింది. అయితే తొలుత ఈ అనుమతులపై కొందరు హైకోర్టులో కేసు వేసి తవ్వకాలపై స్టే తెచ్చారు. ఇది ఇసుకాసురులకు ఒక రకంగా మేలు చేసిందనే చెప్పాలి.



అధికారికంగా ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడినట్టుగా నమ్మబలికిన నీటిపారుదల శాఖ అధికారులు ఆ తరువాత ఇసుక మాఫియాతో చేతులు కలిపి యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణాకు రాయల్టీలు ఇచ్చి సహకరించారన్న ఆరోపణులున్నాయి. ఈ అక్రమాలకు సహకరించడంతో నీటి పారుదలశాఖ అధికారులకు భారీ మొత్తంలో మామూళ్ల ముట్టాయన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ అండదండలు పుష్కలంగా ఉండడంతో ఇసుక మాఫియా చెలరేగిపోయి.. ప్రతి రోజూ వంద లారీల్లో ఇసుకను సరిహద్దు రాష్ట్ర రాజధానికి తరలించి లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంది.



 హడావుడిగా చర్యలు..

 బహిరంగంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా.. అక్రమంగా లారీల కొద్ది ఇసుక తరలిపోతున్నా చేష్టలుడిగి చూసినా అధికారయంత్రాంగం ఇప్పుడు హడావుడిగా చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పటికే జరగాాల్సిన నష్టం భారీగా జరిగిపోయింది. ఇసుక మాఫియా లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను తరలించి కోట్ల రూపాయలను తమ జేబుల్లో నింపుకుంది.



ఇంత జరుగుతున్నా ఇన్నాళ్లు ఉన్నతాధికారులు కిమ్మనకుండా ఉండడానికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా ఇరిగేషన్ అధికారులు రాయల్టీ ఎలా ఇస్తున్నారని స్వయంగా కలెక్టర్ ప్రశ్నించినా అధికారుల నుంచి సరైన సమాధానం ఇవ్వలేదు. అధికార పార్టీ నేతలతో మిలాఖత్ కావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికైనా అధికారులు మేల్కొని అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపితే ఇసుక ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top