ఉద్యమాన్ని తాకట్టు పెట్టే కుట్ర

ఉద్యమాన్ని తాకట్టు పెట్టే కుట్ర - Sakshi


* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆగ్రహం

* ఏపీఎన్‌జీవో నేత అశోక్‌బాబుకు వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి సూటి ప్రశ్నలు

* విభజనకు మద్దతిచ్చిన పార్టీలను ఏపీఎన్‌జీవో ‘వేదిక’కు ఆహ్వానించడమేంటి?

* ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయం తీసుకున్నది అధికార కాంగ్రెస్సే కదా?

* తెలంగాణకు అనుకూలమని ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కు తీసుకున్నారా?

* తీర్మానం తర్వాతే బిల్లు వస్తుందని మభ్యపెట్టిన సీఎం కిరణ్‌ను ఎలా విశ్వసిస్తాం?

* మీ స్వార్థం కోసం కుట్రలు, కుతంత్రాల్లో సీమాంధ్ర ప్రజలు బలైపోవాలా?

 

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియ వేగంగా ముందుకెళుతున్న సమయంలో మరింత ఉధృతంగా జరగాల్సిన సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చడానికి కుట్రలు జరుగుతున్నాయని.. కొందరి రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చటానికి ఉద్యమకారులే తోడ్పాటు అందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆందోళన వ్యక్తంచేసింది. సమైక్య ఉద్యమం కోసం ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంపై రాష్ట్ర పరిరక్షణ వేదిక స్టేట్ కో-ఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు అంగీకరించిన పార్టీలను అఖిలపక్ష సమావేశానికి పిలవడంలోని ఆంతర్యమేమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈమేరకు లక్ష్మణరెడ్డి ఆదివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.



రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకోగా.. అంతకుముందే రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ‘‘అలాంటి పార్టీలను ఆహ్వానించడం వల్ల సమైక్యోద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్నామా? లేక అలాంటి పార్టీలను కలుపుకుని విభజనకు సహకరిస్తున్నామా?’’ అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు.



సీమాంధ్రలో ముఖం చెల్లని పార్టీలను పిలవడం వెనుక ఎవరినో చాంపియన్ చేయాలన్న దురుద్దేశాలున్నాయని విమర్శించారు. ‘‘ఎవరి స్వార్థం కోసమో సీమాంధ్ర ప్రజలు తలదించుకోవాలా? మీ కుట్రలు, కుతంత్రాలకు సమైక్యోద్యమం బలైపోవాలా?’’ అని నిలదీశారు. ఉవ్వెత్తున ఎగసిన సీమాంధ్ర ప్రజల భావోద్వేగ ఉద్యమాన్ని చూసి తోక ముడవాల్సిన రాజకీయ పార్టీల ముందు మోకరిల్లాల్సిన అవసరం ఎందుకొచ్చింద న్నారు. సమైక్యవాదులందరినీ కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఈ కీలక సమయంలో ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు నిర్వహించిన అఖిలపక్షం సమావేశం తీరును ఎండగట్టారు.



విభజనపై కేంద్రం చకచకా ముందుకు పోతున్న తరుణంలో సమైక్యవాదులను అదీ చిత్తశుద్ధితో సమైక్యం కోసం పనిచేస్తున్న రాజకీయ పార్టీలను మాత్రమే కలుపుకుని పోరాటం చేయాలే తప్ప.. ఎవరి ప్రయోజనాలనో నెరవేర్చడానికి ఐక్య వేదికలు ఏర్పాటు చేస్తే ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారని ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక హెచ్చరించింది. సీమాంధ్రలోనే కాదు.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే ప్రతి వ్యక్తీ అప్రమత్తం కావలసిన సమయమని, తెరవెనుక జరిగే కుట్రలు సాగనివ్వమని శపథం చేయాల్సిన తరుణమని పిలుపునిచ్చింది. అశోక్‌బాబు నిర్వహించిన సమావేశాన్ని ఉద్దేశించి.. దాని నిర్వాహకులను ఉద్దేశించి లక్ష్మణరెడ్డి పలు ప్రశ్నలు సంధించారు.



1. రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయం తీసుకున్నదే కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ తరఫున ప్రతినిధులను సమైక్యాంధ్ర వేదికకు ఆహ్వానించడంలోని ఆంతర్యమేంటి?



2. ఆ వేదిక సమావేశంలో పాల్గొన్న మరో రాజకీయ పార్టీ టీడీపీ. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణకు కట్టుబడి ఉన్నామని కేంద్రానికి లేఖ ఇచ్చారు. ఇప్పటికీ ఆ లేఖకు కట్టుబడి ఉన్నామనే చెప్తున్నారు. అధికార పార్టీకి తోడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష రాజకీయ పార్టీ లేఖ ఇవ్వటంతో కేంద్రం విభజనపై ముందుకెళ్లిందనటంలో సందేహం లేదు. అలాంటి పార్టీని వేదిక సమావేశానికి ఎందుకు పిలిచినట్టు?



3. తెలంగాణకు అనుకూలమని చెప్తూ ఆ(టీడీపీ) పార్టీ ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకున్నారా? లేదే! ఆ లేఖ వెనక్కి తీసుకోకుండా.. తమ పార్టీ సమైక్యంకోసం కట్టుబడి ఉందని ఆ తర్వాతైనా ప్రకటించిందా? అలా చేయకుండానే ప్రాంతానికో వైఖరి ప్రదర్శిస్తున్న టీడీపీకి సమైక్య ఉద్యమంలో భాగస్వామ్యమయ్యే అర్హత లేదు. అలాంటప్పుడు అఖిలపక్ష భేటీకి ఎందుకు ఆహ్వానించారు? ముందు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసి ఆ పని పూర్తి చేశాకే చేర్చుకోవాలి.



4. ప్రాంతానికో మాట.. ప్రాంతానికో తీరుగా వ్యవహరించే పార్టీల బండారం బయటపడాలంటే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను ఇలాంటి వేదికలకు ఆహ్వానించాలి. అలా కాకుండా ఆయా పార్టీలకు చెందిన ఒక ప్రాంత నాయకులను సమావేశానికి పిలవడం వల్ల సమైక్య ఉద్యమానికి ఏ రకంగా లాభం?



5. రెండు నాల్కల ధోరణితో వ్యవహరించే పార్టీలను ఆహ్వానించడం వల్ల ఉద్యమం చులకన కాదా? దీనివల్ల ఏం సాధించినట్టు? సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బకొట్టిన వాళ్లు కాదా?



6. చంద్రబాబునాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోరు. సమైక్యానికి అనుకూలంగా లేఖ రాయరు. పార్లమెంటులో నలుగురు ఎంపీలు అవిశ్వాస తీర్మానం ఇస్తారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు అందుకు దూరంగా ఉంటారు. ఆ వైఖరిని నిలదీయాల్సిన అవసరం లేదా? అసెంబ్లీలో కూడా అదే పద్ధతి. కొందరు సభ్యులు తెలంగాణ కావాలంటారు. మరికొందరు సమైక్యమంటారు. మీ వైఖరేంటని పార్టీ అధ్యక్షుడైన చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోయారు?



7. ఇంతచేసీ విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు స్పీకర్‌ను సభలోకి వెళ్లకుండా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటే.. తెలంగాణకు చెందిన డిప్యూటీ స్పీకర్ సభలోకి వెళ్లడం, దానిపై శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి చర్చను ప్రారంభించడం.. ఇవన్నీ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను అడ్డుకోవడం వల్లే కదా సాధ్యమైంది. ఇలాంటి నేతలను సమావేశానికి ఆహ్వానించడంలో ఆంతర్యమేంటి?



8. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లోనే సమైక్యవాద పార్టీలైన సీపీఎం, ఎంఐఎం, వైఎస్సార్ కాంగ్రెస్‌లను కలుపుకుని ముందుకుపోయి ఉంటే.. ఆ ఉద్యమ తాకిడికి భయపడి మిగిలిన పార్టీలూ సమైక్యం బాట పట్టేవే కదా? అలా కాకుండా విభజన వాదాన్ని అంగీకరించిన పార్టీలను భుజాలకెత్తుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనం?



9. విభజన బిల్లును పార్లమెంటులో అడ్డుకోవాలని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ కీలకమైన అనేక జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదించినట్టు అన్ని పార్టీల అధ్యక్షులను పిలిచి చర్చిస్తే ఎవరేమిటన్నది బయటపడేది. ఆ పని ఎందుకు చేయలేకపోయినట్టు?



10. అసెంబ్లీ తీర్మానం చేసి పంపితేనే బిల్లు రూపొందుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పుకుంటూ వచ్చారే..! ముఖ్యమంత్రి చెప్పింది శుద్ధ అబద్ధమని ఇప్పుడు తేలిపోయింది కదా. విభజనపై అసెంబ్లీ తీర్మానం కోరకుండా కేంద్రం ముందుకు పోదని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడేం సమాధానమిస్తారు? తీర్మానం చేయకుండానే ముసాయిదా బిల్లు అసెంబ్లీకి పంపారు కదా? ఇంకా సీఎంను ఎలా విశ్వసిస్తాం?



11. అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు బీఏసీ మీటింగ్‌కు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రాలేదు? అసెంబ్లీకి వచ్చీ చంద్రబాబు బీఏసీ భేటీకి రాకపోవడంలోని ఆంతర్యమేంటి?



12. సీమాంధ్ర ప్రజల్లో.. వారికి తోడు అన్ని ఉద్యోగ సంఘాలు ఒక్కతాటిపై ఉద్యమం చేస్తున్న సమయంలో ఏం చెప్పారు? ఈ ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు రావొద్దన్నారు. కానీ ఇప్పుడు.. అది కూడా విభజనకు అనుకూలంగా ఉన్న పార్టీలను పిలిచి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది?



13. సీమాంధ్ర ప్రజల ముందు ముఖాలు చూపించే స్థాయి లేక.. ముఖం చెల్లకుండా పోయిన పార్టీలను, నాయకులను ఆహ్వానించి.. రేపటి రోజున వారిని సీమాంధ్ర ప్రజల్లో తిరిగేట్టు చేయడానికే ఈ రకంగా చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?



14. వారేమైనా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చారా? లేక వారేమైనా విభజనకు అనుకూలంగా ఉన్న వారి సొంత పార్టీలకు రాజీనామాలు చేసి మీ ముందుకు వచ్చారా? లేదే..! మరలాంటప్పుడు వారినెందుకు భుజాన మోస్తున్నారు? ఏమిటీ పద్ధతి?



15. సీమాంధ్ర ప్రజల్లో ముఖం చెల్లకుండా పోయిన నేతల రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వేదిక ద్వారా ఎందుకు అవకాశం కల్పిస్తున్నట్టు? దీని వెనుక ఉన్న మతలబేంటి?

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top