లేడీ హంటర్ అలెక్స్ అరెస్ట్

లేడీ హంటర్ అలెక్స్ అరెస్ట్


*అమ్మాయిలను మోసగిస్తున్న ఎలెక్స్ జీవితంలో ఆసక్తి కోణాలు

*బాధితురాలే పట్టించిన వైనం ఎట్టకేలకు కటకటాలపాలు


 

పెదవాల్తేరు: యువతులపై వ్యామోహం అతనికి మానసిక రుగ్మతగా మారిపోయింది. తనకు తానే హీరో అని భ్రమల్లో విహరించాడు. సమాజం, పరువుతో పనిలేదనుకున్నాడు. అమ్మాయిల ఆకర్షణలో విచక్షణ జ్ఞానం విడిచిపెట్టాడు. ఇలాంటి మానసిక స్థితే అలెక్స్ బెనర్ట్‌ను లేడి హంటర్‌గా మార్చింది. బుధవారం రాత్రి ఇతడు ఎంవీపీ కాలనీలో యువతులను వేధిస్తూ వెంటపడి పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే.


అలెక్స్ అమ్మాయిల వెంటపడి వేధించడం ఒక హాబీగా మార్చుకున్నాడు.  రెండేళ్లుగా ఎంవీపీకాలనీ, సీతమ్మధార ఇలా పలు ప్రాంతాల్లో యువతులను వేధించిన అతడు చివరకు ఓ బాధితురాలి వలలో పడి అరెస్టయ్యాడు. కోర్టు గురువారం అలెక్స్ కు  పధ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది.



స్థిరపడిన కటుంబం: అలెక్స్‌ నగరంలో స్థిరపడిన కుటుంబం. అలెక్స్ తండ్రి నేవల్ ఉద్యోగి. కేర  నుంచి ఇరవై ఏళ్ల కిందట బదిలీపై నగరానికి వచ్చిన వీరి కుటుంబం గాజువాకలో సొంత ఇల్లు కొనుగోలు చేసి నివాసం ఉంటోంది. అలెక్స్  ఇంటీరియల్ డిజైనర్‌గా పని చేస్తూ ఫిట్‌నెస్ ట్రేనింగ్ సెంటర్‌ నడిపిస్తూ బీచ్‌రోడ్డులోని బీచ్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. అతనికి భార్య ఉంది. కుమారుడు చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా,  కుమార్తె ఉన్నత విద్య చదువుతోంది. ఏభై ఏళ్ల అలెక్స్‌కు కొన్నేళ్లుగా కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. తనపై యువతులు మోజు పడతారని వెంటపడడం మొదలెట్టాడు. రాత్రి సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఒంటరిగా నడిచి వెళ్తున్న అమ్మాయిలే టార్గెట్‌గా చేసుకునేవాడు.



రోడ్డు మీద నడిచివెళ్తున్న యువతి ముందు అలెక్స్ కారు నిలిపేవాడు. ఏదో ఒక పేరు చెప్పి చిరునామా అడిగేవాడు. పెద్దవాడే కదా అని వారు గౌరవంతో మాట్లాడేసరికి ఇదే అనువుగా మాటలు కలిపేవాడు. అందంగా ఉన్నావు. స్నేహం చేస్తావా అని అడిగేవాడు. ఆ తర్వాత అమ్మాయిలను ముగ్గులోకి దించి వారికి తెలియకుండా వీడియోలు తీసి బ్లాక్‌మేల్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.




కెన్‌ఫౌండేషన్ ట్రాప్: అలెక్స్ బారిన పడిన  చాలామంది యువతులు... కెన్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపి వాపోయారు. ఈ ఫౌండేషన్‌లో ఆరుగురు వాలంటీర్లుగా పని చేస్తున్నారు. వీరిలో నలుగురు యువతులున్నారు. ఇతడి మోసపు నైజాన్ని పసిగట్టిన వీరు రెండు నెలలుగా వేచి చూశారు. గతంలో ఒక పర్యాయం త్రుటిలో తప్పించుకున్నాడు. చివరకు బుధవారం బాధిత యువతి చాకచక్యంగా వ్యవహరించి పట్టుకుని ఫౌండేషనుకు తెలిపింది. వారి సహాయంతో అలెక్స్‌ను పోలీసులకు పట్టించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top