మరిన్ని ప్రైవేటు సంస్థలకు భూములు


సీఆర్‌డీఏ కసరత్తు  

 

సాక్షి, అమరావతి: రాజధానిలో ఇప్పటికే ఐదు ప్రైవేటు సంస్థలకు కారుచౌకగా వందలాది ఎకరాలు కట్టబెట్టిన సర్కారు మరికొన్ని సంస్థలకు అదేదారిలో భూములిచ్చేందుకు సిద్ధమవుతోంది. భూములు తీసుకున్న రైతులకు ఇంతవరకూ ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించలేదు కానీ ప్రైవేటు సంస్థలకు మాత్రం అడిగిందే తడవుగా భూములిస్తామని చెబుతోంది. అవసరమైతే పెద్ద ప్రైవేటు సంస్థలకు ఉచితంగానైనా భూములిచ్చేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. దీంతో రాజధానిలో తమకు భూములు కేటాయించాలని అనేక సంస్థలు సీఆర్‌డీఏకు దరఖాస్తు చేసుకున్నాయి.



వాటిన్నింటికీ చాలావరకూ భూములిచ్చేందుకు ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. తొలిదశలో ప్రైవేటు విద్యా సంస్థలకు భూములు ధారాదత్తం చేయగా.. మలిదశలో మరికొన్ని విద్యా సంస్థలతోపాటు హోటళ్లు, ఆస్పత్రులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు భూములివ్వాలని చూస్తోంది. అమిటీ యూనివర్సిటీకి భూములిచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ తర్వాత గీతం యూనివర్సిటీ, బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి, ఏపీ ఎన్‌ఆర్‌టీ, ఎర్నెస్ట్‌ అండ్‌ ఎంగ్, ఎక్స్‌ట్రీమ్‌ ప్రాజెక్ట్స్, ఇండ్‌ రాయల్‌ హోటల్స్‌ వంటి పలు సంస్థలు రేసులో ఉన్నాయి. రానున్న రెండు నెలల్లో పదికి పైగా సంస్థలకు భూములిచ్చేందుకు సీఆర్‌డీఏ సమాయత్తమవుతోంది.   
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top