లాటరీ పేరిట లూటీ

లాటరీ పేరిట లూటీ - Sakshi


చిత్తు కాగితాలే టిక్కెట్లు!

సెల్‌ఫోన్లు, నెట్ ద్వారా దందా

చితికిపోతున్న కుటుంబాలు

పట్టించుకోని పోలీసులు

నరసరావుపేట టౌన్: రాష్ట్రంలో లాటరీల నిర్వహణపై నిషేధం ఉన్నప్పటికీ పట్టణంలో కొందరు అక్రమార్కులు ఆ దందాను యథేచ్ఛగా నడిపిస్తున్నారు. పట్టణంలోని శివుని బొమ్మ సెంటర్ కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతోంది. ఈ విషయం తెలిసినా పోలీసులు పట్టించుకోవటం లేదు. ఫలితంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.ఇదీ జరుగుతోంది.. బోడోల్యాండ్ లాటరీ పేరిట పట్టణంలో కొందరు టిక్కెట్లు విక్రరుుస్తున్నారు. చిత్తు తెల్లకాగితాలపై నంబర్లు రాసి వాటినే టిక్కెట్లుగా ఇస్తున్నారు. దీనిపై తేదీ, ఏజెంట్ సంతకం మాత్రమే ఉంటాయి. ప్రతి రోజూ సాయంత్రం 4.30 గంటలకు సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్‌లో ఫలితాలు ప్రకటిస్తారు. ఇందులో చాలావరకు మోసమే ఉంటుంది.

   

కొంతమంది హోల్‌సేల్ ఏజెంట్లు నరసరావుపేట పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని దందా నడుపుతున్నారు. శివుని బొమ్మ సెంటర్ ప్రాంతంలోని ఓ బహుళ అంతస్తుల భవనం, పల్నాడు బస్టాండ్ సెంటర్‌లోని ఓ బేకరీ, గీతామందిర్ రోడ్డులోని ఓ టీ స్టాల్, ఫ్లైఓవర్ కింది భాగం, మార్కెట్ సెంటర్, కుమ్మరి బజారు ప్రాంతాల్లో సుమారు 20 మంది ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. వీరి నుంచి దాదాపు 35 మంది ఏజెంట్లు టికెట్లు కొనుగోలు చేసి ఆశావహులకు అమ్ముతున్నారు. ఒకవేళ ఎవరికైనా లాటరీ తగిలితే వచ్చిన నగదులో కొంతశాతం ఏజెంట్లు, హోల్‌సేల్ వ్యాపారులకు ముట్టజెప్పాలి.

 

గుంటూరుకు చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారి అధికారులకు ఆమ్యామ్యాలు ముట్టజెప్పి వ్యాపారానికి అడ్డు లేకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. అందుకే పట్టణంలో లాటరీ టికెట్ల విక్రయాలు జోరుగా జరుగుతున్నాయని తెలిసినా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

 

రూ.20 నుంచి రూ.800 వరకు టికెట్ల ధరలు.. బొడోల్యాండ్ లాటరీ పేరిట విక్రయిస్తున్న టికెట్ల ధరలు 20 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఉన్నారుు. మార్కెట్‌లో ప్రస్తుతం రూ.20 కూయల్, రూ.30 రోశ, రూ.50 తంగమ్, రూ.100 నల్లనేరమ్, రూ.200 కుమరన్, రూ.250 విష్ణు టిక్కెట్లు లభిస్తున్నాయి. అప్పుడప్పుడు రూ.500, రూ.800 రూపాయల టికెట్లు విక్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 35 లక్షల రూపాయల మేర వ్యాపారం జరుగుతుండగా ఒక్క నరసరావుపేటలోనే రూ.10 లక్షల మేర విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం.

 

కొందరు ఏజెంట్లు తప్పుడు నంబర్లతో ఆశావహులను మోసం చేస్తున్నారు. వాస్తవానికి లాటరీ తగిలిన నంబర్ల గురించి చెప్పకుండా వేరే నంబర్లకు వచ్చినట్టు స్లిప్‌లపై రాసిచ్చి మోసగిస్తున్నట్టు సమాచారం. ఎన్నో పేద కుటుంబాలను రోడ్డున పడేస్తున్న ఈ దందాపై రూరల్ ఎస్పీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కఠినచర్యలు తీసుకుంటాం.. పట్టణంలో నిషేధిత లాటరీ టిక్కెట్ల విక్రయాలపై ఓఎస్‌డీ, ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటయ్యను వివరణ కోరగా టికెట్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. డివిజన్‌లో ఎక్కడా లాటరీ టిక్కెట్ల విక్రయాలు జరగకుండా చూస్తామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top