లగడపాటి చిందులు

లగడపాటి చిందులు - Sakshi


సాక్షి, హైదరాబాద్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ‘సాక్షి’పై తన అక్కసును మరోసారి వెళ్లగక్కారు. పత్రికల్లో రాయలేని భాషను ఉపయోగిస్తూ సాక్షి ప్రతినిధులను దూషించారు. మీదమీదకు వస్తూ వీధి రౌడీలా ప్రవర్తించారు. అడ్డుకోబోయిన ఇతర పాత్రికేయులనూ వదల్లేదు. బూతు పంచాంగం వినిపించి సంస్కార హీనంగా ప్రవర్తించారు. లగడపాటి తిట్ల దండకం విన్న మీడియా ప్రతినిధులు విస్తుపోయారు. పార్లమెంటు సభ్యుడిగా ఉంటూ అలా వ్యవహరించడం విజ్ఞత కాదని పదేపదే సర్దిచెప్పారు. అయినా వినకుండా లగడపాటి రెచ్చిపోయారు. రాయలేని భాషలో తిడుతూ ‘ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ దూషణల పర్వం అందుకున్నారు. ప్రెస్‌మీట్‌కు పిలిచి మరీ అవమానించడంపై విలేకరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

 

వివరాల్లోకి వెళితే.. లగడపాటి రాజగోపాల్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. దానికి హాజరు కావాలని కోరుతూ అన్ని మీడియా సంస్థలకు వచ్చినట్టుగానే ‘సాక్షి’కీ ఆహ్వానం వచ్చింది. దాంతో సాక్షి ప్రతినిధులు కూడా ఆ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యారు. ప్రెస్‌మీట్‌ను ప్రారంభించిన లగడపాటి సమైక్య వాదం కోసం తాను చేస్తున్న కృషిని వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఇచ్చే శక్తి, ఆపే శక్తి లేదని ఆనాడు చెప్పిన జగన్‌కు ఈనాడెలా ఆపే శక్తి వచ్చిందంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు ఓట్లు, సీట్లే ముఖ్యమని, తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో జగన్‌తో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజించే యత్నం చేస్తోందని ఆరోపించారు. జగన్‌కు 25 ఎంపీ సీట్లు...కేసీఆర్‌కు 15 ఎంపీ సీట్లు వస్తాయనే ఉద్దేశంతో వారితో కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కయ్యారని విమర్శించారు. నిజమైన సమైక్యవాది ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డేనంటూ కొనియాడారు. ఏపీఎన్జీవోలు హైదరాబాద్‌లో నిర్వహించిన సమైక్య బహిరంగ సభకు అన్ని చానళ్లు లైవ్ కవరేజీ ఇస్తే సాక్షి మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి సాక్షి విపరీతమైన ప్రాధాన్యతనిస్తోందంటూ దుయ్యబట్టారు.



ఆ సమయంలో సాక్షి విలేకరి ‘సార్...ఏపీఎన్జీవోల సభకు సాక్షి కూడా లైవ్ కవరేజీ ఇచ్చింది’ అని చెప్పబోతుండగా లగడపాటి ఒక్కసారిగా సాక్షి విలేకరులపై విరుచుకుపడ్డారు. ఆగ్రహంగా ‘నోర్మూయ్.. ఇది నా ప్రెస్‌మీట్. నువ్వు మాట్లాడొద్దు. నువ్వు సాక్షి అయితే ఇక్కడి నుంచి వెళ్లిపో’ అంటూ మండిపడ్డారు. ‘అది కాదండీ....లైవ్ ఇచ్చామని చెప్పబోతున్నామే తప్ప అడ్డుకోవాలని కాదు’ అని చెప్పబోతుండగా.. ‘వెళ్లిపో.. ఇక్కడ కూర్చొని వెధవల్లా మాట్లాడొద్దు. ఏపీఎన్జీవోల సభను పట్టించుకోకుండా వెధవ పనులు చేసి ఇంత దాకా తీసుకొచ్చారు.

 

 కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌తో లాలూచీ పడి రాష్ట్రాన్ని విభజిస్తున్నారు’ అంటూ తిట్ల దండకం అందుకున్నారు. అయినప్పటికీ సాక్షి విలేకరులు ప్రెస్‌మీట్‌లో లగడపాటి ప్రసంగం పూర్తయ్యే వరకు మౌనంగా ఉన్నారు. ‘ఇతర పార్టీలతో కుమ్మక్కై రాష్ట్రాన్ని విభజిస్తున్న కాంగ్రెస్‌లో మీరెందుకు కొనసాగుతున్నారు? మిమ్మల్నెందుకు పార్టీ విశ్వసించడం లేదని అడిగిన వేరే మీడియా ప్రతినిధులపై కూడా లగడపాటి అసహనం వ్యక్తం చేశారు. మీరే మీడియా సంస్థ నుంచి వచ్చారంటూ వారిని ప్రశ్నించారు.



‘వార్త నుంచి వచ్చాను. అయినా మీడియా గురించి ఎందుకు అడుగుతున్నార’ని ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారు. ‘కాంగ్రెస్‌కు దత్త పుత్రుడు దొరికాడు. తేరగా 25 ఎంపీలు సీట్లు వస్తాయని కాంగ్రెస్ ప్రజలను మోసం చేసే కుట్ర చేస్తోంది’ అని కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ప్రెస్‌మీట్ ముగిసిన తరువాత, వెళ్లిపోయే ముందు.. మరోసారి సాక్షి విలేకరిపై చిందులేశారు. సాక్షి విలేకరులు ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించారు. మీరు పిలిస్తేనే వచ్చామని, పిలిచి అవమానించడం మర్యాద కాదని చెప్పిన విలేకరిపై మరింతగా రెచ్చిపోయారు. ‘ఎందీ మీకిచ్చే మర్యాద. ఇక్కడి నుంచి వెళ్లిపోండి. సాక్షిని బహిష్కరిస్తున్నా. సాక్షి వాళ్లెవరూ రావొద్దు’ అని మండిపడ్డారు. ఇతర విలేకరులు సర్దిచెబుతున్నా వినకుండా పూనకం వచ్చిన వ్యక్తిగా, వీధి రౌడీలా సాక్షి విలేకరులపై విరుచుకుపడ్డారు.

 

లగడపాటి తీరును ప్రత్యక్షంగా చూసిన మీడియా ప్రతినిధులు ఆయన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. సీమాంధ్రలో  ఉద్యమం తీవ్రం కావడం, అక్కడి ప్రజలంతా కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో.. దిక్కుతోచని స్థితిలో లగడపాటి సహనం కోల్పోయి, సాక్షిపై తన అక్కసును వెళ్లగక్కారని వారు అభిప్రాయపడ్డారు. లగడపాటి తీరును ఆద్యంతం గమనించిన విలేకరులు ఆయన వ్యక్తిగత ఎజెండాతోనే ప్రెస్‌మీట్‌కు వచ్చినట్లు కన్పించిందని వ్యాఖ్యానించారు. ‘సాక్షి’ ఎదుగుదలను జీర్ణించుకోలేక పదేపదే అక్కసు వెళ్లగక్కుతున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుల మాదిరి గానే లగడపాటి వ్యవహరిస్తున్నారని పలువురు పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top