ఊరూరా నరకాసుర వధ..

ఊరూరా నరకాసుర వధ.. - Sakshi


సాక్షి యంత్రాంగం: రైతన్న ఆగ్రహించాడు. రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు...కమిటీలని కాలయాపన చేస్తూ... రోజుకో మాట మారుస్తుండటంపై అన్నదాత అగ్రహోదగ్రుడయ్యాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ‘నరకాసుర వధ’ నిర్వహించారు.

 

ఎక్కడికక్కడ చంద్రబాబు దిష్టిబొమ్మలు దహనం చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, బెదిరింపుల నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు వైఎస్సార్ సీపీ శ్రేణుల్ని, రైతుల్ని అడ్డుకున్నారు. కొన్ని చోట్ల ఆందోళన చేస్తున్న వారిని టీడీపీ శ్రేణులు అడ్డుకుని వీరంగం సృష్టించినా పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. ఎందరు ఎన్ని రకాలుగా అడ్డుకున్నా రైతులు మాత్రం భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.  

 

నిరసనల హోరు...

ఉత్తరాంధ్రలో రైతులు కదం తొక్కారు.  శ్రీకాకుళం జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రం లోనూ ఈ ఆందోళనలు సాగాయి. శ్రీకాకుళం టౌన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పాలకొండ, పాతపట్నం, రాజాంలో ఈ ఆందోళనలకు ఎమ్మెల్యేలు కళావతి, కలమట వెంకటరమణ, కంబాల జోగులు నాయకత్వం వహించారు. విజయనగరం జిల్లా సాలూరులో జాతీయ రహదారిపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి బాబు దిష్టిబొమ్మ దహనం చేశారు.

 

కురుపాంలో ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి నేతృత్వంలో రైతులు ఆందోళనకు దిగారు. విశాఖ జిల్లా అనకాపల్లి, చోడవరం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో చంద్రబాబు దిష్టిబొమ్మల్ని ఊరేగించి, దహనం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమాశంకర్‌గణేష్, మాడుగుల ఎమ్మెల్యే  ముత్యాలనాయుడు, చింతపల్లి ఎమ్మెల్యే ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యే బాబ్జీ వీటికి నేతృత్వం వహించారు. తూ.గో.జిల్లా ఆత్రేయపురంలో వందల మంది రైతులు పాల్గొన్న ధర్నాలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.



కోటనందూరు సెంటర్లో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అడ్డతీగల సెంటర్లో రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, గొల్లప్రోలులో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దహనం చేశారు. గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు మినహా మిగిలిన 14 అసెంబ్లీ స్థానాల్లోనూ, గుంటూరు నగరంలోనూ రైతులు ఆందోళనబాట పట్టారు.

 

కృష్ణాజిల్లా పామర్రులో... అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డెప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఉప్పులేటి కల్పన నేతత్వంలో ధర్నా నిర్వహించగా టీడీపీ అడ్డుకుంది. విజయవాడ శివారు కండ్రికలో రైతులు, డ్వాక్రా మహిళలు భారీగా నిరసన తెలపగా దీనికి వైఎస్సార్ పార్టీ నేత గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. ప్రకాశం జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు, టీపీ గూడూరు, ముత్తుకూరు మండలాల్లో తొలిరోజు ‘నరకాసుర వధ’ నిర్వహించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా గురువారం తీవ్రస్థాయిలో ‘నరకాసుర వధ’ నిర్వహించారు.  కదిరి అంబేద్కర్ కూడలిలో రాస్తారోకో చేస్తున్న ఎమ్మెల్యే చాంద్ బాషాతోపాటు వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పీవీ సిద్ధారెడ్డి తదితరుల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

 

వైఎస్సార్ కడప జిల్లాలో ఎమ్మెల్యే అంజద్‌బాషా సారథ్యంలో ఏడురోడ్ల వద్ద ఆందోళనకు దిగిన రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేటలో వైఎస్సార్ సీపీ నేత ఆకేపాటి అనిల్‌కుమార్‌రెడ్డికి, పోలీసులకు తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. పులివెందుల నియోజకవర్గం లింగాలలోని పెద్దకూడాలలో ఎంపీపీ, మండల కన్వీనర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు.

 

బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ఆధ్వర్యంలో నరకాసుర వధ నిర్వహించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనను, టీడీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలో నాలుగుకాళ్ల మంటపం వద్ద గంటపాటు ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని రైతులు, మహిళలు ధర్నాలు నిర్వహించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top