వీడిన హత్యకేసు మిస్టరీ


హుజూరాబాద్ టౌన్ : మండలంలోని సింగాపూర్ సమీపంలోని వరంగల్-కరీంనగర్ రాష్ట్ర రహదారి పక్కన ఆరు నెలల క్రితం ఓ వ్యక్తి వహత్యకు గురైన మిస్టరీ వీడింది. హుజూరాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు మృతుని చొక్కాపై ఉన్న లేబుల్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గురైంది ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దుర్గా జిల్లాలోని జవత్తరలా వుండలంలోని బాలోడ్ గ్రామానికి చెందిన బీరేంద్రఠాకూర్(22)గా గుర్తించారు. పోలీసులు మొదటగా అనుమానించిన ట్లుగానే మృతునిది హత్యేనని పోస్టుమార్టం నివేదికలొచ్చాయి. ఈ కోణంలో పోలీసులు మృతుని ఆధారాల సేకరించగా మృతుడు లారీ క్లీనర్‌గా పనిచేసేవాడని టైలర్ షాపు నిర్వాహకుడు ఇచ్చిన ఆధారాల ప్రకారం పోలీసులు తెలుసుకున్నారు.

 

 క్లీనర్‌ను హత్య చేసింది డ్రైవరే..

 ఛత్తీస్‌గఢ్ రాష్టం నుంచి వరంగల్‌కు లారీలో డ్రైవర్ చున్నీలాల్‌తో కలిసి బీరేంద్రఠాకూర్ లోడ్ తీసుకవచ్చారు. వరంగల్‌లో లోడ్ తీసుకుని రాత్రి తిరిగి ప్రయాణం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మార్గమధ్యలో ఓ చోట ఇద్దరు మద్యం తాగారు. ఈ క్రమంలో లారీని నడుపుతానని క్లీనర్ బీరేంద్రఠాకూర్ డ్రైవర్ చున్నీలాల్‌ను కోరాడు. ఈ విషయంలో ఇరువురి మద్య ఘర్షణ జరిగింది.

 

 ఈ క్రమంలో డ్రైవర్ చున్నీలాల్ ఇనుపరాడ్‌తో బీరేంద్ర తలపై కొట్టాగ తీవ్ర రక్త స్రావమైంది. గమనించిన డ్రైవర్ చున్నీలాల్ క్లీనర్ మృతి చెందినట్లు నిర్ధారణకు వచ్చాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు మండలంలోని సింగాపూర్ గ్రామ శివారులోని రాష్ట్ర రహదారి పక్కన లారీ నుంచి క్లీనర్ బీరేంద్రఠాకూర్ మృత దేహన్ని కిందకు తోసి వెళ్లాడు. కరీంనగర్ నగర శివారుకు చేరుకున్న తర్వాత లారీలో పడ్డ రక్తం మరకలను తుడిచి నీటితో కడుక్కుని ఛత్తీస్‌గఢ్ వెళ్లాడు. అక్కడ క్లినర్  బీరేంద్ర ఏడని లారీ యజమాని ప్రశ్నిస్తే మరో లారీపై వెళ్లాడని బదులిచ్చాడు.

 

 పోలీసుల అదుపులో నిందితుడు

 సింగాపూర్ గ్రామ శివారులో జరిగిన లారీ క్లీనర్  హత్య కేసును ఛేదించడానికి సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్సై జగదీశ్ రెండు బృందాలుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రమంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సాలెగాంకు చెందిన డ్రైవర్ చున్నీలాల్ హత్య చేసినట్లుగా నిర్ధారించి నిందితుడిని హుజూరాబాద్‌కు తీసుకువచ్చారు. డ్రైవర్ చున్నీలాల్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top