తుళ్లూరులో రియల్ మాయ

తుళ్లూరులో రియల్ మాయ - Sakshi


* రూ కోట్లు లెక్కపెట్టేందుకు దుకాణాల్లోనే నోట్ల లెక్కింపు యంత్రాలు

* రోడ్ల మీదే ఖరీదైన కార్లు, సెకండ్ హ్యాండ్ వాహనాల ప్రదర్శనలు

* భూ లావాదేవీల ఘర్షణల నివారణకు పోలీస్ బృందం గస్తీ


సాక్షి, విజయవాడ బ్యూరో: తుళ్లూరు... గుంటూరు జిల్లాలోని ఓ మండలకేంద్రం. రెండునెలల కిందటి వరకు ఈ ఊరు ఎక్కడుందో కూడా చాలామందికి తెలియదు. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరిపే ప్రాంతంగా ఈ గ్రామం ఎంపిక కావడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. వచ్చిపోతున్న వాహనాలతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల వరకు రోజుకు రూ 200 వ్యాపారం జరిగితే గొప్ప అనుకున్న జిరాక్స్ సెంటర్లు మొదలుకుని కాకా హోటళ్లు, టీ అంగళ్లు, బిజీబిజీగా మారిపోయాయి. రాజధాని జోన్‌లో 29 గ్రామాల్లో భూ సమీకరణకు బాబు సర్కార్ కసరత్తు చేస్తుండటంతో భూ క్రయవిక్రయాలు ఊపందుకున్నా యి. ల్యాండ్ ఫూలింగ్‌తో తమ భూములు కో ల్పోతామని కలవరపడుతున్న అన్నదాతలు భూములు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.



గత పది రోజుల్లోనే ఈ 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 3,500 ఎకరాల భూములను అమ్ముకున్నట్లు అనధికారిక సమాచారం. మూడు నుంచి నాలుగు చేతులు మారడంతో ప్రతీ రిజిస్ట్రేషన్‌లోనూ ధరలు పెరుగుతూపోయాయి. దీంతో పది రోజుల క్రితం రూ.90లక్షలు పలికిన ఎకరం ఇప్పుడు నుంచి కోటిన్నర నుంచి రెండు కోట్లపైమాటే. రూ.కోట్లను కమిషన్‌పై లెక్కించేందుకు నోట్ల లెక్కింపు యంత్రాలతో దుకాణాలు కూడా వెలిశాయి. బ్రోకర్లు  కోటిు లెక్కిస్తే రూ. వెయ్యి  కమిషన్ తీసుకుంటున్నారు. మరోవైపు కారు, బైక్ మేళాలు మొదలయ్యాయి. శనివారం నుంచి గుంటూరుకు చెందిన ఆటో కన్సల్టెన్సీ వాళ్లు పాత కార్లు తెచ్చి అమ్మేందుకు మేళా పెట్టారు.  

 

ఏడు రెవెన్యూ బృందాల ఏర్పాటు..

భూముల కొనుగోళ్లు అమ్మకాలకు రిజిస్ట్రేషన్ కావాలంటే పట్టాదార్ పాస్‌పుస్తకాలు, అడంగళ్‌లు తప్పనిసరి కావడంతో రెవెన్యూ శాఖకు చేతినిండా పనిదొరికింది. తుళ్ళూరు తహశీల్దార్ కార్యాలయంలో పట్టాదార్ పాస్‌పుస్తకాలు, అడంగళ్ దస్త్రాల కోసం శనివారం వందల సంఖ్యలో రైతులు, బ్రోకర్లుతో కిక్కిరిసిపోయింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలతో పాస్‌బుక్‌ల కోసం రైతులనుంచి వందలాది దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్టు తహశీల్దార్ ఎ.సుధీర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు. ఫోర్జరీలకు, వివాదాలకు తావులేకుండా భూముల రికార్డులు, వాస్తవంగా భూములు ఎవరి పేరుతో ఉన్నాయనే విషయాలను రెవెన్యూ బృందాలు పూర్తిస్థాయి పరిశీలన చేసిన తరువాతే దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలు జారీచేస్తామని తెలిపారు. తుళ్లూరులో వందలాది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేరుకోవడంతో భూలావాదేవీల్లో ఘర్షణలు తలెత్తకుండా ప్రత్యేక పోలీస్ టీం గస్తీ తిరుగుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top