నే బతికే ఉన్నా..


గూడూరు: గూడూరు మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుంది. డబ్బులిస్తే చాలు బతికున్న వాళ్లు సైతం మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చేస్తారు. అందుకు గోల్కొండ జనార్దన్‌సింగే ఉదంతమే నిదర్శనం. ఇతను బతికి ఉండగానే మున్సిపల్ అధికారులు మృతిచెందినట్లు ధ్రువీకరణ పత్రాన్ని మీ-సేవా ద్వారా ఇచ్చేశారు. వివరాల్లోకి వెళ్తే... పట్టణంలోని నలజాలమ్మవీధికి  చెందిన జనార్దన్‌సింగ్ మూడేళ్ల నుంచి రూరల్ పరిధిలోని చెన్నూరులో నివాసముంటున్నాడు. రెండో పట్టణంలోని ఇందిరానగర్‌లో గత ఏడాది అక్టోబర్ 30న అతను మృతిచెందాడని ఓ వ్యక్తి గత నవంబరు 10న మున్సిపల్ కార్యాలయంలో ధ్రువీకరణపత్రం కోసం దరఖాస్తు చేశాడు. సాధారణంగా ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేసేందుకు మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయాలి. అయితే మున్సిపల్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని ధృవీకరణపత్రాన్ని ఈ సంవత్సరం జనవరి 13న జారీ చేశారు.

 వాటాల్లో తేడావచ్చి..

 మున్సిపల్ అధికారులకు, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్య ముడుపుల పంపకం విషయంలో విభేదాలు తలెత్తడంతో విషయం బయటకు పొక్కింది. దీంతో ఈ విషయాన్ని జనార్దన్‌సింగ్‌కు చేరవేశారు. ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఉద్యోగుల ద్వారానే ఆ మరణ ధృవీకరణపత్ర నకలను తీసుకున్నారు. తాను బతికుండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని తనకు ఎలా మంజూరు చేస్తారని మున్సిపల్ అధికారులను నిలదీసినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు జనార్దన్‌సింగ్ తెలిపారు.

 

  గూడూరు మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది సంపాదనే ధ్యేయంగా ఉన్నారు. ధృవీకరణ పత్రాల మంజూరులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాలు కమిషనర్‌కు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. డబ్బులిస్తే కార్యాలయంలో ఏ పనైనా నిమిషాల్లో జరిగిపోతోంది. డబ్బు లేకుండా పనిచేయించుకోవాలంటే రోజుల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంది. కార్యాలయం సిబ్బంది ముడుపులు చెల్లిస్తే కార్యాలయంలోని రికార్డులను తారుమారు చేయగలరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top