కాసులు కరువు

కాసులు కరువు - Sakshi


ప్రకటనలకే పరిమితమైన కరువుసాయం

జిల్లాలో తీవ్ర వర్షాభావం, అడుగంటిన భూగర్భ జలాలు

రోజురోజుకూ పెరుగుతున్న కరువు తీవ్రత

ఇన్‌పుట్ సబ్సిడీ సంగతీ పట్టించుకోలేదు  


 

చిత్తూరు: ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కరువు సాయం హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. జిల్లాలో కరువు ప్రభావం  రోజురోజుకూ పెరుగుతోంది. పడమటి మండలాల్లో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రెండు వేలకు పైగా గ్రామాల్లో తాగునీరు  దొరకడంలేదు. పశువులకు నీళ్లతో పాటు పశుగ్రాసం లేదు. ఎన్ని వందల కోట్లైనా వెచ్చించి జనానికి తాగునీరందిస్తామని, పశువులకు గ్రాసంతోపాటు నీటిని అందిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆర్భాటంగా ప్రకటించారు. ఇందుకోసం గ్రామాల్లో తాగునీటి తొట్టెలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అధికారులు సైతం నెల రోజులుగా ఇవే ప్రకటనలు ఇస్తున్నారుగానీ ప్రభుత్వం నిధులు కేటాయించలేదు.



జిల్లాలో 934 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సివుండగా, 600 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. పంటల సాగు సగానికి పైగా తగ్గింది. భూగర్భ జలా లు 1500 అడుగుల లోతుకు వెళ్లాయి. బోరు బావులు ఎండిపోయాయి. పడమటి మండలాలతోపాటు అన్ని నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరింది. వర్షాలులేక పోవడంతో ఈఏడాది జిల్లాలో ఖరీఫ్‌లో 2,15,358 హెక్టార్ల సాధారణ సాగువిస్తీర్ణం కాగా,1,86,573 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగయ్యాయి. రబీలోనూ  పంటలసాగు మరింతగా తగ్గింది. సాధారణ విస్తీర్ణం 59,885 హెక్టార్లు కాగా, 25,139 (42 శాతం) హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. 1.5 లక్షల హెక్టార్లలో సాగు చేసిన  వేరుశెనగపంటతో పాటు మిగిలిన పంటలు దెబ్బతిన్నాయి. రైతులు జిల్లా వ్యాప్తంగా 500 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. జిల్లాలో కరువు తాండవిస్తున్నా 42 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. వాటికి సాయం సంగతీ పట్టించుకోలేదు. ఖరీఫ్, రబీ సీజన్లలో నష్టపోయిన వేరుశెనగ పంటకు సంబంధించి  సుమారు * 200 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ కింద రైతులకు చెల్లించాలి. కానీ ఇప్పటికీ ప్రభుత్వం పరిహారం సంగతి పట్టించుకోలేదు. ఇటీవల జిల్లాలో  పర్యటించిన ముఖ్యమంత్రి కరువు సాయం ఊసే ఎత్తలేదు. ఇక జిల్లాలో ప్రధానంగా సాగయ్యే చెరకు పంటకు సంబంధించి రైతులకు  చిత్తూరు సహకార  చక్కెర కర్మాగారం * 12 కోట్లు  బకాయిలు చెల్లించలేదు.



ఇక చంద్రబాబు  ఎన్నికల హామీ  రుణమాఫీ ఆయన సొంత జిల్లాలోనూ సక్రమంగా అమలు జరగలేదు.అధికారం చేపట్టగానే బాబు  ఆ హామీని తుంగలో తొక్కి అన్నదాతలను  వంచించారు. జిల్లాలో 8,70,321 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో వ్యవసాయ రుణలను తీసుకోగా వారిలో 4,73,000 మంది రైతులు మాత్రమే రుణమాఫీకి అర్హులని ప్రభుత్వం తేల్చింది. అందులోనూ కొర్రీలు పెట్టి  1,47,000 మంది రైతులకే రుణమాఫీ అంటూ జాబితా విడుదల చేసింది. తీరా చూస్తే ఒక్కో రైతుకు * లక్షా 50 వేలో,50 వేలో గాక *3 వేలనుంచి 9 వేలవరకూ రుణం మాఫీ అయినట్లు బ్యాంకులకొచ్చిన జాబితాల్లో తేలింది. మొత్తంగా సగానికి సగం మంది రైతులకు కూడా రుణమాఫీ వర్తించలేదు. ఫలితంగా ఈ ఏడాది రైతులకు రుణాలు కూడా అందలేదు. పంటల బీమా ఊసేలేకుండా పోయింది. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇక పండ్లతోటల రైతులకు * 10 వేల చొప్పున సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా, అది ఆచరణ రూపం దాల్చలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top