ఒకవైపు దాడులు.. మరో వైపు వేధింపులు

ఒకవైపు దాడులు.. మరో వైపు వేధింపులు


- అడ్డగోలు సంపాదన కోసం టీడీపీ నేతల దౌర్జన్యాలు

- బాధితుల జాబితాలో తహశీల్దార్, వీఆర్‌వో, వీఆర్‌ఏలు

- పోలవరం, పట్టిసీమ పనుల పేరుతో అధికారులకు వేధింపులు

సాక్షి ప్రతినిధి, విజయవాడ :
నేతలు తమ స్వార్థం కోసం అధికారులపై దాడులకు దిగుతూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నేతల తీరు అధికారులను బెంబేలెత్తిస్తోంది. అక్రమ సంపాదన కోసం కొందరు నేతలు నేరుగా అధికారులపై దాడులకు దిగుతుండగా, మరోవైపు అభివృద్ధి పేరుతో పట్టిసీమ, పోలవరం పనులు వేగంగా జరపాలని, అందుకు అవసరమైన పొక్లెయిన్లు, ఇతర వాహనాలు అధికారులు కాంట్రాక్టర్లకు సమకూర్చాలని మంత్రులు కలెక్టర్, ఇతర అధికారులపై ఒత్తిడి పెంచారు. పోలవరం కుడికాలువ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పుకునేందుకు  జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.



కాలువ పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు జిల్లాలో ఉన్న పొక్లెయిన్‌లను తీసుకురావాలని జిల్లా కలెక్టర్ బాబు పై వత్తిడి పెంచారు. దీనితో ఆయన ఆర్డీవోలు, తహశీల్దార్‌లపై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావును ఒక పొక్లెయిన్ యజమాని ఇంటికి ఆర్డీవో, తహశీల్దార్‌లు పంపించారు. ప్రొక్లెయిన్ కోసం వచ్చిన విషయాన్ని ఆయనతో చెప్పగా తాను మంత్రి అనుచరుడినని, తన పొక్లెయిన్ ఇవ్వబోనంటూ ఎదురు తిరిగాడు. ఇదే విషయం ఉన్నతాధికారులకు చెబితే వారు శ్రీనివాసరావుకు చీవాట్లు పెట్టడంతో పాటు బూతులు తిట్టారు. దీనిని భరించలేని శ్రీనివాసరావు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి సిద్ధపడ్డాడు. జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ప్రస్తుతం నూతన రాజధాని పరిధిలో అధికారులు, సిబ్బంది ఎంత మేరకు ఒత్తిడికి లోనవుతున్నారో అర్ధమౌతోంది.



పోలవరం కుడికాలువ తవ్వకాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనే మంత్రి ఉమా ఆదేశాల మేరకు  కలెక్టర్, ఈఎన్‌సీలు కాలువల వద్దేకూర్చుని సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. రైతుల భూములను తీసుకుని వారికి పూర్తిగా నష్టపరిహారం ఇవ్వకుండా పనులు చేస్తుండడంతో అధికారులను గ్రామస్తు లు నిలదీస్తున్నారు. ఇక జిల్లాలోని పొక్లెయిన్లు, బుల్‌డోజ ర్లు, టిప్పర్లను తీసుకురావాలని ఆదేశాలు జారీ చేయడంతో  రెవెన్యూ, రవాణా సిబ్బందికి  ముచ్చెమటలు పడుతున్నాయి.

 

- పదేళ్లుపాటు అధికారానికి దూరంగా ఉన్న కొందరు నేతలు ఇప్పుడు అందినంత వరకు దోచుకుంటున్నారు. నీరు-చెట్టు పథకం ద్వారా లక్షలు వెనుకేసుకున్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఇసుక దందాలు, భూ ఆక్రమణల్లో అధికారుల్ని బెంబేలెత్తిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను  కాపాడేందుకు, ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపై దాడికి తెగబడుతున్నారు.

- ఉద్యోగులకు వారంలో మూడు లేదా నాలుగు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు టీఏ, డీఏ  బిల్లులు ఇవ్వడం లేదు. వివిధ అంశాలకు సంబంధించి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పంపాలని కోరుతున్నారు. నిధులు విడుదల చేయకుండానే ఆయా పథకాలను పురోగతి బాట పట్టించాలనే నిబంధనలు విధిస్తున్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్‌వార్డుల్లో దాతలను ఉద్యోగులే చూడాలని షరతులు విధిస్తున్నారు.

- ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు హెల్త్‌కార్డులు మంజూరు చేయలేదు. ఎన్నికల సమయంలో వారంలో ఐదు రోజుల పనిదినాలు మాత్రమే ఉంటాయని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తరువాత ఆదివారాలు కూడా పనిచేయిస్తున్నారు.

- ప్రతి సోమవారం కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ గంటల తరబడి జరుగుతోంది. ఎవరైనా ఉద్యోగి ఈ కార్యక్రమానికి గైర్హాజరైతే వారికి నోటీసులు జారీచేస్తున్నారు.  ఒక్కొక్కసారి  వీడియో కాన్ఫరెన్స్ రాత్రి 10 గంటల వరకు జరుగుతోంది. మహిళా ఉద్యోగులు ఇంటికి  వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సివస్తోంది.

- ముసునూరు తహశీల్దార్ వనజాక్షి సరిహద్దులు దాటి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నారని కేబినెట్ సమావేశం నిర్ణయించడం, తప్పంతా ఆమెదే అనే ధోరణిలో ప్రభుత్వం నిర్ణయించటంతో ఎక్కడైనా  అక్రమాలు జరుగుతున్నాయని సమాచారం అందినా అధికారులు తమకు ఎందుకులే అనే పద్ధతిని అవలంబిస్తున్నారు.

- కలెక్టర్ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లో కిందిస్థాయి సిబ్బంది ముందే అధికారులకు చీవాట్లు పెట్టడంతో కిందిస్థాయి ఉద్యోగులు మాట వినని పరిస్థితి ఉంది.

 

- ముసునూరు తహశీల్దార్ వనజాక్షి ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరుల చేతిలో దాడికి గురయ్యారు. రాష్ట్రస్థాయిలో సంచలనం కలిగించినా చివరకు వనజాక్షిదే తప్పంటూ క్యాబినెట్‌లో చర్చించడం విశేషం.

- గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టేందుకు అధికార పార్టీ నేతల అనుచరులు సిద్ధమయ్యారు. దీన్ని అడ్డుకోవడానికి వెళ్లిన వీఆర్‌వో శ్రీనివాసరావు,  వీఆర్‌ఏ చలపతిరావుపై టీడీపీనేతలు దాడి చేసి గాయపరిచారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top