ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు కల్పించండి


విజయవాడ : ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌ను పోస్టుగ్రాడ్యుయేషన్ విద్యార్థులు (జూడాలు) కోరారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులు వస్తే వైద్యం చేసేందుకు సరైన సౌకర్యాలు లేవని వివరించారు. ప్రభుత్వాస్పత్రిలో బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం జరుగుతుండగా  జూడాలు కాంత్రి, స్నిగ్ధ, మనోజ్, తనోజ్ తదితరులు మంత్రి వద్దకు వెళ్లి ఆస్పత్రిలోని సమస్యలను ఏకరువు పెట్టారు.



రోగి ప్రాణాపాయస్థితిలో వస్తే వైద్యం చేసేందుకు పరికరాలు లేవని, ఏడు వెంటిలేటర్లు ఉంటే ఒక్కటే పనిచేస్తోందని, అత్యవసర మందులు సైతం అందుబాటులో లేవని, సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో వైద్యులు లేరని, వైద్య కళాశాల, ఆస్పత్రి ప్రాంగణంలో డ్రెయినేజీ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని వివరించారు. స్పందించిన మంత్రి కామినేని ఈ విషయంలో తానేమీ మాట్లాడలేకపోతున్నానని, ఇన్ని సమస్యలు ఉంటే ఏమి చేస్తున్నారని బాధ్యులను ప్రశ్నించారు. వాటిని పరిష్కరించేందుకు రూ.10 కోట్లు అవసరమని ఏపీహెచ్‌ఎండీసీ ఇంజినీర్లు తెలపగా, తక్షణమే రూ.కోటి వెచ్చించి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు కూడా ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని  మంత్రికి తెలిపారు.



ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యు.సూర్యకుమారి, సివిల్‌సర్జన్ ఆర్‌ఎంవో డాక్టర్ సావిత్రమ్మ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె.సరసిజాక్షి, ఏపీహెచ్‌ఎండీసీ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ నాంచారయ్య, జిల్లాలోని క్లస్టర్ అధికారులు, వైద్య విధాన పరిషత్ అధికారులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top