మీ భూమి.. తప్పుల తడక!


అవుకు మండలం మంగంపేట తండాకు చెందిన కొర్ర శంకర్ నాయక్‌కు రామావరం సమీపంలోని వజ్రగిరి ప్రాంతంలో 143 సర్వే నంబర్‌లో 1.26 ఎకరాల భూమి ఉంది. అనారోగ్య కారణంగా ఈయన 2009వ సంవత్సరంలో మృతి చెందాడు. ఈ రైతు కుమారుడు శ్రీనివాసనాయక్ తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం సంబంధింత రెవెన్యూ కార్యాలయంలో అందజేశాడు. మీ భూమి వెబ్‌సైట్‌లో మృతిచెందిన శంకర్‌నాయక్ పేరుమీదనే భూమి ఉన్నట్లు పొందుపరిచారు.

 దొర్నిపాడుకు చెందిన భూపనపాడి రోషమ్మకు 1093 సర్వే నంబర్‌లో 2 ఎకరాల మెట్ట పొలం ఉంది. మీ భూమి వెబ్ సైట్ ఆమె ఇంటిపేరు భూపాటి రోషమ్మగా నమోదు చేశారు.

 

 సాక్షి, కర్నూలు: ..వీరే కాదు జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన మీ భూమి వెబ్‌సైట్‌లో తప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను బతిమాలకుండా, కాళ్లు అరిగేలా తిరగకుండా వారి భూమి వివరాలు వారే చూసుకునేలా ప్రభుత్వం ‘మీ భూమి’ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించడం వరకు బాగానే ఉన్నా.. వైబ్‌సైట్‌ను క్లిక్ చేసిన వాళ్లకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. భూముల సమాచారం అంతా తప్పుల తడకగా ఉండడమే ఇందుకు కారణం. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేయకపోవడం తమకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోందంటున్నారు రైతులు.

 

 రైతులు తమ భూమి వివరాలు తాము తెలుసుకోవాలంటే గతంలో రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అక్కడ అధికారులకు అమ్యామ్యాలు చెల్లించాల్సి ఉండేది.. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, మీ-సేవ ద్వారా రెవెన్యూ సేవలు, వెబ్‌ల్యాండ్ వంటి మార్పులు జరిగిన తర్వాత ఈ పరిస్థితి మారినా ఇంకా ఇబ్బందులు తప్పలేదు. భూ ముల వివరాలు తెలుసుకునే చిన్నపనికి సైతం ఇళ్లు-ఊరు విడిచి వెళ్లాల్సి రావడంపై ప్రభుత్వం పునరాలోచన చేసింది.

 

 ఇంటర్నెట్ సౌకర్యం మారుమూల గ్రామాలకు విస్తరించిన నేపథ్యంలో అరచేతిలో సైతం భూమి వివరాలు తెలుసుకునే దిశగా వెబ్‌సైట్‌ను, మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్(యాప్)ను రూపొం దించి ‘మీ భూమి’ కార్యక్రమం పేరిట ప్రభుత్వం ప్రారంభించింది. భూములకు సంబంధించిన అడంగల్, 1బి, భూమి కొలతల రికార్డు(ఎఫ్‌ఎంబీ), గ్రామపటాల వివరాలు నమోదు చేసి ఆన్‌లైన్ చేశారు. మన భూమి వెబ్‌సైట్ ఆరంభించి అందరూ చూసుకునే సేవలు వెంటనే అందుబాటులోకి వచ్చాయి.

 

 తప్పుల తడక..

 జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా దాదాపు 7 లక్షల 1బి ఖాతాలున్నట్లు సమాచారం. అడంగల్ ఖాతాలు 13 లక్షల వరకూ ఉన్నాయి. ఈ రెండు రికార్డుల్లోనూ దాదాపు 30 శాతంపైగా తప్పులున్నట్లు రెవెన్యూ అధికారులే అభిప్రాయపడుతుండడం గమనార్హం. వాస్తవానికి రికార్డుల్లో ఇప్పుడు సాగులో ఉన్న, భూమి అనుభవిస్తున్న చాలామంది రైతుల పేర్లు లేవు. వారసత్వంగా సంక్రమించిన భూముల్లో తాతా, ముత్తాతల పేర్లు ఉన్నాయి. కొనుగోలు చేసిన వారి పేరున సైతం భూమార్పిడి జరగలేదు. ఆన్‌లైన్ సమయంలో కూడా ఎన్నో తప్పులు దొర్లాయి. కాగితపు రికార్డుల్లో ఉన్నట్లు కాకుండా రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం కూడా తప్పులుగా నమోదు చేశారు.

 

 ప్రతి నెలా వందల సంఖ్యలో మార్పు, సవరణలకు దరఖాస్తులు రావడం ఇందుకు నిదర్శనం. ఆ మండలం, ఈ మండలం అని తేడా లేకుండా అన్ని చోట్లా రికార్డుల్లో తప్పులు పరిపాటిగా మారాయి.  వీటినే రెండేళ్ల కిందట ఆన్‌లైన్ చేశారు. వాటినే వెబ్‌ల్యాండ్‌లో ఇటీవల పెట్టారు. ఈ కారణంగా ఇప్పటికే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మార్పు కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ వివరాలు మీ భూమి వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి. తాజా రికార్డులు నమోదు చేయకుండా వెబ్‌ల్యాండ్ ప్రారంభించడం వల్ల రైతులకు ఒనగూరేదేమీ లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top