కార్మిక సంఘాల జైల్‌భరో


విజయనగరం క్రైం:  కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ కార్మిక చట్టాల్లో తెస్తున్న మార్పులకు నిరసనగా  జిల్లా కేంద్రంలోని  పోస్టాఫీసు కార్యాలయం వద్ద గురువారం నిరసనకు దిగారు. కార్మిక సంఘాల జైల్ భరో కార్యక్రమం పిలుపులో భాగంగా   పోస్టాఫీసు కార్యాలయం ముందు కూర్చుని నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఎం.ఆర్.కళాశాల జంక్షన్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం బొగ్గురంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి  ఇన్సూరెన్స్‌లో రంగంలో విదేశీ పెట్టుబడి వాటాను 49 శాతానికి  పెంచుతూ అర్డినెన్స్‌లు తెచ్చిందన్నారు.

 

 రైతుల ఆమోదంలేకుండా కార్పొరేట్ కంపెనీలకు భూ సమీకరణచేయడానికి చట్టంలో అర్డినెన్స్ ద్వారా మార్పులు చేసి, రైల్వే, రక్షణ ఇతర రంగాల్లో కూడా విదేశీపెట్టుబడులు తేవడానికి మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు.  ఆరోగ్యం, ఉపాధి ఇతర సామాజిక రంగాలకు బడ్టెట్ కేటాయింపుల్లో పెద్ద ఎత్తున కోత పెట్టిందన్నారు. ప్రభుత్వ రంగాన్ని, సామాజిక పథకాలను కాపాడుకోవాల్సి ఉందన్నారు. సింగపూర్ లాంటిరాజధాని, ప్రపంచ స్థాయి రాజధాని, గ్రిడ్లు, స్మార్ట్‌ల పేర్లతో ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నాన్న రాష్ట్ర ప్రభుత్వం కార్మికులపై నిర్భంధానికి పూనుకుంటోందని  ఆరోపించారు. పెట్టుబడిదారులతో చర్చలు చేస్తున్న ప్రభుత్వం ప్రధాన కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలతో  చర్చించడానికి నిరాకరిస్తోందన్నారు.

 

 కార్మిక సంఘాల ఆందోళన సందర్భంగా జిల్లా కేంద్ర పోస్టల్ కార్యాలయంలో  వన్‌టౌన్ పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు  అనంతరం ఎం.ఆర్.కాలేజీ జంక్షన్ వద్ద  కార్మిక సంఘ నాయకులను అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి  టి.వి.రమణ, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.కృష్ణంరాజు, ఆల్తి అప్పలనాయుడు,బుగత సూరిబాబు, ఆల్తి మారయ్య,   ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు మొదిలి శ్రీనివాస్, అచ్చయ్య, ఇప్టూ నేత  దవళ లక్ష్మణరావు పాల్గొన్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top