ఎంత మా(ఫీ)య బాబూ!


 సాక్షి, కడప: కడపలోని ఒక మహిళా గ్రూపు. దాదాపు 12 ఏళ్లుగా పక్కాగా గ్రూపు నడుపుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అందుకు అనుగుణంగా బాగా పొదుపు చేస్తూ... ఎప్పటికప్పుడు రుణం మొత్తాన్ని చెల్లిస్తూ అధికారుల మన్ననలు అందుకుంది. ఈ క్రమంలో గ్రూపు సభ్యులు రూ. 8 లక్షల వరకు రుణం తీసుకున్నారు. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో అప్పటి నుంచి ఎవరూ రుణాలు చెల్లించడం లేదు.



 అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేడో, రేపో రుణాలు మాఫీ చేస్తుందని ఎదురు చూసిన మహిళా సంఘాల సభ్యులకు నిరాశ మిగిలింది. సోమవారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం చంద్రబాబు కేవలం రూ. లక్షలోపు మాత్రమే రుణం మాఫీ అంటూ ప్రకటించడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇలా జిల్లాలోని 48 వేల పొదుపు సంఘాల్లోని మహిళా గ్రూపులకు సంబంధించి ఒక్కో గ్రూపునకు కేవలం రూ. లక్ష రుణం మాఫీ ప్రకటన వారిని ఆందోళనకు గురి చేస్తోంది.

 

 అంతా అస్పష్టం..

 డ్వాక్రా రుణాల రద్దుపై చంద్రబాబు చేసిన ప్రకటన అస్పష్టంగా ఉంది. డ్వాక్రా గ్రూపు తీసుకున్న రుణం మొత్తం మాఫీ అయ్యేలా కనిపించలేదు. కేవలం గ్రూపు మొత్తం మీద లక్ష రూపాయలు మాఫీ చేసేలా నిర్ణయం తీసుకోవడం చూస్తే...గ్రూపులో 10 మంది సభ్యులు ఉంటే ఒక్కొక్కరికి రూ. 10 వేలు మాఫీ అయ్యేలా...10 మందికి కలిపి లక్ష రూపాయలు మాత్రమే ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.



ఒకవేళ బాబు ప్రకటించినట్లుగా రూ. లక్షలోపు రుణం తీసుకున్న గ్రూపుల ప్రకారం మాఫీ చేస్తే కేవలం కొన్ని గ్రూపులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ప్రకారం చూస్తే జిల్లాలో ఏడెనిమిది వేల గ్రూపులకు మాఫీ అయితే మిగిలిన 40 వేల గ్రూపులకు ఎగనామం తప్పదు. అయితే ఇలా  గ్రూపుల ప్రకారం కాకుండా కేవలం గ్రూపు మొత్తం మీద మాత్రమే రూ. లక్ష మాఫీ చేస్తూ ప్రతి గ్రూపునకు వర్తించేలా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే విధి విధానాలు వస్తే తప్ప స్పష్టత ఉండదు. రుణాల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.



 రైతు కుటుంబానికి రూ. లక్షన్నరే!

 రైతు రుణాల మాఫీ విషయంలోనూ రైతులకు పెద్ద షాక్ తగలనుంది. రైతు కుటుంబానికి సంబంధించి ఒక్క రుణాన్ని మాత్రమే అది కూడా రూ. లక్షన్నరలోపు రుణాన్ని మాత్రమే మాఫీ చేయాలని బాబు నిర్ణయించడంతో రైతు నోట్లో పచ్చివెలక్కాయపడ్డట్లైంది. ఎందుకంటే ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు పేర్లతో పొలాలు ఉండడంతో విడివిడిగా రుణాలు తీసుకుని ఉంటారు. అందులోనూ బంగారంతోపాటు పంట రుణాలు కూడా తీసుకుని ఉంటారు.



 అయితే కుటుంబం మొత్తం మీద ఒక్కరికే లక్షన్నరకే కుదించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. బంగారు రుణాలు, ఇతరత్రా రుణాలతో సంబంధం లేకుండా కేవలం పంట రుణాలు అన్ని బ్యాంకులతో కలిపి 2.76 లక్షల మంది రైతులు రూ. 1088 కోట్ల రుణాలను తీసుకున్నారు. అయితే, తీసుకున్న రుణాలన్నీ మొత్తం మాఫీ అవుతాయని రైతన్నలు గంపెడు ఆశతో ఉండగా, ప్రస్తుత కరువు పరిస్థితుల నేపథ్యంలో బాబు ప్రకటన జిల్లా ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ఏదో చేస్తాడని భావించిన రైతన్నలు ప్రస్తుత పరిస్థితులను చూసి మొదటి సంతకం చేసిన రుణ మాఫీని ఇలా చేశావేంటి బాబూ అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అటు మహిళలు, ఇటు రైతన్నల తలపై బాబు శఠగోపం పెట్టాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top