వీడిన హత్యకేసు మిస్టరీ


ఐ.పోలవరం : గుత్తినదీవి ఏటిగట్టుపై గత నెల 2న జరిగిన సామర్లకోట మండలం కొప్పవరం గ్రామానికి చెందిన గుమ్మడి చంటి శేఖర్(అబ్రహం) (27) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ముమ్మిడివరం సీఐ కేటీటీవీ రమణారావు శనివారం పాతయింజరం పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. శేఖర్‌ను గత నెల 2న ఐ.పోలవరం మండలం గుత్తినదీవి ఏటిగట్టుపై మోటారు సైకిల్‌పై తీసుకు వచ్చి కత్తులతో పొడిచి చంపి పరారైన కేసులో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు.



శనివారం ఉదయం అన్నంపల్లి-కుడలేశ్వరం ఏటిగట్టుపై తనిఖీ చేస్తుండగా శేఖర్‌కు చెందిన ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అల్లవరం మండలానికి చెందిన పెనుమాల రాహుల్, పెనుమాల ప్రసాద్‌ను పట్టుకొని విచారించామని, వారు రౌడీషీటర్లుగా అల్లవరం పోలీస్‌స్టేషన్‌లో రికార్డు అయిందన్నారు. వారి నుంచి మోటార్ సైకిల్ రికవరీ చేశామన్నారు. గతనెల 2న ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిళ్లపై ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి గుత్తినదీవి ఏటిగట్టుపై కర్రలతో కొట్టి కత్తులతో నరికి చంపి పడేసి పోగా ఈ విషయం చూసిన గుత్తినదీవి లంకలపల్లి వెంకట సత్యనారాయణ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడరన్నారు.

 

 మృతుడు శేఖర్‌కు పెదనాన్న కుమార్తె దొనం రత్నకుమారితో స్థలం విషయంలో గొడవలు ఉన్నాయి. కుమారి వాటాలో ఉన్న 7 సెంట్ల భూమిలో శేఖర్ చర్చి నిర్మించి ప్రార్థనలు చేయడం కుమారికి ఇష్టం లేదు. దీంతో అతడిని అంతమొందించేందుకు నిర్ణయించుకుంది. తనకు పరిచయం ఉన్న పెనుమాల రాహల్‌కు సమస్య వివరించింది. తనపేరిట ఉన్న 1.5 ఎకరాల భూమిని సైతం కాజేసేందుకు శేఖర్ చూస్తున్నాడని, అతడిని చంపితే రూ. లక్ష ఇస్తానని రాహుల్‌కు చెప్పింది.



తన అనుచరులైన పెనుమాల ప్రసాద్, మానే నాగభూషణం, కాశి చంద్రశేఖర్, కాట్రు శ్రీను, లంకలపల్లి హేమంత్ సాయంతో హత్యకు రూపకల్పన చేశాడు. పాస్టర్ శేఖర్‌ను ప్రార్థనల కోసం రావాలని వారు కోరారు. మోటారు సైకిల్‌పై యానాం వచ్చిన శేఖర్‌ను అక్కడ నుంచి గుత్తినదీవి చేపల చెరువుల వద్దకు ప్రార్థనల కోసం తీసుకెళ్లి కర్రలతో కొట్టి, కత్తులతో పొడిచి చంపి, అతడి మోటారు సైకిల్‌పై వెళ్లిపోయారు. దర్యాప్తులో భాగంగారాహుల్, ప్రసాద్‌లను అరెస్టు చేశామని, మిగిలిన వారిని అరెస్టు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top