ఏపీకి నష్టంపై రాజకీయం

ఏపీకి నష్టంపై రాజకీయం - Sakshi


* బడ్జెట్‌లో ఏపీకి అన్యాయంపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు

* కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, ప్యాకేజీ

* ప్రస్తావన లేకపోవడంపై వస్తున్న విమర్శలను ఎదుర్కోవడంపై చర్చలు

* ఇద్దరమూ కలసి ఢిల్లీ వెళదామని బాబు

* ప్రతిపాదన.. అంగీకరించిన జనసేన అధినేత..

* ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఇతర కేంద్రమంత్రులను కలవాలని నిర్ణయం

* ‘రాజధాని భూముల సమీకరణ’ విమర్శలపైనా చర్చ

* వైఎస్ జగన్‌కన్నా ముందుగా రాజధాని ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబు సూచన

* పవన్‌కల్యాణ్ అంగీకరించారన్న టీడీపీ నేతలు


 

సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అరకొర కేటాయింపులు, రాజధానికోసం భూసమీకరణలో రైతులనుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు సినీనటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఆదివారమిక్కడ చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. గత ఎన్నికల సమయంలో టీడీపీ-బీజేపీకి మద్దతుగా పవన్‌కల్యాణ్ ప్రచారం చేయడంతోపాటు ఆయన సమక్షంలోనే ఎన్నికల ప్రచారసభల్లో ఆ కూటమి ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్, సాధారణ బడ్జెట్‌లో రాష్ట్రానికిచ్చిన హామీలేవీ లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలకు సంబంధించి రాజమార్గంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వంటివి రాకపోగా పెద్దఎత్తున వస్తున్న విమర్శల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజలు, రాజకీయ పక్షాలనుంచి వస్తున్న విమర్శలను ఎదుర్కొనడానికి తక్షణ కర్తవ్యంపై సమాలోచనలు జరిపారు.

 

  మరోవైపు రాజధానికోసం వేలాది ఎకరాల పంట భూములను రైతులనుంచి సమీకరిస్తుండటం వంటి పరిణామాలపై చర్చించారు. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలన్న దానిపై ఇద్దరూ సమాలోచనలు జరిపారు. ఇదిలావుండగా బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు సరిగా జరగలేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అంగీకరిస్తూనే ఈ విషయంలో ఢిల్లీకొచ్చి కేంద్రమంత్రులతో మాట్లాడాలని సూచించినట్టు ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. బడ్జెట్‌లో లోటుపాట్లు ఉంటే కేంద్ర ఆర్థికమంత్రిని కలసి మాట్లాడాలని తాను బాబుకు ఫోన్‌లో సలహా ఇచ్చినట్టు తెలిపారు. వెంకయ్యనాయుడు ఆ విషయం చెప్పిన కొద్దిగంటల్లోనే పవన్‌కల్యాణ్, చంద్రబాబుల భేటీ జరిగింది. వెంకయ్యనాయుడు చేసిన సూచనలపై చర్చించారు. ఇద్దరూ కలసి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితోపాటు ఇతర కేంద్ర మంత్రులను కలవాలని ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చారు. రాష్ట్రానికి మరికొన్ని నిధులైనా సాధిస్తే... అందరం కలసి కొంతమేరకైనా సాధించారన్న ఘనత దక్కుతుందన్న అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. అయితే ఢిల్లీ ఎప్పుడు వెళ్లాలన్న విషయంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. ఇప్పటికే తాను కేంద్రమంత్రుల అపాయింట్‌మెంట్ కోరానని, ఎప్పుడు దొరికితే అప్పుడు ఢిల్లీ వెళదామని చంద్రబాబు సూచించగా.. పవన్ అందుకు అంగీకరించారు.

 

 రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటన

 రాజధానికోసం వేలాది పంట భూములను నయానా భయానా రైతులనుంచి సమీకరిస్తున్న విషయంలో అన్నిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వస్తున్న పరిణామాలపైనా చంద్రబాబు, పవన్ చర్చించినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. కొద్ది రోజులక్రితం పలువురు రైతులు హైదరాబాద్ వచ్చి పవన్‌ను కలసి ప్రభుత్వం బలవంతంగా భూములను సమీకరిస్తోందని ఫిర్యాదు చేశారు. తాజాగా రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నుంచి పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబు కోరగా.. అందుకు పవన్ అంగీకరించినట్టు తెలిసింది. రాజధానికోసం రైతులనుంచి పంట భూములను సమీకరించడంపై ట్విట్టర్‌లో పవన్ ఇటీవల తీవ్రంగా స్పందించడం తెలిసిందే. ‘‘ఎంతో నమ్మకంతో ప్రజలు బీజేపీ-టీడీపీ కూటమిని గెలిపించారు. వారు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నా. రైతులు కన్నీరు పెట్టకుండా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంది. లేదంటే వారి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.

 

 కొత్త రాజధాని నిర్మాణంలో రైతులు, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత జీవనం ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపైనే ఉంది’’ అని పవన్ ట్వీట్ చేయడం విదితమే. తాజాగా రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటించబోతున్నారన్న అంశంపై   చర్చించిన మీదట ఆ ప్రాంతంలో జగన్‌కన్నా ముందుగా పర్యటిస్తే బాగుంటుందని బాబు ప్రతిపాదించగా పవన్ అంగీకరించినట్టు పార్టీ నేతలు చెప్పారు. గతంలో హుద్‌హుద్ తుపాను తాకిడితో విశాఖ అతలాకుతలమైనప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలోనే పవన్ అక్కడకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ మధ్య ఎలాంటి భేటీ జరగలేదు. తాజాగా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి చూపడం, రాజధాని ప్రాంతంలో జగన్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో వీరు కలసి చర్చలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాజధాని కోసం రైతులంతా స్వచ్చందంగా భూములిస్తున్నారంటూ.. భూ సమీకరణ వివరాలను పవన్‌కు  తెలియజే సి ఆ ప్రాంతంలో పర్యటించాలని బాబు కోరారు. పవన్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతల్ని ఆదేశించినట్టు సీనియర్ నేత ఒకరు తెలిపారు. పవన్ సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించే అవకాశమున్నట్టు వార్తలొచ్చాయి. అయితే పవన్ తన పర్యటనపై  ఎలాంటి ప్రకటన చేయలేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top