జాబితాల్లో పేర్లు మాఫీ


 ఒంగోలు: ఓట్లకోసం రుణమాఫీ అన్నారు. అధికారం దక్కాక కోతలు పెడుతూ రైతులకు వాతలేస్తున్నారు. అరకొర రుణమాఫీ అయినా ఎప్పుడు అమలవుతుందా...తిరిగి తమకు ఎప్పుడు రుణాలు అందుతాయా అంటూ గంపెడాశతో ఎదురుచూస్తున్న రైతాంగానికి షాక్ తగిలింది. ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్, రేషన్ కార్డులన్నీ సమర్పించినా జాబితాలో పేర్లు లేవు.



అంతే కాదు...ఇద్దరి పేర్లకు ఒకే ఆధార్ నంబర్‌తో రెండు రుణాలు మాఫీకి అర్హత పొందాయని ప్రకటించడం చూస్తుంటే ఆధార్ పారదర్శకతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ప్రతి బ్యాంకులోను రుణగ్రహీతల జాబితాలో ఇదేవిధంగా కోత పడడంతో గందరగోళం నెలకొంది.



 మంగళవారం ఒంగోలు గాంధీరోడ్డులోని కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ వద్ద రుణమాఫీకి సంబంధించిన రైతుల జాబితాను గోడలకు అంటించారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది రైతులు బ్యాంకు వద్దకు పరిగెత్తారు. ఆ జాబితాల్లో పేర్లు లేకపోవడంతో మెజార్టీ రైతులు తీవ్ర నిరాశ చెందారు. ఒంగోలు యూనియన్ బ్యాంకులో మొత్తం 940 వరకు పేర్లను ప్రకటించారు. వాటిలో కేవలం ఆధార్ అంశాన్ని మాత్రమే ప్రకటించారు తప్ప రేషన్ కార్డు ప్రస్తావనే లేదు. వాటిలో 832 పేర్లను అర్హులుగా ప్రకటిస్తున్నట్లుగా ఉంది. 108 పేర్లను మాత్రం ‘ఆధార్ ఇన్ వాలీడ్’ అంటూ ప్రకటించారు.



అయితే తాము కార్డులిచ్చినా పేర్లు రాకపోవమేమిటని బ్యాంకు అధికారులను రైతులు నిలదీసినా ఫలితం లేకుండా పోయింది.  తాను రుణమాఫీకి అన్ని విధాలా అర్హుడినని, అన్ని ప్రతులు అందించినా తన పేరు లేకపోవడం ఏమిటంటూ పలువురు రైతులు కళ్లనీళ్లపర్యంతమయ్యారు.  తాము అన్ని ఖాతాలను  ఎస్‌ఆర్‌డీహెచ్‌కు పంపామని, కానీ ఎందుకు మిగిలిన పేర్లు రాలేదో తెలియదంటూ బ్యాంకు మేనేజర్ సైతం చెబుతుండడం గమనార్హం.



మరోమారు తమకు ప్రతులు అందజేస్తే స్టేట్ రెసిడెంట్ హబ్‌లో ఫీడ్ చేస్తామని చెప్పి తప్పించుకున్నారు. కొంతమంది రైతులు ఆ క్షణంలోనే సంబంధిత ప్రతులను అందించినా ఎస్‌ఆర్‌డీహెచ్ వెబ్‌సైట్ మాత్రం తాజా వివరాలను స్వీకరించడంలేదని సమాచారం.  పర్చూరులోని ఒక బ్యాంకులో అయితే దాదాపు 4500 రుణ ఖాతాలను ఫీడ్ చేస్తే అందులో కేవలం 1200 మాత్రమే రుణమాఫీకి అర్హత సాధించినట్లు విశ్వసనీయ సమాచారం.  



 ఆధార్‌పైనా అనుమానాలే...

 ఆధార్  నెంబర్ ద్వారా అన్నింటినీ ఫ్రక్షాళన చేస్తాం. రుణమాఫీకి అర్హత పొందిన ప్రతి ఒక్కరికీ తప్పకుండా రుణాన్ని రద్దుచేస్తాం అంటూ ప్రకటించిన ప్రభుత్వం స్థానిక యూనియన్ బ్యాంకు అధికారులు ప్రకటించిన జాబితాను చూస్తే ఆధార్‌పైనా సందేహాలు తలెత్తుతున్నాయి. జాగర్లమూడి సామ్రాజ్యలక్ష్మి అనే మహిళ రుణఖాతా నంబర్ 330705030000815 అని, ఆమె ఆధార్ నంబర్ 865941715450 అంటూ ఆధార్ వాలిడ్ అంటూ ప్రకటించారు.



అయితే ఇదే ఆధార్ నంబర్‌తో ఆరు రుణ ఖాతాలను కలిగిన జాగర్లమూడి శంకరయ్య పేరుమీద కూడా ఉండడం గమనార్హం. అతని ఖాతాలు 330705030000556, 330706040027962, 3307065 40021207 (వీటికి ఫిమేల్ అని పడింది), 330706540021643, 330706540021720, 3307065 40022104 (మేల్) అంటూ ఇవన్నీ కూడా వాలీడ్ అని ప్రకటించారు. ఒకే  ఆధార్ నెంబర్ రెండు పేర్లకు ఎలా వాలిడ్ అయిందని బ్యాంకర్లను ప్రశ్నిస్తే సమాధానం లేదు.



 అన్నీ ఇచ్చా ...ఎందుకు తన పేరులేదో తెలియడంలేదు: మంగమూరు వాసి నల్లూరి శీతారామయ్య

 రుణమాఫీ కోసం అన్ని పత్రాలు ఇచ్చా. నా పేరు లేదు. బ్యాంకు మేనేజర్‌ను అడిగితే ఎందుకు రాలేదో తెలియదంటున్నారు. నాకు రెండు ఖాతాలకు సంబంధించి రూ1.77లక్షలు తీసుకున్నాను. అధికారులే నాకు న్యాయం చేయాలి.



 ఏ విధంగా చూసినా అర్హుడ్నే: చుండూరి భాస్కర్, వెంకట్రాజుపాలెం

 రెండున్నర ఎకరాల పొలం ఉంది. బంగారం కుదువపెట్టి రూ.1.25 లక్షలు రుణం తీసుకున్నా.  రుణమాఫీ జాబితాలో నా పేరు లేదు. జన్మభూమి కమిటీకి వచ్చిన జాబితాలో కూడా నా పేరులేదు.  మేనేజర్‌ను అడిగితే మళ్లీ ప్రతులు ఇమ్మంటున్నారు. నాకు జరిగిన అన్యాయానికి ఎవర్ని కలవాలో కూడా అర్థం కావడంలేదు.

 

మాకు అన్యాయమే జరిగింది:  దాచర్ల లక్ష్మీనారాయణ

 మాకు ఏడున్నర ఎకరాల పొలం ఉంది. నా భార్య దాచర్ల విజయనిర్మల పేరుతో రూ.2.50 లక్షలు కామేపల్లి బ్యాంకులో తీసుకున్నాం. ఇప్పుడు రుణమాఫీ జాబితాలో మా పేరులేదని వచ్చింది. ఇదేమిటని అడిగితే బ్యాంకర్లు సమాధానం చెప్పలేకపోతున్నారు.  



 పరిశీలన నిమిత్తమే జాబితాలు వచ్చాయి: లీడ్ బ్యాంక్ మేనేజర్ నరశింహారావు

 ప్రస్తుతం బ్యాంకులకు వచ్చిన జాబితాలు కేవలం పరిశీలన నిమిత్తమే వచ్చాయి తప్ప అవి పబ్లిక్‌గా ప్రకటించేందుకు కాదు. బ్యాంకులు ఎందుకు ప్రకటించారో అర్థం కావడంలేదు. కొన్ని బ్యాంకులు ప్రకటించినట్లు తన దృష్టికి వచ్చింది. అయితే పెద్ద మొత్తంలో పేర్లు లేవని చెబుతున్నచోట వారు అసలు ఆ పేర్లు ఫీడ్ చేశారో లేదో కూడా ఒకసారి పరిశీలించుకోవడమే ఉత్తమం. రుణ మాఫీకి ఎన్ని ఖాతాలు అర్హత పొందాయనేది కూడా ఇప్పడే ఖరారు చేయలేం. త్వరలోనే అధికారికంగా చెబుతాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top