రుణం చెల్లించిన వారికి అన్యాయమా...!


 సాక్షి ప్రతినిధి: రుణమాఫీపై ప్రభుత్వం రైతులను మోసపుచ్చేవిధంగా వ్యవహరిస్తోందని ప్రకాశం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ ప్రభుత్వాన్ని నిలదీశారు. సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయ నిమిత్తం తీసుకున్న పంట, వ్యవసాయ, బంగారు రుణాల మాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, జిల్లా వారీగా ఎంత చెల్లించాలి? డ్వాక్రా రుణాల మాఫీకి ఎంత ఖర్చు అవుతుంది, జిల్లాల వారీగా ఎంత? రాష్ట్రంలోని అన్ని మండలాల్లో రుణాలు రీషెడ్యూల్ చేస్తారా? దుర్భిక్షపీడిత ప్రాంతాల్లోనే రుణాల రీషెడ్యూల్ చేస్తారా? దీని వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా అని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి కుమార్, ఆదిమూలపు సురేష్ అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఎమ్మెల్యేలు   నిలదీశారు.



ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ అంశంపై మంత్రి ఇచ్చిన సమాధానంపై అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ 2013 డిసెంబర్ 31 ముందు రుణాలు పొంది, 2014 మార్చి 31 వరకూ చెల్లించని వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తోందని, 2014 జనవరి నుంచి మార్చి వరకు చెల్లించిన వారికి ఈ పథకం వర్తించడం లేదన్నారు.  ఇటీవల కొన్ని పత్రికల్లో మంచి రైతుకు మాఫీ వర్తించదు అంటూ వచ్చిన కథనాలను ఆయన సభ దృష్టికి తీసుకువెళ్లారు. బుక్ అడ్జస్ట్‌మెంట్ విషయంలో కూడా ఇదే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.



ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో పలువేదికలపై  సకాలంలో రుణం చెల్లిం చిన వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని  చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు అశ్వత్థామ అతః కుంజరహా అన్నట్లు నిజాయితీ గల పేద రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది.. షరతులతో అన్నట్లు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సహకార వ్యవస్థలో 80, 90 వేల మంది రైతులు రుణాలు తీసుకున్నారని, వారంతా జనవరి నుంచి మార్చి వరకూ రుణాలు చెల్లించారని చెప్పారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 300 కోట్లు చెల్లిస్తే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా 550 కోట్ల రూపాయలు చెల్లించారన్నారు.



రాష్ట్రం మొత్తంమీద 2500 కోట్ల రూపాయలు రైతులు రుణాలు చెల్లించారని, వారంతా 174 జీవో కారణంగా నష్టపోయారన్నారు. అద్దంకి, పరుచూరు నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువ నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కుటుంబానికి లక్షన్నర రుపాయలు రుణమాఫీ చెల్లిస్తామని ప్రకటించినా ఇప్పటి వరకూ ఒక్క రైతుకు కూడా రుణ మాఫీ చెల్లించలేదని, దీని కారణంగా రైతులు వడ్డీ రాయితీ కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలపరిమితి దాటిపోతే 10.5 శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్తితి వస్తుందన్నారు.



ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారని, ఇదే పద్దతిలో చేస్తే ఏడెనిమిది సంవత్సరాలకు గాని రుణాలు మొత్తం మాఫీ కావని చెప్పారు. రీషెడ్యూల్ కూడా అన్ని మండలాలకు వర్తింప చేయాలని రవి డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప కోనసీమ రైతులతో కలిసి వ్యవసాయ మంత్రిని రుణమాఫీపై చర్చించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అనంతరం మాట్లాడిన సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రభుత్వ వైఖరిపై విరుచుకుపడ్డారు.



 ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ఉద్దేశ్యం తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన విమర్శించారు. ఆ ఉద్దేశ్యం ఉంటే కోటయ్య కమిటీని ఎందుకు వేస్తారని ఆయన నిలదీశారు. వ్యవసాయ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించడమే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని నిరూపిస్తోందని ఆయన అన్నారు. రుణాలను రీషెడ్యూల్ చేసి వాటిని కూడా రుణమాఫీగా ఎలా చూపిస్తారని ఆయన నిలదీశారు. రుణమాఫీ చేస్తామని ఒక పక్కన ప్రకటిస్తూనే అర్హత ఉన్న రైతులకు కూడా బ్యాంకులు ఏ విధంగా నోటీసులు పంపిస్తాయని ఆయన ప్రశ్నించారు.



చంద్రబాబునాయుడు రైతులను మోసపుచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని, ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయిన తర్వాత  కూడా ఇప్పటి వరకూ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ వర్తింప చేయకపోవడం వల్ల కొత్త రుణాలు తీసుకునే అవకాశం లేక రైతాంగం పడుతున్న ఇబ్బందులను, బ్యాంకులు ఇస్తున్న నోటీసులను ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై అనుబంధ ప్రశ్నలను వేసేందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో సభలో వివాదం నెలకొంది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top