అవగాహన లోపంతోనే మైనార్టీల వెనుకబాటు

అవగాహన లోపంతోనే మైనార్టీల వెనుకబాటు


రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్

కర్నూలు(అర్బన్):
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సమగ్ర అవగాహన లేకపోవడంతో మైనార్టీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అబిద్ రసూల్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచైనా జిల్లా అధికారులందరూ తమ శాఖ ద్వారా అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను నియమ నిబంధనలతో ఉర్దూ, తెలుగు భాషలో కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయడంతో పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో ప్రధానమంత్రి 15 అంశాల పథకం, మైనార్టీలకు అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి సమీక్షా నిర్వహించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను మైనార్టీ వర్గాలు సద్వినియోగం చేసుకునే విధంగా పెద్దల ద్వారా చైతన్యం తీసుకురావాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ, శాసనసభ్యులు, ఎన్‌జీఓలు అందించిన సమాచారం మేరకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అన్ని విషయాలను చర్చించి మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మైనార్టీ జనాభా అధికంగా ఉండే కర్నూలు జిల్లాకు బడ్జెట్‌ను అధికంగా కేటాయించాలన్నారు. సమావేశంలో కర్నూలు ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి, మైనార్టీ కమిషన్ సభ్యులు గౌతంజైన్, సుర్జీత్‌సింగ్, ఏజేసీ రామస్వామి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి షేక్ మస్తాన్‌వలి, డ్వామా, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్, మెప్మా, హౌసింగ్ పీడీలు పుల్లారెడ్డి, రామక్రిష్ణ, ముత్యాలమ్మ, రామాంజనేయులు, ఎన్. రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, మైనార్టీ కార్పొరేషన్ ఈడీ షేక్ కరీముల్లా, రాయలసీమ పుకార్ కమిటీ అధ్యక్షుడు ఎస్ నజీర్ అహ్మద్, ఎన్‌జీఓలు రోషన్‌అలీ, జి. జాన్ క్రిష్టఫర్ తదితరులు పాల్గొన్నారు.

 

బాలికలకు సాయం అందేలా చూస్తాం:

ఇటీవల కర్నూలులో అత్యాచారానికి గురైన ఏడేళ్ల బాలికకు రూ.5 లక్షలు ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వాన్ని కోరతామని అబీద్ రసూల్ ఖాన్ చెప్పారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక బంధువులను ఆయన కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతు అలాగే బాలిక కుటుంబానికి ప్రభుత్వం గృహ వసతి కల్పించాలని, తల్లిదండ్రుల్లో ఒకరికి అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగం కల్పించాలని, బాలిక విద్యను ప్రభుత్వం భరించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు.

 

ఉర్దూ పాఠశాలల సమస్యలు పరిష్కరించండి

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) :
ఉర్దూ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ఉర్దూ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి దాదాపీర్ రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్  రసూల్‌ఖాన్‌కు స్టేట్ గెస్ట్‌హౌస్‌లో కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు నమాజ్ చేసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top