అంగన్వాడీ పోస్టులను అమ్మేశారు!

అంగన్వాడీ  పోస్టులను అమ్మేశారు!


అధికార పార్టీ నేతల  ఇష్టారాజ్యం

అభ్యర్థుల నుంచి   రూ.లక్షల్లో వసూలు

భవిష్యత్తులో మరిన్ని పోస్టులు వచ్చే  అవకాశం

 


విజయవాడ : అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులను అధికార పార్టీ నేతలు తెగనమ్ముకున్నారు. కలెక్టర్ బాబు.ఎ ఎంత కఠినంగా ఉన్నా, ఐసీడీఎస్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తాము అనుకున్నవారికే పోస్టింగ్‌లు ఇప్పించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లాలో అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులు 93, ఆయాలు 369, మినీ కార్యకర్తలు 4 పోస్టులను అధికారులు భర్తీ చేశారు. ఈ ప్రక్రియలోనే టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు భారీగా ముడుపులు దండుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.



తిరువూరు, విస్సన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 14 కార్యకర్తల, 43 ఆయాల పోస్టులకు 450 దరఖాస్తులు వచ్చాయి. స్థానిక అధికార పార్టీ ముఖ్య నేత, జన్మభూమి కమిటీల సభ్యులు కుమ్మక్కై ఈ పోస్టులు విక్రయించుకున్నారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. గంపలగూడెం మండలం ఉమ్మడదేవరపల్లిలో అంగన్‌వాడీ కార్యకర్త ఎంపిక నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విస్సన్నపేట ప్రాజెక్టు పరిధిలోని చాట్రాయి మండలంలో మూడు కార్యకర్తల పోస్టులు తెలుగుదేశం నాయకులు చెప్పినవారికే ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరువూరు పట్టణంలో ఒక కార్యకర్త పోస్టుకు స్థానిక టీడీపీ నాయకులు రూ.2 లక్షలు వసూలు చేసినట్లు ప్రచారం జరిగింది. చివరకు ఆ అభ్యర్థికే పోస్టు లభించడం గమనార్హం.  

 

బేరం కుదకపోవడంతో....

 గుడివాడ నియోజకవర్గ పరిధిలో ఆరుగురు ఆయాలు, ఒక వర్కర్, రూరల్ మండలంలో ఇద్దరు వర్కర్లు, ఆరుగురు ఆయాలు, గుడ్లవల్లేరు మండలంలో 15 ఆయా పోస్టుల నియామకం జరగ్గా, గుడివాడలో ఒకరు, గుడ్లవల్లేరు ఐదుగురు ఆయాలు విధులకు హాజరుకాలేదు. తొలుత నియామకాలకు సంబంధించి తేదీ నిర్ణయించినా అభ్యర్థులకు సంబంధించి బేరసారాలు కుదరకపోవడంతో ఆర్డీవోపై ఒత్తిడి తెచ్చి వాయిదా వేయించారు. అనంతరం జరిగిన ఇంటర్వ్యూల్లో అంగన్‌వాడీ టీచర్‌కు రూ.60 వేలు, ఆయాకు రూ.40 వేలు చొప్పున టీడీపీ నాయకులు వసూలు చేసినట్లు సమాచారం. కొంతమందికి సంబంధించి టీడీపీ నాయకుల ఒత్తిడితో అపాయింట్‌మెంట్లు ఇచ్చినా వారు విధుల్లో చేరకపోవడం విశేషం. స్థానిక గుడ్‌మెన్‌పేటకు చెందిన ఓ అంగన్‌వాడీ ఆయా ఉద్యోగానికి నియోజకవర్గ ఇన్‌చార్జికి అత్యంత సన్నిహితుడు అధికారులపై ఒత్తిడి తెచ్చి నియామకం చేయించారు. అయితే ఆమె విధులకు హాజరుకావడం లేదని ఐసీడీఎస్ కార్యాలయ సిబ్బంది తెలిపారు.

 

డిసెంబర్‌లో మరికొన్ని పోస్టులకు నోటిఫికేషన్


 జిల్లాలో ఈ నెలలో 48 కార్యకర్తలు, 263 ఆయాల పోస్టులు ఖాళీ అవుతాయని మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న టీడీపీ నేతలు వాటిని తమ అనుకూల వర్గానికే దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

ఆలస్యంగా దరఖాస్తు చేసినప్పటికీ...


మచిలీపట్నం మండలంలో 10 అంగన్‌వాడీ ఆయాల పోస్టులు, ఒక కార్యకర్త పోస్టు కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కార్యకర్త పోస్టు కోసం ఏడుగురు, పది ఆయాల పోస్టుల కోసం 40 మంది దరఖాస్తు చేశారు. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ పోస్టుల భర్తీ జరిగింది. ఒక్కొక్క పోస్టుకు రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు వసూలు చేశారు. చిన్నాపురం పంచాయతీలోని కొత్తూరు ఆయా పోస్టును ఇచ్చేందుకు మండలస్థాయి ప్రజాప్రతినిధి రూ.75 వేలు వసూలు చేశారు. నగదు ఇచ్చిన మహిళతో ఆలస్యంగా దరఖాస్తు పెట్టించి ఆమెకే ఉద్యోగం వచ్చేలా ఆయన చక్రం తిప్పారని సమాచారం. ఈ విషయంపై కొత్తూరు అంగన్‌వాడీ ఆయా పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న నలుగురు అభ్యర్థులు అంగన్‌వాడీ కార్యాలయం వద్దకు వెళ్లి ప్రశ్నించడం వివాదమైంది. తపసిపూడి అంగన్‌వాడీ కార్యకర్త పోస్టుల భర్తీలోనూ అధికారులు, టీడీపీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.



పదో తరగతిలో అధిక మార్కులు వచ్చిన వారిని పక్కనపెట్టి తక్కువ మార్కులు వచ్చిన మహిళకు ఈ పోస్టును కేటాయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన పోస్టును రద్దు చేయాలని కోరుతూ అంగన్‌వాడీ కేంద్రానికి దరఖాస్తు చేసి పోస్టు రాని అభ్యర్థులు గొడవకు దిగారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. ఈ విషయంపై ఐసీడీఎస్ సీడీపీవో, అభ్యర్థులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగి పోలీసు కేసుల వరకు వెళ్లింది. పెద్దలు సర్దిచెప్పటంతో విషయం సద్దుమణిగింది. ఈ పోస్టు భర్తీలోనూ లక్ష రూపాయల వరకు చేతులు మారినట్లు స్థానికులు చెబుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top