తాళాలేయాల్సిన స్కూళ్లపై తర్జనభర్జన

తాళాలేయాల్సిన స్కూళ్లపై తర్జనభర్జన - Sakshi

  •      567 ప్రాథమిక పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు

  •      130 ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి

  •      పది మంది కంటే తక్కువ ఉన్న స్కూళ్లు 195

  •      వివరాలు సిద్ధం చేసిన జిల్లా విద్యాశాఖ

  • సాక్షి, విశాఖపట్నం : ప్రాథమిక విద్య పడకెక్కుతోంది. ఓ వైపు కొత్తగా పాఠశాలల స్థాయిని పెంచుతున్నట్టు అధికారులు హోరెత్తిస్తున్నారు. మరోవైపు విద్యార్థుల సంఖ్య తగ్గి చాలా స్కూళ్లకు తాళాలు వేయాలనుకుంటున్నారు. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత(యూపీ) పాఠశాలల వివరాల్ని పరిశీలిస్తే 697 పాఠశాలల్లో 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్నట్టు లెక్క తేలింది. వీటిలో ఎన్ని స్కూళ్లు మూసివేయాలన్నదానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

     

    తాజా జాబితా సిద్ధం

     

    2014 జూలై 30 నాటికి జిల్లాలో 567 ప్రాథమిక పాఠశాలల్లో, సుమారు 130 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 20 మంది కన్నా తక్కువగా విద్యార్థులున్నట్టు లెక్క తేల్చారు. వీటిలో 138 ప్రాథమిక పాఠశాలలు, 57 యూపీ స్కూళ్లలో 10 మంది కంటే తక్కువ విద్యార్థులున్నారు.



    విద్యా హక్కు చట్టం నిబంధనల మేరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత సెక్షన్లకు వేర్వేరుగా కనీసం 20 మంది విద్యార్థులుండాలి. లేకుంటే అలాంటి ప్రాథమిక పాఠశాలను సమీపంలోని యూపీ స్కూల్లోనో, తక్కువ విద్యార్థులున్న యూపీ స్కూళ్లను సమీపంలోని హైస్కూల్లోనో విలీనం చేయాలి. ఉపాధ్యాయుల్ని మండలం యూనిట్‌గా సర్దుబాటు చేయాలి. ఇదే ప్రాతిపదికన ఇప్పటికే యూపీ స్కూళ్ల జాబితా సిద్ధం చేశారు. తాజాగా వీటికి ప్రాథమిక పాఠశాలల వివరాల్ని కూడా జత చేశారు.

     

    తీరని సందిగ్థం

     

    ఇప్పటికీ రేషనలైజేషన్‌పై ఎటూ తేల్చలేకపోతున్నారు. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న యూపీ స్కూళ్లను సమీప హైస్కూళ్లలో విలీనం చేయాలన్న ఆదేశాలతో మరో 400 మంది ఉపాధ్యాయులు మిగిలిపోతున్నారు. ఇప్పుడు 567 ప్రాథమిక పాఠశాలలు కూడా తక్కువ విద్యార్థులున్న జాబితాలో చేరాయి. ఇందులో ఉన్న ఏకోపాధ్యాయుల్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. వీరిని కూడా కలిపితే ఏకంగా 1650 మంది ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి. వీరందరినీ ఏం చేయాలన్నదానిపై పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు చెప్తున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top